ఖమ్మం బాధ్యతలు హరీష్‌ రావుకే..?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టు జారకుండా ఉండేందుకు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి కేటీఆర్‌కు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి మధ్య దోస్తానా ఎక్కువ. ఇప్పటికే పలుమార్లు పొంగులేటి పార్టీని వీడకుండా చర్యలు చేపట్టారు. ఇదే విషయాన్ని పొంగులేటి సైతం పలుమార్లు విూడియా ముందు పేర్కొన్నారు.అయినప్పటికీ అసంతృప్తితో పార్టీని వీడటంతో కేటీఆర్‌కు ఖమ్మం జిల్లా బాధ్యతలను అప్పగిస్తే బాగుండదని, విమర్శలు, ప్రతి విమర్శలు ఉండవని అధిష్టానం భావించినట్లు పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు.పొంగులేటి పలు సందర్భాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వను అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న అధిష్టానం హరీశ్‌ రావుకు అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయినర్‌ బాధ్యతలను అప్పగించినట్లు పార్టీలోని కీలక నేత ఒకరు తెలిపారు. పొంగులేటి దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే హరీశ్‌ తో సాధ్యమని నేతలు సైతం అభిప్రాయపడుతున్నారుమాజీ ఎంపీ పొంగులేటి వెంట బీఆర్‌ఎస్‌కు చెందిన కేడర్‌ వెళ్లకుండా సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలిసింది. ఇప్పటికే కొంతమంది నేతలు బీఆర్‌ఎస్‌లో కొనసాగుతూ పొంగులేటి వెంట తిరుగుతున్నారు. అయితే వారితో కూడా త్వరలోనే మంతనాలు చేయనున్నట్లు తెలిసింది. ఆఫర్లు సైతం ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే ఇప్పటి వరకు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలపై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలకు వెనుకంజ వేస్తున్నారని సమాచారం. ఎన్నికల ముందు పార్టీని వీడితే ఎఫెక్ట్‌ పడుతుందని, అందుకే చూసీచూడనట్లు అధిష్టానం వ్యహరిస్తుంది. మంత్రి ఖమ్మంలో పార్టీని గట్టెక్కిస్తారా? పొంగులేటి చేతిలో పెడతారా? అనేది పార్టీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయినర్‌గా ఖమ్మం జిల్లా బాధ్యతలను పార్టీ అధిష్టానం ట్రబుల్‌ షూటర్‌ మంత్రి హరీశ్‌ రావుకు అప్పగించినట్లు సమాచారం. పొంగులేటిని ఢీకొట్టేందుకు అతడే కరెక్ట్‌ అని నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందులో భాగంగానే సత్తుపల్లి నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌ పాల్గొన్నట్లు చర్చ సాగుతోంది. జిల్లాపై పట్టుసాధించేందుకు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ హై కమాండ్‌ పక్కా ప్లాన్‌ ఖరారు చేసినట్లు తెలిసింది. ఎవరు కూడా పొంగులేటి వెంట పోకుండా ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై అధిష్టానం ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఏ ఎన్నికలైనా ఇన్‌చార్జి బాధ్యతలను సక్సెస్‌ ఫుల్‌గా నిర్వర్తిస్తాడని, పార్టీని గట్టెక్కిస్తాడని హరీశ్‌ రావుకు పేరుంది. అయితే ఇప్పటికే కేసీఆర్‌ సిట్టింగ్‌లకే టికెట్లు అని ప్రకటించడం.. వారిని విజయతీరాలకు చేర్చేందుకే హరీశ్‌ రావుకు బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో భాగంగానే సత్తుపల్లిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారనే ప్రచారం ఊపందుకున్నది.గత ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీలో మాత్రమే బీఆర్‌ఎస్‌ విజయం సాధించగా, మిగిలిన 9 నియోజకవర్గాల్లో 7 కాంగ్రెస్‌, 2 టీడీపీ విజయం సాధించింది. అందులో భద్రాచలం, ములుగు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్‌ను వీడలేదు. మిగిలిన నేతలంతా అధికార పార్టీలో చేరారు. ఈసారి ఉమ్మడి జిల్లాలోని 10స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. అందుకోసం పార్టీ అధిష్టానం ఇప్పటికే ఎమ్మెల్యేలకు, నేతలకు సైతం షెడ్యూల్‌ ఇచ్చినట్లు సమాచారం. దాని ప్రకారమే జిల్లాలో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని తెలిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *