కర్ణాటక సంగీత రారాజు త్యాగరాజు నేడు ఆయన జయంతి

త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై అతనికిగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై అతనుకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి.ఇతను కర్ణాటక సంగీత త్రయంలో మరో ఇద్దరైన శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులకు సమకాలికుడు కూడా. వీరు ముగ్గురూ తమిళనాడులోని, తంజావూరు జిల్లా, తిరువారూరుకు సంబంధించిన వారే. తమిళదేశంలో పుట్టి పెరిగినా వారి గానం ఎక్కువగా తెలుగు, సంస్కృతాల్లోనే సాగింది.రామభక్తులైన శ్రీ త్యాగరాజులవారు 1767 మే 4న రామబ్రహ్మం, సీతమ్మ దంపతులకు 3 వ సంతానంగా తంజావూరు జిల్లాలోని తిరువారూరులో జన్మించారు. వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రకాశం జిల్లా, కంభం మండలంలోని కాకర్ల గ్రామానికి చెందినవారు. వారు తమిళనాడుకు వలసి వెళ్ళి తిరువారూరు లో స్థిరపడ్డారు. వారికి రామభక్తి , సంగీతం స్వతహాగా తల్లితండ్రులనుండి వచ్చాయి.తల్లి సీతమ్మ ప్రతిరోజు చేసే రామపంచాయతన పూజలో త్యాగరాజుల వారు పురందర దాస, రామదాస, అన్నమయ్య, నారాయణతీర్థ, జయదేవుల సంకీర్తనలను పాడేవారు. సంస్కృతము, తెలుగు, ఇతర శాస్త్రాలను తండ్రి వద్ద అభ్యసించారు. రామాయణ మహాభారతాలను ఆపోశన పట్టారు. 13 యేండ్ల చిరు ప్రాయంలో ‘నమో నమో రాఘవాయ ‘ అనే కీర్తనను స్వరపరిచి ఇంటి గోడవిూద రాశారు. ఇదే వారి మొదటి సంకీర్తన. త్యాగరాజుకి సంగీతం విూద వున్న శ్రద్ధను గమనించిన తండ్రి, శొంఠి వెంకట రమణయ్య గారి వద్ద సంగీతాభ్యాసానికి చేర్చారు. ‘ఇంతింతై వటుడిరతై’ అన్నట్టు వారి సంగీత సముపార్జన దినదిన ప్రవర్థమానమయింది. శ్రీ రామకృష్ణానంద స్వామివారు వారికి రామతారక మంత్రాన్ని ప్రసాదించారు. 96 కోట్ల రామనామ జపాన్ని త్యాగరాజ స్వామి పూర్తి చేశారు. నారదులవారు కలలో సాక్షాత్కరించగా నారద పంచరత్నాలను రచించారు.ఐహిక సుఖాలపై త్యాగరాజుల వారికి ఏ మాత్రం మక్కువ ఉండేది కాదు. నిరంతరం రామసంకీర్తనామృతంలో మునిగి తేలేవారాయన. త్యాగరాజులోని బాల మేధావిని గుర్తించి వారి గురువుగారు తంజావూరు రాజుగారికి చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన, కనక, వస్తు వాహనాది లాంఛనాలతో సభకు ఆహ్వానించాడు.కాని త్యాగరాజు నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సుఖమా అనే సంకీర్తనను పాడి రాజు పంపిన కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ఈ చర్యకు ఆగ్రహించిన అతని అన్నయ్యగారు జపేశుడు త్యాగరాజు నిత్యం పూజించుకొనే శ్రీ రామ పట్టాభిషేక విగ్రహాలను కావేరి నదిలో విసిరి వేశాడు. శ్రీ రామ వియోగ బాధను తట్టుకోలేని త్యాగరాజు శోకించి, దుఖించి ఆర్త హృదయుడయ్యాడు.కంచీపురానికి చెందిన ఉపనిషద్‌ బ్రహ్మేంద్రస్వామి వారి ఆదేశానుసారం తీర్థయాత్రలకు తరలి వెళ్ళారు. తిరుపతి, షోలింగపట్నం, నాగపట్నం, వలాజిపేట, శ్రీరంగం వంటి అనేక పుణ్యక్షేత్రాలను, తీర్థాలను దర్శించి ఆయా పుణ్యక్షేత్రాలలోని మూలవిరాట్‌ లపై భక్తిపారవశ్యం లో ఆసువుగా అనేక కీర్తనలను పాడారు. ఆ పరంపరలో లాల్గుడి పంచరత్నాలు, కోవూరు పంచరత్నాలు, తిరువత్తియార్‌ పంచరత్నాలు లాంటి గుఛ్ఛకృతులు కూడా చేశారు. వారు రచనలను ఎప్పుడూ గ్రంధీకరించలేదు. వారి శిష్యులు వారు పాడుతూండగా వాటిని వ్రాసేవారు.వారికి ఒకనాడు కలలో రాములవారు సాక్షాత్కారమై విగ్రహాల జాడ తెలియజేశారు. ఆ విగ్రహాలను కనుగొని ‘‘కనుగొంటిని శ్రీరాముని నేడు’’ అని భక్తిపారవశ్యంలో ఓలలాడాడు. జానెడు పొట్టనింపుకోవడానికి ధనాపేక్ష యేల అని ఊంఛవృత్తిని స్వీకరించాడు.త్యాగరాజస్వామి కృతులలో సంగతులను వేయడం, నెరవు పద్ధతిలో కృతులను స్వరపరచడం లాంటి కొత్త ఒరవడులను సంగీత లోకానికి పరిచయం చేశారు. వారి రచనలు పండితపామర జనరంజకంగా సాగాయి. సంగీతాభ్యాసం చేసేవారి స్థాయికి తగినట్లుగా వారు రచనలు చేశారు. కొంతమేరకు సంగీత పరిజ్ఞానం వచ్చిన వారు నేర్చుకోవడానికి వీలుగా ‘దివ్య నామ కీర్తనలు’ , ‘ఉత్సవ సంప్రదాయ కీర్తనలు’ చేయగా,కొంత ప్రావీణ్యం సంపాదించిన వారికి తగ్గట్టుగా క్లిష్ట సంగతులతో కూడిన కృతులను చేశారు. దాదాపు 212 రాగాలలో వారి రచనలు సాగాయి. ఘన రాగాలలో చేసిన పంచరత్న కీర్తనలు విశ్వవిఖ్యాతం అయ్యాయి. నౌకాచరితం, ప్రహ్లాద చరిత్ర అనే రెండు గేయ నాటకాలను కూడా చేశారు.త్యాగరాజ స్వామిని వాల్మీకి అవతారంగా భావిస్తారు. వాల్మీకి 24000 శ్లోకాలతో రామాయణం రాస్తే, త్యాగరాజ స్వామి 24000 కృతులు, కీర్తనలను రచించి రామార్పణం చేశారు. అవతార పురుషుడైన శ్రీ త్యాగరాజ స్వామి జనవరి 6 ,1847 న తిరువయ్యారు లో దివ్య సమాధి చెందారు. రామ సంకీర్తనామృతంలో సాగిన ఆ మహా పురుషుని 80 ఏళ్ళ ఆధ్యాత్మిక జీవనం భావితరాల భారతీయులందరికీ ఆదర్శప్రాయం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *