కమలానికి ఒంటరి పోరు తప్పదా…

విజయవాడ, అక్టోబరు 5
ఏపీ బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో పొత్తులపై ప్రకటన వస్తుందని ఎవరూ ఊహించరు, ఊహించలేదు కూడా. కాకపోతే, ఓ చిన్న ఆశ. కేంద్ర బీజేపీ నుంచి ఏవైనా ఆదేశాలు వచ్చాయోమో, ఫలానా లీక్‌ ఇవ్వండని చెప్పారేమోనని ఓ చిన్న ఆశ. ఎన్డీయేతో పొత్తులో ఉంటూనే.. తమతో చర్చించకుండానే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్‌ కల్యాణ్‌ ప్రకటన చేయడమే ఏపీ బీజేపీకి పెద్ద షాక్‌. నిజానికి, ఈపాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. కాని, పొత్తుల వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందంటూ ఓ ప్రకటన చేసి.. ఎప్పటికప్పుడు ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. మరోవైపు.. క్షేత్రస్థాయిలో టీడీపీ`జనసేన రెండూ కలిసి వెళ్తున్నాయి. టీడీపీ విూటింగ్‌ అయినా, జనసేన కార్యక్రమం అయినా రెండు పార్టీల జెండాలూ, కార్యకర్తలు కనిపిస్తున్నారు. ఎటొచ్చీ బీజేపీ జెండానే కనిపించడం లేదు. ఇదే కంటిన్యూ అయితే గనక.. ఏ ప్రయోజనం కోరి ఏపీలో జనసేనను కలుపుకొని వెళ్తున్నామో అది నెరవేరడం కష్టమని ఏపీ బీజేపీలోని కొందరు నేతలు పరోక్షంగా కామెంట్స్‌ చేస్తున్నారు. అయినా సరే.. పొత్తులపై రాష్ట్ర బీజేపీ హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకురావడం లేదు. కనీసం పొత్తు లేదని చెప్పినా ఎవరి దారి వారు చూసుకోవచ్చు కదా అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.కాని, కోర్‌ కమిటీ సమావేశం తరువాత ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి మాట్లాడిన మాటలు వింటే.. పొత్తులపై హైకమాండ్‌ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టంగా అర్థమైంది. కనీసం టీడీపీ`జనసేన పొత్తుపై రాష్ట్ర బీజేపీ ఏమనుకుంటుందో కూడా బయటపడనివ్వలేదు పురంధేశ్వరి. పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయాలను హైకమాండ్‌కు చెబుతామని, తమ నిర్ణయం ఏంటన్నది కేంద్ర బీజేపీ పెద్దల నుంచే వస్తుందని చెప్పారు తప్ప.. రాష్ట్రం తరపున పొత్తుపై ఏమనుకుంటున్నామో చెప్పలేదు. మొత్తానికి కోర్‌ కమిటీ సమావేశాన్ని అలా ముగించారు.మరోవైపు పవన్‌ కల్యాణ్‌ పొత్తులపై చాలా దూరం వెళ్లిపోయారు. ఇకపై బీజేపీ గురించి ఎదురుచూసే పరిస్థితి ఉండబోదనే క్లియర్‌ కట్‌ మెసేజ్‌ ఇచ్చారు జనసేనాని. 2024 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడేది టీడీపీ`జనసేన ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. అంటే.. బీజేపీ కలిసిరాకపోయినా వచ్చే ఎన్నికల్లో గెలుస్తున్నామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.పవన్‌ కల్యాణ్‌ గత వ్యాఖ్యలకు మొన్నటి వ్యాఖ్యలకు చాలా స్పష్టమైన తేడా కనిపించింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో పవన్‌ నోటి నుంచి బీజేపీ ప్రస్తావన రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాని, ఇప్పట్లో ఈ విషయం తేల్చేలా కనిపించడం లేదు. దాదాపుగా ఎన్నికల ముందే బీజేపీ తన నిర్ణయం చెప్పేలా కనిపిస్తోంది. లేదంటే, చంద్రబాబు కేసుల విషయంలో ఏదైనా పాజిటివ్‌ వార్త వచ్చి, మళ్లీ ఆపార్టీ యాక్టివిటీ పెరిగితే తప్ప ఈ విషయంపై కదలిక రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే, పొత్తులపై విూ అభిప్రాయం ఏంటని పవన్‌ అడగడం మానేసినట్టే. వస్తే సంతోషం అనే మాట ఆల్రడీ పవన్‌ నుంచి వచ్చేసింది. పైగా ఇది ప్రజలు కోరుకున్న పొత్తు అని కూడా తేల్చేశారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా సీట్లు వస్తాయని, అదే టీడీపీతో పొత్తుతో వెళ్తే కచ్చితంగా అధికారంలోకి వస్తామని సూటిగా చెప్పేశారు. సో, ఇక తేల్చుకోవాల్సింది ఏపీ బీజేపీనే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *