జొకో సాధించేనా

న్యూయార్క్‌: ఈ ఏడాది ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే పోటీల్లో 20 ఏళ్ల యువ సంచలనం, నెంబర్‌వన్‌ సీడ్‌ కార్లోస్‌ అల్కరాస్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో పోలెండ్‌ భామ ఇగా స్వియటెక్‌ తన టైటిల్‌ను కాపాడుకోవాలనుకుంటోంది. కానీ ఈసారి అందరి దృష్టి వరల్డ్‌ నెంబర్‌ 2 జొకోవిచ్‌పైనే ఉండనుంది. 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై కన్నేసిన తను రెండేళ్ల అనంతరం యూఎస్‌ ఓపెన్‌లో ఆడబోతున్నాడు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోని కారణంగా గతేడాది ఈ గ్రాండ్‌స్లామ్‌కు దూరమయ్యాడు. దీంతో స్పెయిన్‌ కుర్రాడు అల్కరాస్‌ తొలిసారి విజేతగా నిలిచాడు. అలాగే జొకో చివరిసారిగా పాల్గొన్న 2021 టోర్నీ లో రన్నర్‌పగా నిలిచినా.. ఈసారి మాత్రం నాలుగో యూఎస్‌ ఓపెన్‌ను ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాడు. 2011, 2015, 2018లలో చాంపియన్‌గా నిలిచిన జొకోకు అల్కరాస్‌ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ స్టార్‌ ప్లేయర్స్‌ మధ్య మ్యాచ్‌ ఫ్యాన్స్‌ను మరోసారి కనువిందు చేయనుంది. వింబుల్డన్‌ ఫైనల్లో అల్కరాస్‌ చేతిలోనే జొకో ఓడిన విషయం తెలిసిందే. ఆ ఓటమితో అతడి 24 గ్రాండ్‌స్లామ్స్‌ రికార్డుకు కాస్త బ్రేక్‌ పడింది. కానీ గత వారమే సిన్సినాటి మాస్టర్స్‌ ఫైనల్లో దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించి అల్కరా్‌సపై జొకో నెగ్గాడు. అదే జోరును ఇక్కడా కొనసాగించాలనుకుంటున్నాడు. మంగళవారం తొలి రౌండ్‌లో అలెగ్జాండ్రె ముల్లర్‌ను జొకోవిచ్‌ ఎదుర్కొంటాడు. మెద్వెదేవ్‌, కాస్పర్‌ రూడ్‌, జ్వెరేవ్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

గాఫ్‌పై అంచనాలు

మహిళల విభాగంలో అమెరికన్‌ టీనేజర్‌, ఆరో సీడ్‌ కొకో గాఫ్‌ కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ కోసం ఉవ్విళ్లూరుతోంది. ఇటీవలి సిన్సినాటి మాస్టర్స్‌లో స్వియటెక్‌ను ఓడించి గాఫ్‌ టైటిల్‌ అందుకుంది. ఇక్కడా క్వార్టర్స్‌లో ఈ ఇరువురు తలపడే అవకాశం ఉంది. చివరిసారిగా స్లోన్‌ స్టీఫెన్స్‌ (2017), ఆండీ రాడిక్‌ (2003) యూఎస్‌ ఓపెన్‌ సాధించిన అమెరికన్స్‌గా నిలిచారు. మరోవైపు గాయాల కారణంగా మహిళల సింగిల్స్‌ మాజీ చాంపియన్‌ బినాక ఆండ్రెస్క్యూ (కెనడా) పోటీల నుంచి తప్పుకొంది.1 యూఎస్‌ ఓపెన్‌ చరిత్రలో అత్యంత పిన్నవయస్సులోనే (20 ఏళ్ల 115 రోజులు) నెంబర్‌వన్‌ సీడ్‌గా బరిలోకి దిగబోతున్న కార్లోస్‌ అల్కరాస్‌. గతంలో ఆష్లే కూపర్‌ (1957 యూఎస్‌ ఓపెన్‌, 20 ఏళ్ల 359 రోజులు) పేరిట ఈ రికార్డు ఉండేది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *