స్థలాల క్రమబద్దీకరణకు మళ్లీ చాన్స్‌

రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి స్థలాల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. గతంలో జారీ చేసిన 58, 59 జీఓల కింద ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు ప్రక్రియ మళ్లీ షురూ అయింది. మరో నెలరోజుల పాటు గడువు పొడిగించింది. అంతేకాదు కటాఫ్‌ తేదీని కూడా మార్చింది.అసైన్డ్‌, అభ్యంతరం లేని ఇతర ప్రభుత్వ స్థలాలను.. వివిధ సంస్థలకు నిబంధనల మేరకు వాటిపై హక్కులు బదిలీ చేయనున్నారు. ఆక్రమణదారులు 2014 జూన్‌ 2లోపు సంబంధిత స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉండాలన్న నిబంధనను ఇటీవల ప్రభుత్వం సవరించింది. 2020 జూన్‌ రెండో తేదీలోపు వారి అధీనంలో ఉన్నట్లు ఆధారాలు చూపాల్సి ఉంటుంది. గత నెల 17న విడుదల చేసిన కొత్త జీవో 29 ప్రకారం దరఖాస్తులు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం శనివారం విూ సేవా కేంద్రాల్లో జీవో 58, 59 పోర్టల్‌ను తిరిగి తెరిచింది. ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్‌ ఇచ్చింది.సింగరేణి పరిధిలో దరఖాస్తులకు 3 నెలలు అవకాశం ఇచ్చింది. సింగరేణి పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల పరిధిలో సింగరేణి క్యాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ భూములు ఆక్రమించుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రభుత్వం ప్రకటించిన క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా… 125 చదరపు గజాల్లోపు స్థలాలను ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్నవారికి ఉచితంగా క్రమబద్ధీకరణ అవుతుంది. ఇక 126 నుంచి 250 చదరపు గజాల వరకు ఆక్రమించినవా రు భూమి మార్కెట్‌ ధరలో 50 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. 251 నుంచి 500 చదరపు గజాల వరకు విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించుకున్నవారు మార్కెట్‌ ధరలో 75 శాతం ఫీజు చెల్లించాలి. 500 నుంచి 1000 గజాల వరకు ఉంటే ప్రభుత్వ ధరను వంద శాతం చెల్లించాల్సి ఉంటుంది. క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి విూ `సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నివాసానికి సంబంధించిన పలు ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆర్డీవో చైర్మన్‌గా, తహసిల్దార్‌ సభ్యులుగా ఉండే కమిటీ ఈ దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *