సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ టార్గెట్‌

హైదరాబాద్‌, అక్టోబరు 16
కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి… అన్నట్టు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు భారీ స్కెచ్‌ వేస్తున్నాయి. రెండు పార్టీలకూ కొరకరాని కొయ్యలా తయారైన గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్లతోపాటు కామారెడ్డి నియోజకవర్గాల్లో ముగ్గురు ముఖ్యనేతలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. రాష్ట్రం మొత్తం గెలిస్తే ఒక లెక్కా.. ఈ నాలుగు మరో లెక్కా అనేలా కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనంటూ కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే లక్ష్యంతో కమలనాథులు వేసిన మాస్టర్‌ ప్లాన్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అనేలా ఉంది.అధికార బీఆర్‌ఎస్‌లో స్టార్‌ అండ్‌ స్ట్రాంగ్‌ లీడర్స్‌ ముగ్గురే ముగ్గురు. ఓటమెరుగని ఈ నేతలపై పోటీ చేయడం అంటేనే విపక్ష పార్టీలకు సవాల్‌.. డిపాజిట్‌ దక్కించుకోవడమే పెద్ద టాస్క్‌. వాళ్లే సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు.. మరోసారి ఈ ముగ్గురి గెలుపుపై ఎవరికీ అనుమానం లేదు. వారిలో ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుందనేదే ఎప్పుడూ తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగే చర్చ. సీఎం కేసీఆర్‌ రాజకీయాల్లో ప్రవేశించిన 1983లో తప్ప.. ఎప్పుడూ ఓటమి అన్నది ఎరుగలేదు. 1985 నుంచి అటు అసెంబ్లీ, ఇటు లోక్‌ సభ.. ఎన్నిక ఏదైనా గెలుపు కేసీఆర్‌ సొంతం అవుతూ వస్తోంది. ఆయన ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో తప్ప మరెప్పుడూ ఓటమన్నదే ఎదురు కాలేదు. సిద్ధిపేట నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సీఎం కేసీఆర్‌.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గజ్వేల్‌ నియోజకవర్గానికి మారారు. గత రెండు ఎన్నికల్లోనూ సీఎం గజ్వేల్‌ నుంచే గెలిచారు. ఎన్నికల్లో 58 వేల మెజార్టీతో గెలిచిన సీఎం.. ముచ్చటగా మూడోసారి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు తొలిసారిగా కామారెడ్డి బరిలోకి దిగబోతున్నారు.ఐతే సీఎం కేసీఆర్ను నిలువరించడమే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపే అన్వేషణలో పడ్డాయి కాంగ్రెస్‌, బీజేపీలు. ఈ సారి రెండు చోట్ల అసెంబ్లీకి పోటీచేస్తున్న సీఎం కేసీఆర్‌ పై పశ్చిమ బెంగాల్‌ ఫార్ములా ప్రయోగించాలని బీజేపీ స్కెచ్‌ వేస్తోంది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై సుదేంధు అధికారిని పోటీకి పెట్టిన బీజేపీ.. మమతకు షాక్‌ ఇచ్చింది. ఇక్కడ అదే ఫార్ములా ప్రకారం గజ్వేల్‌ లో సీఎం కేసీఆర్‌ పై బీజేపీ ముఖ్యనేత ఈటలను, కామారెడ్డిలో మరో నేత విజయశాంతిని పోటీకి పెడితే ఎలా ఉంటుందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఈటల సైతం దీనిపై హుజూరాబాద్‌ లో క్లారిటీ ఇఛ్చేశారు. హుజూరాబాద్‌ తో పాటు గజ్వేలులోనూ పోటీ చేయబోతున్నట్లు సంకేతాలిచ్చేశారు.
ఇక కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని మరోసారి బరిలో దింపేందుకు సిద్ధం అవుతోంది. ఇక సీఎం కేసీఆర్‌ పోటీ చేసే రెండో నియోజకవర్గం కామారెడ్డిలో కాంగ్రెస్‌ కు మైనార్టీ లీడర్‌ షబ్బీర్‌ అలీ రూపంలో బిగ్‌ హ్యాండ్‌ ఉండనే ఉంది. దీంతో సీఎం కేసీఆర్‌ కు గజ్వేల్‌ లో బీజేపీ నుంచి.. కామారెడ్డిలో కాంగ్రెస్‌ నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశీలకులు. ప్రత్యర్థుల ప్లాన్స్‌ అలా ఉంటే ఈసారి గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీకన్నా సీఎం కేసీఆర్‌ కు ఎక్కువ మెజార్టీ వస్తుందంటున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు.

ఇక ప్రతిపక్షాలకు ఛాలెంజ్వి విసురుతున్న నియోజకవర్గాల్లో సిరిసిల్ల ఒకటి.. మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ కంచుకోటగా స్థిరపడిపోయింది. కేటీఆర్‌ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారిగా పోటీచేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో హోరాహోరీగా జరిగిన పోటీలో కేటీఆర్‌ కేవలం 171 ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. కానీ ఆ తర్వాత తిరుగు లేకుండా పోయింది. తన పనితీరుతోనే తానేంటో నిరూపించుకున్న కేటీఆర్‌.. ఏడాది తిరక్కుండానే 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఏకంగా 68 వేల పైచిలుకు మెజార్టీతో రెండోసారి గెలుపొందారు. ఇక 2014లో తెలంగాణా ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో 53 వేల మెజార్టీ.. 2018లో ఏకంగా 89 వేల మెజార్టీతో వరుసగా గెలుపొందారు. ఇక ఈ ఎన్నికల్లోనూ సిరిసిల్ల నుంచే పోటీచేస్తున్న కేటీఆర్‌.. లక్ష ఓట్ల మెజార్టీ టార్గెట్గా ప్రణాళికలు రచిస్తున్నారు. కేటీఆర్‌కు ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ నేత కేకే మహేందర్‌రెడ్డి మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. ఇక ఇక్కడ కూడా బీజేపీ బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. అవసరమైతే బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ నే బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే చర్చ కూడా పార్టీలో జోరుగా సాగుతోంది.

గజ్వేల్‌, సిరిసిల్ల ఒక ఎతైతే.. ఆ రెండిరటికీ మించి విపక్షాలకు కొరకరాని కొయ్యిగా మారిన మరో నియోజకవర్గం సిద్దిపేట.. సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గమైన సిద్దిపేట నుంచి మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిన్నవయసులోనే డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించిన హరీశ్‌రావు. గత ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు. 2004లో తొలిసారి పోటీ చేసినప్పుడు 24 వేల ఆధిక్యంతో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన హరీశ్‌ రావు.. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతీసారి తన మెజార్టీని తానే అధిగమిస్తూ.. విపక్షాల డిపాజిట్లను గల్లంతు చేస్తూ ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో ఏకంగా లక్ష 18 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం హరీశ్‌కే సాధ్యమైంది. ఈ రికార్డును ఇప్పట్లో మరొకరు అధిగమించడం కూడా సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. ఈ నియోజకవర్గంలో హరీశ్‌రావును ఓడిరచడం కన్నా.. ఆయన మెజార్టీని తగ్గించడం ఎలా అన్నదే ప్రత్యర్థి పార్టీలకు పెద్ద సమస్యగా మారింది. హరీశ్‌పై దీటైన అభ్యర్థిని నిలిపి మెజార్టీని లక్ష దాటకుండా చూసుకోవడమే విపక్షాలకు సవాల్‌గా మారుతోంది. ఇందుకోసం బీజేపీ సరికొత్త ప్లాన్‌ రెడీ చేస్తోంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును సిద్దిపేట బరిలో దింపడంపై చర్చ చేస్తోంది. రఘునందన్‌ సైతం సిద్దిపేటలో అయినా.. గజ్వేల్‌లో అయినా పోటీకి సై అంటూ ఎప్పటినుంచో సంకేతాలిస్తూ వస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *