నర్సుపై డాక్టర్‌, సిబ్బంది సామూహిక హత్యాచారం

పాట్నా, ఆగస్టు 16
బీహార్‌లో దారణం చోటుచేసుకుంది. ఓ నర్సుపై సామూహిక అత్యాచారం జరగడం ఆలస్యంగా వెలుగుచూసింది. తూర్పు చంపారణ్య జిల్లాలోని నర్సింగ్‌ హోమ్‌లో ఓ డాక్టర్‌, కంపౌండర్‌, అదే ఆసుపత్రిలోని ఉద్యోగం చేస్తున్నటువంటి ఇతర సిబ్బంది అక్కడ పనిచేస్తున్న నర్సుపై అత్యాచారం చేశారు. అంతేకాదు ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేశారు. సామాన్య ప్రజలకు నమ్మకస్థులైన వైద్యడే ఇలాంటి దారణలకి పాల్పడటం ఏంటని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ డాక్టర్‌ కనబడితే చాలు.. అతనిపై చర్యలు తీసుకునేందుకు స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. చంపారణ్య జిల్లాలోని మోతీహరిలోని జానకీ సేవా సదన్‌ నర్సింగ్‌హోమ్‌లో ఈ ఘటన చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అదే ఆసుపత్రికి చెందిన అంబులెన్స్‌లో నర్సు మృతదేహం కనిపించడం వల్ల ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.ఇక వివరాల్లోకి వెళ్తే ఆగస్టు 8వ తేదిన ఆ నర్సు రోజువారిగానే ఆస్పత్రిలో పని చేయడానికి వెళ్లింది. కానీ ఎప్పుడు ఇంటికి వచ్చే సమయానికి ఆమె రాలేకపోయింది. తన కోసం చాలాసేపు ఎదురుచూశారు. అయినా కూడా ఆ నర్సు ఇంటికి రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. అదృశ్యం అయినటువంటి తమ కూతురు కోసం అనేక చోట్ల వెతికారు. కానీ ఎక్కడా కూడా ఆమె ఆచూకి దొరకలేదు. చివరికి నర్సింగ్‌ హోమ్‌కే వెళ్లారు. కానీ అక్కడ కూడా లోపల కనిపించలేదు. ఇక అంబులెన్స్‌లో చూడగా ఆమె మృతదేహం కనిపించింది. దీంతో ఒక్కసారిగా తన కుటుంబ సభ్యులు హడలిపోయారు. సమాచారం అందుకున్న వైద్యులు అక్కడికి వచ్చారు. ఇక ఆమె శవానికి పోస్టుమార్టం చేశారు. ఆ రిపోర్టులో నర్సు విూద సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు కాంపౌండర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్‌తో పాటు మరో ముగ్గరు నిందితుల కోసం గాలిస్తున్నారు.ప్రస్తుతం ఆ నర్సు పనిచేసినటువంటి నర్సింగ్‌ హోమ్‌ను సీజ్‌ చేశారు. వైద్యుడు జయప్రకాశ్‌తో పాటు మరో ఐదుగురిపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి వైద్యులు, ఇతర సిబ్బంది వేధింపుల వల్ల ఆ నర్సు గత కొన్ని రోజులుగా విసిగిపోయినట్లు తెలిసింది. ఇందుకోసం కొంతకాలం పాటు ఆమె ముందుగానే పనికి వెళ్లడం మానేసింది. కానీ ఇలాంటివి మరోసారి జరగకుండా చూస్తానని డాక్టర్‌తో పాటు అక్కడ పనిచేసే సిబ్బంది ఆమెకు క్షమాపణలు చెప్పినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఆ తర్వాత ఆమె ఉద్యోగం చేయడానికి వెళ్లిందని పేర్కొన్నారు. ఇంతలోనే ఈ దారుణం చేసుకున్నట్లు వివరించారు. మరోవైపు ఇలాంటి దారుణానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *