లిట్మస్‌ టెస్ట్‌ కు రెడీ అవుతున్న పార్టీలు

తెలంగాణలో పట్టు పెంచుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది, ఆ విషయంలో ఎవరికీ అనుమానం లేదు. అయితే, రాష్ట్రంలో నిజంగా బీజేపీ బలం పెరుగుతోందా, అంటే, అంత గట్టిగా జవాబు రాదు. ఇప్పటికీ, రాష్ట్రంలో బీజేపీది కాంగ్రెస్‌ తర్వాతి స్థానమే,అయినా, పార్టీ జాతీయ నాయకత్వం మాత్రం, రాష్ట్ర నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉందని, అంటున్నారు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నాయకత్వం విషయంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌ మొదలు జాతీయ నేతలు బండిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.నెలరోజుల క్రితం, జూలై మొదటి వారంలో హైదరాబాద్‌ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా, సికింద్రాబాద్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ లో బహిరంగ సభను నిర్వహించారు. ఆ సభలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజనాథ్‌ సింగ్‌, గడ్కరీ,ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ సహా అనేక మంది జాతీయ రాష్ట్ర నాయకులు ప్రసంగించారు. అదే సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ని ఒకసారి కాదు రెండు సార్లు భుజం తట్టి మరీ మెచ్చుకున్నారు. సభను సక్సెస్‌ చేసినందుకు అభినందించారు. రాష్ట పార్టీ నాయకత్వంపై విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అలాగే, అంతకు ముందు బండి సంజయ్‌ రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగుడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా బండిని మెచ్చుకున్నారు. కేసీఆర్‌ ను గద్దెదించేందుకు బండి సంజయ్‌ చాలని, తాను రాష్ట్రానికి రావాలసిన అవసరం లేదని అన్నారు. అలాగే, మోడీ, షా, నడ్డాతో పాటుగా ఇతర జాతీయ నేతలు రాష్ట్రంలో సంజయ్‌ నాయకత్వంలో బీజేపీ పనితీరును అనేక సందర్భాలలో మెచ్చుకున్నారు. అందుకే, బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.తాజాగా బీహార్‌ రాజధాని పాట్నాలో జరిగిన, బీజేపీ మోర్చాల జాతీయ సమ్మేళనంలో ప్రసంగించిన అమిత్‌ షా తెలంగాణలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు చేస్తున్న పోరాటాల స్ఫూర్తితో మోర్చాల నేతలు పని చేయాలని ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న పోరాటాలను అమిత్‌ షా పలుమార్లు ప్రస్తావించారు.బండి సంజయ్‌ పాదయాత్రల గురించి ప్రస్తావించారు. అయితే, నిజంగా రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుంటోందా? లేక వాపును చూసి బలుపును అనుకుంటోందా? అంటే, ఏది ఎలా ఉన్నా, బీజేపీ తెలంగాణను టార్గెట్‌ చేసింది, అనేది మాత్రం నూటికి నూరు శాతం నిజమని పరిశీలకులు పేర్కొంటున్నారు.అయితే, మునుగోడు ఉప ఎన్నిక వస్తే, ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మాత్రం ఇక ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని అంటున్నారు. అందుకే కాంగ్రెస్‌ కు అయినా కమలానికి అయినా మునుగోడే … లిట్మస్‌ టెస్ట్‌ .. అంటున్నారు. అలాగే, అధికార తెరాస భవిష్యత్‌’ను కూడా మునుగోడు డిసైడ్‌ చేస్తుందని అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *