మళ్లీ తెరపైకి ఇండియా కూటమి

కేంద్రంలో రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఈసారి ఆ దూకుడుకి కళ్లెం వేయాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది కాంగ్రెస్‌. అందుకే ఎన్డీయేకి దీటుగా ఇం.డి.యా పేరుతో కూటమిని ఏర్పాటు చేసింది. అన్ని పార్టీలనూ సమన్వయం చేసుకుంది. ప్రస్తుతం ఈ కూటమిలో దాదాపు 26 పార్టీలున్నాయి. కాంగ్రెస్‌తో సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ బీజేపీని ఓడిరచాలన్న లక్ష్యంతో కొన్ని పార్టీలు కలిసొచ్చాయి. ఈ కూటమి పెట్టనైతే పెట్టారు కానీ అప్పటి నుంచి అంతా సైలెంట్‌ అయిపోయింది. కూటమి ఏర్పాటైన కొద్ది రోజులకే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. కాంగ్రెస్‌ వెంటనే అప్రమత్తమైంది. పూర్తిగా ఈ అసెంబ్లీ ఎన్నికలపైనే ఫోకస్‌ పెట్టింది. కూటమి సంగతి తరవాత చూసుకుందామని వదిలేసింది. తరవాత ఎన్నికలు పూర్తయ్యాయి. నాలుగు రాష్ట్రాల ఫలితాలూ విడుదలయ్యాయి. వీటిలో తెలంగాణ మినహా మిగతా మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కి ఎదురు దెబ్బే తగిలింది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ హవానే కొనసాగింది. ఉత్తరాదిన పూర్తిగా పట్టు కోల్పోయింది కాంగ్రెస్‌ పార్టీ. సౌత్‌లో మాత్రం కర్ణాటక, తెలంగాణను తమ ఖాతాలో వేసుకుంది. ఇది కొంత వరకూ ఊరటనిచ్చినప్పటికీ…నార్త్‌ బెల్ట్‌ని కోల్పోవడం మాత్రం పెద్ద దెబ్బే. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఫలితాలు బీజేపీ జోష్‌ని రెట్టింపు చేయగా…కాంగ్రెస్‌ని నిరాశపరిచింది. తెలంగాణ ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమే. కానీ…ఉత్తరాదిలో పార్టీ ఉనికి ప్రమాదంలో పడిరది. ఈ సమయంలోనే ఇం.డి.యా కూటమి భవిష్యత్‌ ఏంటన్నదే అంతుపట్టకుండా ఉంది. విపక్ష కూటమికి నేతృత్వం వహించే బాధ్యతను కాంగ్రెస్‌ తీసుకుంటుందన్న అధికారిక ప్రకటన ఏవిూ రాలేదు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కన్వీనర్‌గా ఉంటారన్న వార్తలు అప్పట్లో బాగానే వచ్చాయి. కానీ…ఆ పదవిపై పెద్దగా ఆసక్తి లేదని తేల్చి చెప్పారు నితీశ్‌.

నితీశ్‌ తరవాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కీలకంగా వ్యవహరించారు. విపక్ష పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపారు. అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు తన ప్రయత్నం తాను చేశారు. ఇదే సమయంలో 5 రాష్ట్రాల ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ముందు రాష్ట్రాల్లో గెలిస్తే ఆ తరవాత లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టొచ్చని భావించారు. కాంగ్రెస్‌ దృష్టి పెట్టినప్పటికీ కొన్ని సమస్యల కారణంగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌ విపక్ష కూటమిని లీడ్‌ చేయగలుగుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. లోక్‌సభ ఎన్నికల స్ట్రాటెజీలు వేరు అని అంత సులువుగా కొట్టిపారేయలేం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం కచ్చితంగా లోక్‌సభ ఎన్నికలపై ఉంటుంది. ఇదే కాంగ్రెస్‌ని ఇరకాటంలోకి నెట్టింది. కాంగ్రెస్‌ ఓడిపోవడంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన కామెంట్స్‌ని బట్టి చూస్తుంటే కూటమిలో చీలికలు మొదలవుతాయా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో ఓడిపోవడం బీజేపీ సక్సెస్‌ కాదని, కాంగ్రెస్‌ వైఫల్యమే అని తేల్చి చెబుతోంది టీఎమ్‌సీ. జనతా దళ్‌ నేతలూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్‌ ఓడిపోవడం అంటే విపక్ష కూటమి ఓడిపోయినట్టు కాదు’’ అని స్పష్టం చేస్తున్నారు. బీజేపీని కాంగ్రెస్‌ ఢీకొట్టలేదని, ఆ భ్రమ నుంచి ఆ పార్టీ బయటకు రావాలని కొందరు విపక్ష నేతలు నేరుగానే చెబుతున్నారు. డిసెంబర్‌ 6వ తేదీన ఖర్గే నివాసంలో ఇం.డి.యా కూటమి సమావేశం కానుంది. ఈ భేటీకి కొందరు నేతలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. శరద్‌ పవార్‌ కూడా చాలా క్లియర్‌గా ఓ విషయం వెల్లడిరచారు. ఈ ఫలితాలేవ విపక్ష కూటమిపై ప్రభావం చూపించలేవని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పుంజుకోవడాన్ని మాత్రం విపక్షాలు స్వాగతిస్తున్నాయి. ఇది కచ్చితంగా ఆ పార్టీకి మంచి జోష్‌ ఇస్తుందని చెబుతున్నాయి. అయితే…మిగతా మూడు రాష్ట్రాల్లో ఓటమిపై మాత్రం విపక్ష పార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కూటమి వ్యూహాలను మార్చాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నాయి. అంతే కాదు. అసలు కూటమిలో కొనసాగాలా వద్దా అని పునరాలోచనలో పడ్డట్టూ సమాచారం. ఇందులో నిజమెంత అన్నది మాత్రం స్పష్టత లేదు. ముఖ్యంగా సీట్‌ల షేరింగ్‌ విషయంలో కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసే పరిస్థితి ఉండదు.

మిగతా పార్టీలు ఏం చెబితే అది వినాల్సి వస్తుంది. లేదా పూర్తిగా కూటమే కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. ప్రతి పార్టీ తమ ఓటు బేస్‌ని వదులుకునేందుకు ఇష్టపడదు. ఆప్‌, టీఎమ్‌సీ సహా మరి కొన్ని పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించే అవకాశాలు తక్కువే. ఢల్లీి, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లో సీట్‌ షేరింగ్‌ విషయంలో విభేదాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ విభేదాలు ఫైనల్‌గా బీజేపీకే ప్లస్‌ అవుతాయి. వాళ్లలో వాళ్లకే సఖ్యత లేదని ఇప్పటికే బీజేపీ ప్రచారం చేస్తోంది. నాయకత్వ లోపమూ విపక్ష కూటమిని ఇబ్బందుల్లో పెడుతోంది. కాంగ్రెస్‌లోనే అంతర్గతంగా ఈ విషయంలో సఖ్యత కుదరకపోవచ్చు కూడా. తమ ఓటు బ్యాంకునీ కాపాడుకోవడంలో నానా అవస్థలు పడుతోంది ఈ పార్టీ. ఇలాంటి సమయంలో సరైన నాయకత్వం లేకపోతే మరింత చతికిలబడి పోవడం ఖాయం. కానీ బీజేపీకి ఈ సమస్యలేదు. బలమైన నాయకత్వమే ఆ పార్టీని ముందుకు నడిపిస్తోంది. కూటమిలో చీలికలు వస్తాయని జోస్యం చెబుతున్నారు బీజేపీ నేతలు. అసలే సమస్యలతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌ని మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే కాంగ్రెస్‌ పరిస్థితి చాలా వరకూ మారిపోయేది. కానీ…తెలంగాణలో గెలిచామన్న సంతోషం తప్ప మరేవిూ మిగల్లేదు. ఇప్పటికే బీజేపీ బలపడుతోంది. కాంగ్రెస్‌ ఓటమి బీజేపీకి చాలా ప్లస్‌ అవుతుంది. సీట్ల సంఖ్యని మరింత పెంచే అవకాశాలూ ఉన్నాయి. కాంగ్రెస్‌ భవిష్యత్‌ని నిర్ణయించనున్న ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి జోష్‌ ఇస్తాయనుకుంటే ఉన్న జోరునీ తగ్గించాయి. ఇప్పటి నుంచి ఈ పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. భారత్‌ జోడో యాత్రతో కొంత క్యాడర్‌లో జోష్‌ పెరిగిందని భావించినా…అది ఎంతో కాలం కొనసాగేలా లేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *