బండారు వర్సెస్‌ చింతకాయల

ఉమ్మడి విశాఖజిల్లా తెలుగుదేశంపార్టీలో బండారు, చింతకాయల ఫ్యామిలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారసత్వ రాజకీయ పునాదులపై బలమైన నాయకులుగా ఎదిగారు మాజీ మంత్రులు సత్యనారాయణ మూర్తి, అయ్యన్నపాత్రుడు. ఉత్తరాంధ్రలో కీలకమైన వెలమ సామాజిక వర్గానికి ప్రతినిధులుగా ఆవిర్భావం నుంచి టీడీపీనే నమ్ముకున్న ఈ ఇద్దరు నేతలు సమాన గౌరవం ఆశిస్తుంటారు. అయ్యన్న పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాగా? సత్యనారాయణ మూర్తికి కీలకమైన కాకినాడ, కోనసీమ జిల్లాల సమన్వయ బాధ్యతలు అప్పగించింది పార్టీ. దశాబ్దాల తరబడి ఒకే పార్టీలోఉన్నా.. ఇద్దరూ ఉత్తర దక్షిణ ధృవాలు. ఎవరి నియోజకవర్గ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నా.. వ్యక్తిగత ప్రయోజనాలను సాధించుకునే దగ్గర మాత్రం తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. అయితే..ఉమ్మడిజిల్లాపై గట్టిపట్టు ఉన్న అయ్యన్నపాత్రుడి ఆధిపత్యం పార్టీలో కనిపిస్తుంది. రాజకీయ కుటుంబాలతో ఉన్న విస్త్రతమైన బంధుత్వాలు బండారుకు అడ్వాంటేజ్‌ పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే క్రమంలో అయ్యన్న దూకుడు మంచి ఫలితాలను ఇచ్చిందన్న అభిప్రాయం స్థానికంగా ఉంది. అదే సమయంలో మాజీ మంత్రి గంటాశ్రీనివాసరరావు, బండారు సత్యనారాయణమూర్తి ఒక గ్రూప్‌ అయ్యారు. పార్టీలోనూ?.అధికారంలో వున్నప్పుడూ తనతో సమానమైన అయ్యన్నకు ఎక్కువ అవకాశాలు లభిస్తుండటంపై బండారు తీవ్ర అసంతృప్తితో ఉండేవారట. దీంతో అంతర్గతంగా ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రాజకీయ వైరం నడుస్తుంటుంది. ఐతే, గతంతో పోలిస్తే ఇప్పుడు బండారు బలం, బంధుత్వం పెరిగింది. కారణం..శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయకుడికి బండారు స్వయానా మామ. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి వియ్యంకుడు. ఇవన్నీ పార్టీలో సత్యనారాయణమూర్తికి కలిసివచ్చే అంశాలు. ఇక్కడే అసలు సిసలు పొలిటికల్‌ డ్రామాకు తెరలేచింది.వచ్చే ఎన్నికలు లక్ష్యంగా వారసుల రాజకీయ ఆరంగేట్రం కోసం అయ్యన్న, బండారు పావులు కదపడం మొదలుపెట్టారు. నర్సీప ట్నం నుంచి తిరిగి పోటీ చేయాలనుకుంటున్న అయ్యన్నపాత్రుడు?. అనకాపల్లి ఎంపీ సీటు తన కుమారుడు విజయ్‌కి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇందు కోసం ఆయన హైకమాండ్‌ తో అమితువిూ తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. ఒకవేళ సామాజిక కోణంలో ఎంపీ సీటును కాపులకు కేటాయిస్తే మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయ్‌ని బరిలో దించాలనేది అయ్యన్న ప్లాన్‌. ఇక్కడే మడత పేచీ మొదలైంది. పెందుర్తిలో తాను, మాడుగులలో తన కుమారుడు అప్పలనాయుడు పోటీ చేయాలని అనుకుంటున్నారట సత్యనారాయణమూర్తి. సీనియర్స్‌ కుటుంబాలకు రెండు టిక్కెట్లు ఇస్తే తనకూ కావాలని అంటున్నారట ఆయన. స్థానికంగా తనకున్న బలగం, బంధుత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకోమంటున్నారట. దీంతో మాజీమంత్రుల మధ్య విభేదాలు ఇప్పుడు పతాక స్థాయికి చేరినట్టు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో టీడీపీ ప్రయోగాలు చేసే అవకాశం ఏ మాత్రం లేదని, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, సీనియర్లకే సీటు గ్యారెంటీ లేనప్పుడు ఒకే కుటుంబానికి రెండేసి ఎలా సాధ్యమన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ విషయాలు అటు అయ్యన్నకు, ఇటు బండారుకు తెలియనివి కాదని, ఒకరి ఎత్తుగడలను మరొకరు ప్రభావితం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ప్రతిపాదనలు చేసుకుంటున్నారన్నది పార్టీ ఇంటర్నల్‌ టాక్‌. బండారు, గంటా వంటి నేతలు ఒక గ్రూప్‌ గా ఏర్పడి రాజకీయాలు నడుపుతున్నందున అయ్యన్న తన డిమాండ్లను ఎలా సాధించుకుంటారు? దానికి సత్యనారాయణమూర్తి రియాక్షన్‌ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *