వలస నేతల్లో ఆందోళనలు

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బీజేపీలో వలస నేతలకు నిప్పులపై నిల్చున్నట్టు ఉందట. హుజూరాబాద్‌ ఉపఎన్నిక సమయంలో ఈటల రాజేందర్‌తోపాటు హుజూరాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌లోని పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నేతలు కాషాయ కండువా కప్పుకొన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక తర్వాత జిల్లా బీజేపీలో ప్రాధాన్యం దక్కుతుందని లెక్కలేసుకున్నారట. అప్పటికే పార్టీ పదవుల కోసం జిల్లాలో సీనియర్లు, జూనియర్లు అనే యుద్ధం జరుగుతోంది. ఈ పోరులో వలస నేతలు గుర్తింపు కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉన్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు.ఎమ్మెల్యే ఈటలను కలిసి.. విూతోపాటు బీజేపీలోకి వచ్చాం.. తమకు పార్టీలో తగిన గౌరవం.. గుర్తింపు లేదని చెప్పి వాపోతున్నారట. మూడ్రోజుల క్రితం హుజూరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో స్వయంగా ఈటల చేసిన కామెంట్స్‌ చర్చగా మారాయి. తమ వారికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. అందరూ కలిసి పనిచేసేలా జిల్లా నాయకత్వం చూడాలని ఈటల కోరారు. పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేయాలని అనుచరులను బుజ్జగించారట. దీంతో టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగి.. ప్రస్తుతం బీజేపీలో కనీసం గౌరవ మర్యాదలు దొరకడం లేదని నాలుగు గోడల మధ్య ఆవేదన చెందుతున్నారట వలస నాయకులు.కరీంనగర్‌ జిల్లా బీజేపీలో నెలకొన్న వర్గ విభేదాలను పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదనే చర్చ ఉంది. ఇప్పటికే జిల్లాలోని బీజేపీ సీనియర్లకు జిల్లా, రాష్ట్ర కమిటీలతో చోటు దక్కలేదు. పలుమార్లు రహస్య సమావేశాలు పెట్టుకోవడం.. ఆ తర్వాత సైలెంట్‌ కావడం.. ఆపై రచ్చ రచ్చ అవడం పార్టీలో ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. పైగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల నుంచి వచ్చిన నాయకులను, కార్యకర్తలను బీజేపీలో కలుపుకొని వెళ్లడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదే వైఖరి కొనసాగితే వచ్చే రోజుల్లో పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా ఇదే జిల్లా కావడంతో.. ఆయనకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తోందట. బయట పడకపోయినా.. తన వర్గానికి జరుగుతున్న అవమానాలపై ఈటల కూడా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి.. వలస నాయకుల అసంతృప్తిని చల్లార్చడానికి కమలనాథులు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *