అప్పులు లెక్కలు

ఏపీ రుణపరిమితి లక్ష్మణ రేఖను దాటేసింది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అడ్డగోలుగా అప్పులు చేసి వాటిని బడ్జెట్‌ లో చూపకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అందుకే కార్పొరేషన్లు స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జగన్‌ సర్కార్‌ చేసిన అప్పులన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే కేంద్రం పరిగణించింది. ఈ విషయాన్ని గత మార్చిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాజ్యసభ సాక్షిగా కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ కుండబద్దలు కొట్టినట్లు వెల్లడిరచారు. తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో అడిగన ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు బదులిచ్చారు. 2020 నుంచి 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసేందుకు రూ. 65,489.36 కోట్లకు పైగా గ్యారెంటీలు ఇచ్చిందన్నారు. ఇందులో 2020`21లో రూ.46,719.42 కోట్లు, 21`22లో రూ.18,770.54 కోట్లకు గ్యారెంటీలు ఇచ్చినట్లు చెప్పారు.ఈ సమాచారాన్ని రాష్ట్రప్రభుత్వమే ఈ ఏడాది ఏప్రిల్‌ 27న కేంద్రానికి ఓ లేఖ ద్వారా తెలియజేసిందని నిర్మలా సీతారామన్‌ వివరించారు. అలాగే 2020`21లో వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.22,549.5 కోట్లు, 21`22లో రూ.6.287.7 కోట్లు అప్పులు తెచ్చిందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 293(3) అధికరణ ప్రకారం 22`23లో కూడా అప్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిందని వెల్లడిరచారు.ఇక వైసీసీ ఎంపీ విజయసాయి రెడ్డిఅడిగిన మరో ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ బదులిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ది కార్పొరేషన్‌ (ఏపీఎస్డీసీ) సహా పలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సాధారణ నికర రుణ పరిమితిని ఉల్లంఘించి రుణాలు చేసినట్లు చెప్పారు. వాణిజ్యపరమైన లాభ నష్టాలను, రుణాలను చెల్లించగల ఆదాయ సామర్థ్యాన్ని, నిధులు ఎక్కడకు మళ్లిస్తున్నారో గమనించకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు బ్యాంకులు రుణాలివ్వడాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కూడా తప్పు పట్టిన విషయాన్ని వెల్లడిరచారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు రుణాలు, అడ్వాన్సులు మంజూరు చేసేటప్పుడు ఆర్‌బీఐ ఆదేశాలను పాటించాలని బ్యాంకులను నిర్దేశించినట్లు తెలిపారు.
కౌంటర్‌ ఇచ్చిన విజయసాయిరెడ్డి
కేంద్రం రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్న విషయం ఆయనకు ఇప్పుడు తెలిసింది. అంతే రాజ్యసభ సాక్షిగా కేంద్రంపై విమర్శల వర్షం కురిపించేశారు. కేంద్రం రాష్ట్రాలను దోపిడీ చేస్తోందని దుయ్యబట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఇంతలా పెంచేస్తే పేద, మధ్య తరగతి ప్రజలు ఎలా బతుకుతారని నిలదీశారు.ద్రవ్యోల్బణం అరికట్టడంలో కేంద్రం దారుణంగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. ఇంత చేసినా ఆయన రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన వాటిని వేటినీ ప్రస్తావించలేదు. విశాఖ రైల్వే జోన్‌ కానీ, పోలవరం బకాయిల గురించి కానీ, విశాఖ ఉక్కు ప్రైవైటైజేషన్‌ ఆపాలని కానీ, ఆఖరికి కడప ఉక్కు కర్మాగారం గురించి కానీ ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. జనరల్‌ గా కేంద్రం రాష్ట్రాలను అన్యాయం చేస్తోందని ఓ ప్రసంగం దంచేశారు. అందులో కేంద్రం రాష్ట్రాలను దోచేస్తోందని విమర్శలు గుప్పించారు.ఇంత కాలంగా కేంద్రం తిట్టినట్టు చేస్తే వైసీపీ సర్కార్‌ కనీసం ఏడ్చినట్లు కూడా చేయలేదు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయినట్లు కనిపిస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రంపై విమర్శలు గుప్పించినట్లు చేశారు. కేంద్రం పట్టించుకోనట్లు చేస్తుంది అంతే అని పరిశీలకులు అంటున్నారు. సెస్‌, సర్‌ చార్జీల్లో రాష్ట్రానికి ఇవ్వడం లేదనీ, పన్నుల వాటాలో రాష్ట్రాలకు 41శాతం వాటా ఇవ్వడం లేదనీ అన్నారు. ఏడేళ్లలో ఏపీ 46వేల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడి ఆర్థిక సంక్షోభం అంచున నిలిచిన నేపథ్యంలో తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునే ప్రయత్నమే విజయసాయి రాజ్యసభలో కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చెత్తపై పన్ను కేంద్రం వేసిందా అని పరిశీలకులు నిలదీస్తున్నారు. అడ్డూ అదుపూ లేకుండా చేసిన అప్పుల కారణంగా ఇకపై అప్పులు పట్టిని దుస్థితిలో ప్రజల దృష్టి మరల్చి గట్టెక్కాలన్న ఉద్దేశంతోనే విజయసాయి కేంద్రంపై విమర్శలు గుప్పించారని అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *