కుటుంబ పాలనే… కమలం…అస్త్రం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ వేటికవి ఎన్నికల వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెర చాటు వ్యూహరచన చేస్తుంటే, మరో ‘ముఖ్య’ నేత మంత్రి కీటీఆర్‌ క్షేత్ర స్థాయిలో ముందుండి యుద్ధానికి సేనలను సిద్దం చేస్తున్నారు. హరీష్‌ రావు వంటి ఇతర ముఖ్య నేతలను ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే వాడుకుంటూ కేటీఅర్‌ ఒంటి చేత్తో చక్రం తిప్పుతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎదుర్కుంటున్న సవాళ్ళను ముఖ్యంగా ముఖ్యమంత్రి కుటుంబం లక్ష్యంగా ఒకదాని వెంట ఒకటిగా వెంటపడుతున్నఅవినీతి ఆరోపణలను తిప్పి కొడుతూ కేటీఆర్‌ ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై పదునైన అస్త్రాలను సంధిస్తున్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీని ఉద్దేశించి కేటీఆర్‌ చేస్తున్న విమర్శలు, ప్రయోగిస్తున్న భాష రోజు రోజుకు రాటు తేలుతోందన్న విమర్శలూ, ప్రశంసలూ కూడా వినవస్తున్నాయి. భాష విషయంలో కేటీఆర్‌ కంటే కేసీఆరే కొంత నయం అనిపిస్తున్నారని బీజేపీ కార్యదర్శి ప్రకాశ్‌ రెడ్డి అన్నారంటే, కేటీఆర్‌ భాషాప్రయోగంలో ఎంతగా రాటుదేలారో అవగతమౌతుంది. మరో వంక కాంగ్రెస్‌ పార్టీలో పాదయాత్రలు, అంతర్గత పంచాయతీలు సమాంతరంగా సాగుతున్నాయి. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, సీనియర్‌ నాయకుల మధ్య సయోధ్య కుదిరినట్లే కుదిరి అంతలోనే మాయమై పోతోంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ రేసులో ఉందా లేదా అన్నది అంతు చిక్కని ప్రశ్నగా ఉందని పరిశీలకులు అంటున్నారు. అయినా, నాయకుల తీరు ఎలా ఉన్నా, కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న సంస్థాగత బలం, ఓటు బ్యాంకు ఆ పార్టీకి శ్రీరామా రక్షగా పనిచేస్తుందని అంటున్నారు. మరోవంక అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది పక్కన పెడితే, బీజేపీ మాత్రం బీఆర్‌ఎస్‌ కు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో ఎన్నికల సన్నాహాలు సాగిస్తూ, మరో వంక అధికార పార్టీని ఆర్థిక అవకతవకల, అవినీతి కేసుల ఉచ్చులో అష్ట దిగ్బంధనం చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుటుంబ పాలన, కుటుంబ అవినీతిని ప్రధాన ఎజెండాగా చేసుకుని పావులు కదుపుతోందని అంటున్నారు.ఢల్లీి మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితను, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్‌ కేసులో ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి కల్వకుట్ల తాక రామా రావును ముద్దాయిలుగా చూపించి, వారి ఇమేజ్‌ ని డ్యామేజి చేసేందుకు శత విధాల ప్రయత్నిస్తోంది. ఇక ఇప్పడు తాజాగా, ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్‌ సర్దేశాయ్‌ బయట పెట్టిన రహస్యం నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేసేందుకు, సిద్దం చేసుకున్న అస్త్రంగా భావిస్తున్నారు. ఇదలా ఉంటే బీజేపీ… బీఆర్‌ఎస్‌ ను టార్గెట్‌ చేస్తుంది అనేందుకు ఆధారమా అనేట్లుగా, బీజేపీ సీనియర్‌ నాయకుడు కేంద్ర మంత్రి, కిషన్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడని చేసిన వ్యాఖ్య రాజకీయవర్గాల్లో సంచలనంగామారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *