ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ ఆపరేషన్‌కు శ్రీసిటీలోని ‘బీ-రోలెక్స్‌’ సాంకేతిక సహకారం

ఉత్తరాఖండ్‌ టన్నెల్‌లో చిక్కుకుపోయిన కూలీలను కాపాడిన బృందంలో తిరుపతి జిల్లా శ్రీసిటీలోని బీ-రోలెక్స్‌ పరిశ్రమ టీమ్‌ కీలక పాత్ర పోషించింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లా సిల్క్యారా వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో 41 మంది కూలీలు టన్నెల్‌లోనే చిక్కుకుని, 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. అయితే వారిని బయటకు తీసుకొచ్చేందుకు అవిశ్రాంతంగా చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌కు శ్రీసిటీలోని బీ-రోలెక్స్‌ పరిశ్రమ సాంకేతిక సహకారం అందించింది. నవంబరు 25న డ్రిల్లింగ్‌ యంత్రం విరిగిపోవడంతో పనులు ముందుకు కదలక సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణంలో పర్యవేక్షక అధికారులు డీఆర్డీవో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ సతీశ్‌రెడ్డిని సాయం కోరారు. ఆయన వివిధ ఏజెన్సీలను సంప్రదించగా.. బీ-రోలెక్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై శ్రీనివా్‌సరెడ్డి వెంటనే స్పందించి డ్రిల్లింగ్‌కు ప్రత్యామ్నాయమైన ప్లాస్మా ఆధారిత కటింగ్‌ పద్ధతిని ప్రతిపాదించారు. అలాగే 3 గంటల వ్యవధిలోనే రెండు పోర్టబుల్‌ ప్లాస్మా కటింగ్‌ మెషిన్లను సిద్ధం చేశారు. గతంలో తన కంపెనీకి ప్లాస్మా మిషన్లను సరఫరా చేసిన పార్క్‌ ఇండస్ట్రీ్‌సను సంప్రదించి, 800 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న పైపులో పట్టే రెండు పోర్టబుల్‌ మిషన్లను సరఫరా చేయడంలో తోడ్పాటునందించారు. దాంతోపాటు ప్లాస్మా కట్టర్లను వినియోగించే ముగ్గురు నిపుణుల బృందాన్ని (సంతోశ్‌ కుమార్‌, అజయ్‌షా, నాగరాజు) కూడా ఘటనా స్థలానికి పంపించారు.

ఈ బృందం కోసం కేంద్ర ప్రభుత్వం వాయుసేనకు చెందిన విమానాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. కట్టర్‌ నిపుణులు కొన్ని గంటల వ్యవధిలో సహాయక చర్యలకు అడ్డుపడిన యంత్రపు ముక్కలను తొలగించారు. ఆ తర్వాతే 800 మి.మీ. పైపును ముందుకు తీసుకెళ్లగలిగారు. వేగంగా స్పందించి నిపుణుల బృందాన్ని పంపిన బీ-రోలెక్స్‌ ఎండీ శ్రీనివాసరెడ్డిని శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి అభినందించారు.

3 రెట్లు సమయం ఆదా

ఎల్‌పీజీని ఉపయోగించి కట్‌ చేయలేని లోహాలు, వస్తువులను ప్లాస్మా కట్టర్‌ ద్వారా కట్‌ చేస్తారు. కొద్దిగా ఎక్కువ వ్యయం అయినా.. ప్లాస్మా కట్టింగ్‌లో 3 రెట్లు సమయం ఆదా అవుతుంది. ప్లాస్మా కట్టర్‌లో కంప్రెస్డ్‌ ఎయిర్‌ను అధిక ఒత్తిడితో పంపి ఎలక్ట్రిక్‌ ఆర్క్‌ను వినియోగించి ప్లాస్మాను జనరేట్‌ చేసి మెటల్స్‌ను కట్‌ చేస్తారు. అన్ని రకాల ఇంజినీరింగ్‌ ఇండస్ట్రీ్‌సలో ప్లాస్మా కటింగ్‌ విధానాన్ని వినియోగిస్తారని.. ప్లాస్మాకు కూడా కట్‌ కాని మెటల్స్‌ను కట్‌ చేయడానికి లేజర్‌ కట్టర్‌ను వినియోగిస్తారని శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *