ఖమ్మం సీపీఐలో ముసలం

ఖమ్మం, అక్టోబరు 17
కాంగ్రెస్‌, సీపీఐ పొత్తుపై స్థానిక సీపీఐ నేతలు మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా సీపీఐకి కాంగ్రెస్‌ చెన్నూరు, కొత్తగూడెం టికెట్లు ఇచ్చింది. సీపీఐ బలంగా ఉన్న మునుగోడు సీటు వదులుకోవడంపై స్థానిక సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), కాంగ్రెస్‌ తో ఎన్నికల పొత్తుపై నల్లగొండ జిల్లా సీపీఐ మండిపడుతోంది. పొత్తులో భాగంగా మునుగోడు అసెంబ్లీ సీటు కోసం ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం పట్టుబట్టకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. మునుగోడు నియోజకవర్గం నుంచి సీపీఐ సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించింది. కానీ సీపీఐ ఈసారి మునుగోడును కోరలేదు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, ఆదిలాబాద్‌ జిల్లా చెన్నూరు నియోజకవర్గాలను కేటాయించే అవకాశం ఉందని తేలడంతో జిల్లా సీపీఐ నిప్పులు చెరుగుతోంది.ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివారావు ప్రాతినిధ్య వహిస్తున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో జరిగిన చివరి ఎన్నికలు 2009లో సాంబశివారావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మరో మారు ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ తో తెగతెంపులు జరిగాక, కాంగ్రెస్‌ కు దగ్గర కావడానికి కూడా ఈ ఎన్నికల్లో కనీసం రెండు మూడు చోట్ల నుంచి పొత్తులో టికెట్లు పొందడమే. ముందు నుంచి జరిగిన ప్రచారం మేరకు సీపీఐ ఏకంగా నాలుగు స్థానాలను కోరుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లి, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం, అదే విధంగా నల్లగొండ జిల్లాలోని మునుగోడు స్థానాలు కావాలని కోరుతూ వచ్చింది. కానీ, ఇంత సంఖ్యలో సీట్లు కేటాయించలేమని రెండు చోట్ల మాత్రమే సర్దుబాటు చేయగలుగుతామని కాంగ్రెస్‌ నాయకత్వం తేల్చి చెప్పింది. ఇందులో కొత్తగూడెం ఇవ్వలేమని కూడా చెప్పినట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ లోకి వచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయాలని మొదట భావించడమే ప్రధాన కారణం. కొత్తగూడెంను కేటాయించలేమని కాంగ్రెస్‌ తేల్చి చెప్పడంతో సీపీఐ ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివారావు నారాజు అయ్యారని, చివరి వరకూ పట్టుబట్టారని చెబుతున్నారు. చివరకు కాంగ్రెస్‌ రెండు సీట్లు ఇవ్వడానికి సిద్ధపడినా.. ఒక జనరల్‌ స్థానం, మరొక రిజర్వుడు స్థానం కేటాయిస్తామని ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు. దీంతో జనరల్‌ స్థానమైన కొత్తగూడెం కోసం మరో జనరల్‌ స్థానమైన మునుగోడును బలిపెట్టి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన చెన్నూరును తీసుకున్నారని జిల్లా సీపీఐ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివారావు తన సీటు కోసం పార్టీని బలితీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గ నాయకులు, జిల్లా సీపీఐ నాయకులు పంచాయితీని తేల్చుకునేందుకు హైదరాబాద్‌ లో సమావేశం అయ్యారు. సోమవారం మునుగోడు నియోజకవర్గంలోనూ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో మునుగోడు నుంచి సీపీఐ తరపున ఉజ్జిని నారాయణ రావు మూడు పర్యాయాలు, ఒక మారు ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, మరో మారు ఉజ్జిని యాదగిరి రావు (నారాయణరావు తనయుడు) ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇంత పట్టున్న మునుగోడును వదలి పార్టీ ఉనికి అంతంత మాత్రంగానే ఉన్న చెన్నూరు ఎలా తీసుకుంటారన్న ప్రశ్నలు వీరు సంధిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *