ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ మనమ్మాయిలదే

స్పిన్‌ ద్వయం శ్రేయాంక పాటిల్‌ (4/13), మన్నత్‌ కశ్యప్‌ (3/20) తిప్పేసిన వేళ బంగ్లాదేశ్‌ను 31 పరుగులతో చిత్తు చేసిన భారత్‌ ‘ఎ’ జట్టు తొలి ఉమెన్స్‌ ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ టీ20 టోర్నీ విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 31 పరుగులతో గెలిచింది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 127/7 స్కోరు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొనే యత్నంలో భారత స్పిన్నర్లు శ్రేయాంక, మన్నత్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో బంగ్లాదేశ్‌ ‘ఎ’ 19.2 ఓవర్లలో 96 రన్స్‌కే కుప్పకూలింది. నహీదా అక్తర్‌ (17 నాటౌట్‌), శోభన (16), రాణి (13) రాణించారు. పాటిల్‌, మన్నత్‌కు కనిక అహూజా (2/23) తోడవడంతో బంగ్లా విలవిలలాడింది. అంతకుముందు భారత్‌ను బంగ్లా బౌలర్లు కుదురుకోనీయలేదు. దినేశ్‌ వ్రింద (29 బంతుల్లో 36) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. కనిక (23 బంతుల్లో 30 నాటౌట్‌) సత్తా చాటింది. వీరిద్దరుగాక కీపర్‌ ఉమా ఛెత్రి (22), కెప్టెన్‌ శ్వేత (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. నహీదా అక్తర్‌ (2/13), ఆఫ్‌ స్పిన్నర్‌ సుల్తానా (2/30) చెరో రెండు వికెట్లు తీశారు. కనిక అహూజా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, శ్రేయాంక పాటిల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచారు. శ్రీలంకతో సెమీఫైనల్‌ వర్షంతో రద్దవడంతో భారత్‌ టైటిల్‌ ఫైట్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఫైనల్‌ చేరే క్రమంలో మనోళ్లు ఒక్క మ్యాచే ఆడడం గమనార్హం. ఆతిథ్య హాంకాంగ్‌తో జరిగిన ఆ పోరులో భారత్‌ ‘ఎ’ 9 వికెట్లతో నెగ్గింది. సెమీస్‌ సహా మొత్తం 3 భారత్‌ మ్యాచ్‌లు వరుణుడి బారిన పడ్డాయి.

సంక్షిప్తస్కోరు్ల

భారత్‌ ‘ఎ’: 20 ఓవర్లలో 127/7 (దినేశ్‌ వ్రిందా 36, కనిక 30 నాటౌట్‌, ఉమ 22, నిదా 2/13, సుల్తానా 2/30).

బంగ్లాదేశ్‌ ‘ఎ’: 19.2 ఓవర్లలో 96 ఆలౌట్‌ (నిదా అక్తర్‌ 17 నాటౌట్‌, శ్రేయాంక 4/13, మన్నత్‌ 3/20, కనిక 2/23).

Leave a comment

Your email address will not be published. Required fields are marked *