కాంగ్రెస్‌ లో మైనంపల్లి చిచ్చు….

మెదక్‌, అక్టోబరు 3
మల్కాజ్‌ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు టీ`కాంగ్రెస్‌లో చిచ్చురేపారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన హన్మంతరావు వ్యవహారంతో రోజు వ్యవధిలో కాంగ్రెస్‌ పార్టీకి ఇద్దరు జిల్లా అధ్యక్షులు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో మైనంపల్లి రెండు టికెట్లు ఆశిస్తున్నారు. మల్కాజ్‌ గిరి నుంచి తనకు మెదక్‌ నుంచి తన కుమారుడికి టికెట్‌ ఆశిస్తుండటంతో మైనంపల్లి డిమాండ్‌కు అధిష్టానం సైతం ఓకే చెప్పినట్లు ప్రచారం జురుగుతున్నది.దీంతో మైనంపల్లి చేరిక పట్ల అసంతృప్తితో ఉన్న మెదక్‌ డీసీసీ చీఫ్‌ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆదివారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయగా సోమవారం మేడ్చల్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపించారు.మల్కాజ్‌గిరి టికెట్‌ మైనంపల్లికే కన్ఫర్మ్‌ అయిందనే ప్రచారంతో శ్రీధర్‌ గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం శ్రీధర్‌ను అధిష్టానం ఢల్లీికి పిలిపించుకుని బుజ్జగించింది. అయితే పార్టీ కోసం కష్టపడుతున్న తనకే టికెట్‌ ఇవ్వాలని హైకమాండ్‌ వద్ద కోరిన శ్రీధర్‌ సోమవారం తన అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అధిష్టానం తీరుపై తన అనుచరుల వద్ద అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.బీసీ సామాజిక వర్గానికి చెందిన తాను 1994 నుంచి కాంగ్రెస్‌ పార్టీలో విధేయుడిగా పని చేస్తున్నానని.. 2018 నుంచి టికెట్‌ ఆశిస్తునప్పటికీ గత ఎన్నికల్లో అలయన్స్‌లో భాగంగా టికెట్‌ నిరాకరించినా పార్టీ కోసం కష్టపడి పని చేశానని పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా హనుమంతరావు కాంగ్రెస్‌ కార్యకర్తలు, మద్దతుదారులపై అక్రమంగా కేసులు నమోదు చేయించి ఇబ్బందులకు గురి చేశారని.. ఇప్పుడు అతడినే పార్టీలో చేర్చుకుని టికెట్‌ ఇవ్వబోతున్నారనే ప్రచారం తనను కలిచి వేసిందని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.చేరికలతో జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో మైనంపల్లి దెబ్బకు ఇద్దరు డీసీసీలు రాజీనామా చేయడం కలకలంగా మారింది. ఈ పరిణామం కష్టకాలంలో కాంగ్రెస్‌నే అంటిపెట్టుకుని, ప్రత్యర్థులకు ఎదురొడ్డి నిలిచిన నాయకులకు సవాలుగా మారింది. కొత్తవారి చేరిక ఎంత మేరకు మేలు చేస్తుందో తెలియనప్పటికీ పాతవారు పార్టీని వీడటం కాంగ్రెస్‌ క్యాడర్‌ను కన్ఫ్యూజన్‌కు గురి చేస్తోంది. మరి ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నష్టనివారణ చర్యలకు దిగుతుందో చూడాలి.
నందికంటి శ్రీధర్‌ రాజీనామా
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా నేతలు పార్టీలు మారుతున్నారు. టికెట్‌ ఆశించి నిరాశ చెందిన నేతలతో పాటు తమ శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదంటూ నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మల్కాజ్‌ గిరి కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి నందికంటి శ్రీధర్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. అంతకుముందు మౌలాలి క్లాసిక్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్లో వెయ్యి మంది పైగా ముఖ్య కార్యకర్తలతో రహస్యభేటీ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీని తల్లిలా భావించానని, కానీ ఆ తల్లే నన్ను మోసం చేసిందంటూ నందికంటి శ్రీధర్‌ కంటతడి పెట్టారని సన్నిహిత వర్గాల సమాచారం.బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడితో పాటు ఇటీవల కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్‌ఎస్‌ తొలి జాబితాలో మైనంపల్లికి టికెట్‌ వచ్చినా, మెదక్‌ నుంచి తన కుమారుడికి టికెట్‌ రాని కారణంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే. అయితే పార్టీనే నమ్ముకుని 3 దశాబ్దాలుగా పనిచేస్తున్న తనకు టికెట్‌ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఖర్గేకు రాసిన లేఖలో నందికంటి శ్రీధర్‌ పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ నుంచి సీటు ఆశించానని, అయితే పొత్తుల కారణంగా సీటు రాలేదని లేఖలో ప్రస్తావించారు.గత నెల 28న మైనంపల్లి హన్మంతరావు, తన కుమారుడితో పాటు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మల్కాజిగిరి, మెదక్‌ అసెంబ్లీ స్థానాలను మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడికి కేటాయించాలని కాంగ్రెస్‌ అధిష్టానం తీసుకుంది. మరోవైపు మెదక్‌ టికెట్‌ మైనంపల్లి తనయుడు రోహిత్‌ కు ఇస్తున్నారని ఇదివరకే మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. మెదక్‌ టికెట్‌ తిరుపతి రెడ్డి ఆశించారు. కానీ బీఆర్‌ఎస్‌ లో ఆ సీటు తన కుమారుడికి ఇవ్వలేదన్న కారణంగానే మైనంపల్లి గులాబీ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. దాంతో తన ఆశలు గల్లంతు కావడంతో నిరాశ చెందిన తిరుపతి రెడ్డి హస్తం పార్టీని వీడారు. ఈ క్రమంలో మల్కాజిగిరిలోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. గత ఎన్నికల్లో దక్కని మల్కాజిగిరి టికెట్‌ ఈసారి వస్తుందని ఆశించిన నందికంటి శ్రీధర్‌.. మైనంపల్లి హన్మంతరావు పార్టీలో చేరికతో అసంతృప్తిగా ఉన్నారు. టికెట్‌ తనకు దక్కడం లేదన్న బాధతో ఆయన సోమవారం పార్టీకి రాజీనామా చేసి లేఖను ఖర్గేకు పంపారు. ‘బీసీ కమ్యూనిటీకి చెందిన తాను (నందికంటి శ్రీధర్‌) 1994 నుంచి కాంగ్రెస్‌ లోనే కొనసాగుతున్నాను. ఇతర నేతల్లా కాకుండా పార్టీలు మారకుండా కాంగ్రెస్‌ కు విధేయుడిగా ఉంటూ, ఎంతో సేవ చేశాను. 2018లో టికెట్‌ వస్తుందని భావించా. కానీ పొత్తుల కారణంగా టికెట్‌ రాలేదు. ఉదయ్‌ పూర్‌ డిక్లరేషన్‌ ప్రకారం కుటుంబానికి ఒకే సీటు నిర్ణయాన్ని స్వాగతించి.. ఈ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్‌ ప్రాధాన్యత ఇస్తుందని భావించాను. కానీ ఇప్పుడు మల్కాజిగిరి మెదక్‌ టికెట్లను ఒకే కుటుంబానికి కేటాయించారు. ఎన్నో ఏళ్ల నుంచి మల్కాజిగిరికి చెందిన పార్టీ నేతలు మైనంపల్లి హనుమంతరావుతో పోరాడారు. వారిపై అక్రమ కేసులు బనాయించినా వెనక్కి తగ్గలేదు. నేడు అదే నేతను పార్టీలో చేర్చుకుని మాకు అన్యాయం చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఇద్దరికి టికెట్లు ప్రకటించి కాంగ్రెస్‌ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. ఓసీ అభ్యర్థికి సీటు ప్రకటించి, బీసీ అభ్యర్థులకు అన్యాయం చేసిన కారణంగా డీసీసీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’ అని నందికంటి శ్రీధర్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *