బెజవాడలో 30 కే టమాట

విజయవాడ, జూలై 8, (న్యూస్‌ పల్స్‌)
టమాటా ప్రజల్ని ఠారెత్తిస్తోంది. దీంతో ప్రజలు టమాటా కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. కిలో టమాటా కంటే.. కేజీ చికెన్‌ తెచ్చుకోవాంటూ వాపోతున్నారు. మరోవైపు కూరగాయల ధరలు సైతం చుక్కలనంటుతున్నాయి. దీంతో సామాన్యులు బోరుమంటున్నారు. ఇదిలా ఉంటే, మండిపోతున్న టమాటా రేటుతో దొంగలు తెగబడుతున్నారు. తోటల్లోని టమాటా పంటను దొంగిలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రాజకీయ నేతలు సైతం ప్రజలకు ఉచితంగా టమాటాలు పంపిణీ చేస్తున్నారు. ఏపీలోని విజయవాడలో టిడిపి నేత బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ప్రజలకు టమో టాల పంపిణీ నిర్వహించారు. పేదలకు ఉచితంగా, ఇతరులకు కిలో ముప్పై రూపాయల చొప్పున అందజేశారు. విజయవాడ రథం సెంటర్‌ లో తోపుడు బండి పై పెట్టి పంపిణీ చేశారు బుద్దా వెంకన్న.ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. నిత్యావసర ధరలను నియంత్రణ చేయడంలో ఏపీ సర్కార్‌ విఫలమైందని ఆరోపించారు. ధరల స్థిరీకరణ కోసం మూడు వేలకోట్లు కేటాయిస్తామని ముఖ్యమంతి జగన్‌ మోహన్‌ రెడ్డి మాట తప్పారని అన్నారు. టమెటా కిలో వంద నుంచి 150రూపాయలు ధర పలుకుతుందని తెలిపారు. మొక్కు బడిగా సబ్సిడీ పై టమోటా పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. వాలంటీర్‌ వ్యవస్థ గురించి గొప్ప గా చెప్పుకునే సిఎం.. వారి ద్వారా ఇంటింటికీ రెండు కిలోల టమాటా ఎందుకు పంపిణీ చేయటం లేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.చిత్తశుద్ధి లేని ఏపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా కొద్దిమందికి మాత్రమే టమోటా పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. తులం బంగారం కన్నా టమోటానే కావాలని మహిళలు కోరే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. టమోటా ధర అదుపులోకి వచ్చే వరకు ఇంటింటికి కిలో టమాటా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు పశ్చిమ నియోజకవర్గం లో కిలో ముప్పై రూపాయలుకే ప్రజలకు టమాటా అందిస్తామని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. పేదల ప్రజలకు పూర్తి ఉచితంగా టమాటాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇలా ప్రతిరోజూ 500కిలోల వరకు పేదలకు టమాటా పంపిణీ చేస్తామని చెప్పారు. మరోవైపు ప్రభుత్వ తీరుపై ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామని బుద్దా వెంకన్న వెల్లడిరచారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *