జైల్‌ సూపరింటెండెంట్‌ ఆకస్మిక బదిలీ

రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.రాజారావు ఆకస్మిక బదిలీ అయ్యారు. విశాఖ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్‌.రాహుల్‌ను రాజమండ్రికి నియమించారు. రాజారావును నెల్లూరులోని కేంద్ర కారాగారాల శిక్షణ ప్రిన్సిపాల్‌గా బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం సూపరింటెండెంట్‌ ఆకస్మిక బదిలీ చుట్టూ రాజకీయం అలముకుంది.రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మామ ఆదిరెడ్డి అప్పారావు, భర్త ఆదిరెడ్డి వాసు అరెస్టుల అనంతరం రిమాండ్‌లో భాగంగా రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఆదిరెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న చిట్‌ఫండ్‌ కంపెనీల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సీఐడీ పోలీసులు ఆ కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి ఆదిరెడ్డి అప్పారావు, వాసులను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆదిరెడ్డి కుటుంబాన్ని టీడీపీ నాయకులు వరుసగా వచ్చి కలుస్తుండడం, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం జరుగుతోంది.టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వచ్చి ములాఖత్‌ ద్వారా సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆదిరెడ్డి అప్పారావు, వాసులను కలిసేందుకు దరఖాస్తు చేయించారు. అయితే ఈ ప్రక్రియ అంతా మెయిల్‌ ద్వారా చేపట్టగా దీనికి సూపరెంటెండెంట్‌ రాజారావు అనుమతిని ఇచ్చారు. చంద్రబాబుతోపాటు మరో వ్యక్తికి మాత్రమే ములాఖత్‌ అవకాశం కల్పించారు. మెయిల్‌ ద్వారా ములాఖత్‌కు దరఖాస్తు చేయడమే కాకుండా మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ ద్వారా నేరుగా జైలు సూపరింటెండెంట్‌ ను కలిసి ములాఖత్‌ అనుమతి కోసం పత్రాలు సమర్పించేందుకు వెళ్లగా దానికి అధికారులు తిరస్కరించారు. అప్పటికే మెయిల్‌ కు తమకు వివరాలు అందాయని, ఇక అవసరం లేదని తిరస్కరించారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.రాజారావు ఆకస్మిక బదిలీ వెనుక రాజకీయ కోణం ఉందని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. ఆయన నిబంధనల ప్రకారమే చంద్రబాబుకు ములాఖత్‌ ద్వారా కలిసేందుకు అనుమతి ఇచ్చారని, దీంట్లో ఆయన చేసిన తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. అయితే రిమాండ్‌లో సెంట్రల్‌ జైలులో ఉన్న ఆదిరెడ్డి అప్పారావు, వాసులకు జైలులో రాచమర్యాదలు చేయిస్తున్నారని, టీడీపీ నాయకులు కలిసేందుకు అనుమతులు ఇస్తున్నారని ప్రధాన ఆరోపణలు చేస్తూ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఇంచార్జి మిధున్‌రెడ్డికి ఫిర్యాదు చేశారని, ఈ క్రమంలోనే ఆయన అధిష్టానంతో మాట్లాడి వెంటనే రాజారావును వేరే చోటకు ఆకస్మికంగా బదిలీ చేయించారని పొలిటికల్‌ సర్కిల్‌లో సర్క్యులేట్‌ అవుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *