నేడు జానపద వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు వర్ధంతి.

వంగపండు ప్రసాదరావు జానపద వాగ్గేయకారుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు. అతను హేతువాది, ఉత్తరాంధ్ర గద్దర్‌ గా పేరు తెచ్చుకున్నాడు.‘‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ.. ఏం పిల్లో ఎల్దమొస్తవా’’ అంటూ ఆయన సొంతంగా రాసి, పాడిన పాట తెలుగు రాష్ట్రంతో పాటు ఒకప్పుడు దేశంలోనే మారుమోగింది. ‘‘సికాకులంలో సీమలకొండకి.. ఏం పిలడో ఎల్దమొస్తవా.. చిలకలు కత్తులు దులపరిస్తయట.. సాలూరవతల సవర్లకొండకి.. ఏం పిలడో ఎల్దమొస్తవా.. సెవల పిల్లులే శంఖమూదెనట ..తెలంగాణా కొమరయ్య కొండకి అంటూ’’ శ్రీకాకుళ పోరాటం, ఇతర విప్లవ ఉద్యమాల నేపథ్యంలో రాసిన పాట చాల పాపులర్‌ అయ్యింది. భారతదేశంలోని అన్ని భాషలలోకి ఇతర దేశాలలోని వాళ్ల భాషల్లోకి ఈ పాటను అనువాదించుకొని పాడుకున్నారు అంటే ఈ పాట ఎంత పాపులర్‌ అయిందో తెలుసుకోవచ్చు. వంగపండు మూడు దశాబ్దాలలో 300కు పైగా పాటలు రాసాడు. అందులో 12 పాటలు అన్ని గిరిజన మాండలికాలతో పాటు తమిళం, బెంగాళీ, కన్నడ, హిందీ వంటి పది భారతీయ భాషలలోకి కూడా అనువదించారు కూడా. ‘‘యంత్రమెట్టా నడుస్తు ఉందంటే…’’ అనే పాట ఒక ఆచార్యునిచే ఇంగ్లీష్‌లో కూడా డబ్‌ చేసారు. అమెరికా, ఇంగ్లాండ్‌లో కూడా ఈ పాట సూపర్‌ హిట్‌ అయింది. విప్లవ కవిత్వంలో వంగపండు పాట ప్రముఖ పాత్ర వహించింది. వంగపండు ప్రసాదరావు విజయనగరం జిల్లా పార్వతీపురం దగ్గర పెదబొండపల్లిలో జూన్‌ 1943న జగన్నాథం, చినతల్లి దంపతులకు సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. అతనికి ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. అందరి కంటే అతనే పెద్దవాడు. అతని చిన్నతనంలో పంట నూర్పిళ్లప్పుడు రాత్రిపూట మా తాత వాళ్లు పొలం దగ్గరకి వెళితే అతను వాళ్లతో పోయేవాడు. అప్పుడు అతని తాత, నాయిన, పెదనాయిన దేవుళ్ల కథలు చెప్పేవారు.చిన్నతనంలో అతనికి చదువు పెద్దగా అబ్బలేదు. ఎస్‌ ఎస్‌ ఎల్‌ సీ ఫెయిల్‌ కావడంతో బొబ్బిలిలో ఐటీఐ చేశాడు. అప్పట్లో చైనా యుద్ధంలో పాల్గొనాలనే పిలుపు వస్తే ఆ ట్రైనింగ్‌ తీసుకున్నాడు. ఆ యుద్ధం ఆగిపోవడంతో ఊరుబాట పట్టాడు. అప్పటికే అతని తండ్రి ఊళ్లో భూమి అమ్మేసి రాయగఢలో భూమి కొన్నాడు. తన తండ్రికి వ్యవసాయంలో కొంతకాలం తోడుగా ఉన్నాడు. వారి భూమి అడవికి దగ్గరగా ఉండేది. దీంతో అక్కడి గిరిజనులతో పరిచయాలు, వారి పదాలు అతని పాటల్లో బాగా దొర్లాయి. ఈ పనుల్లో పడి తెలిసిన పల్లె పదాలతో తోచిన బాణీలు కట్టుకుని పాడుతుంటే ఊళ్లో అంతా ‘ఓరేయ్‌ కవీ’ అని అతనిని పిలిచేవారు. అప్పట్లో అర్థంకాని పదాలు రాస్తేనే కవిత్వం అనుకునేవాడు. అతను లల్లాయ పదాలతో పాటలు అల్లుకుపోయేవాడు. ప్రజలు అతని చేత పాటలు పాడిరచుకుని, సరదా పడేవారు. అంతవరకు అతనికి సరదా సరదాగా గడిచిపోయింది. వివాహం చేసుకున్న తరువాత రెండు సంవత్సరాలకు మొదలైన నక్సల్బరీ ఉద్యమం అతనిలో పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఎక్కడ ఉన్నా ఉద్యమం అతని జీవితం లో ఒక భాగమయింది. ఆ ఉద్యమంలో ఎంతో మందిని కలిసాడు. ఎందరో కష్టాలను ప్రత్యక్షంగా చూసాడు. జనాన్ని జాగృతం చేయడానికి వాటన్నిటినీ పాటగా రూపుకట్టాడు. ఆ ఊపులో 400కు పైగా జాన పద పాటలు రాసాడు. వాటిలో 200కు పైగా గీతాలు మంచి గుర్తింపు తెచ్చాయి. ఉద్యమంలోకి వెళ్లిన ఏడాదికే విశాఖ షిప్‌ యార్డులో ఫిట్టర్‌మన్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగం కంటే ఉద్యమమే అతనికి ఆత్మ సంతృప్తినిచ్చింది. షిప్‌యార్డులో పని చేస్తూ ఉన్నా మనసంతా అతనికి ఉద్యమం వైపే ఉండేది. దీంతో పదిరోజులు పనికెళ్లడం, ఇరవై రోజులు పాటలు పాడుకుంటూ ఊళ్లలో తిరగడం చేసేవాడు. అలా కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ , కర్ణాటక రాష్ట్రాలన్నీ తిరిగాడు. ఇలా తిరుగుతూ ఉంటే ఇంట్లో పూట గడవని స్థితి ఏర్పోడిరది. ఒక పూట తింటే మరో పూట పస్తు ఉండే పరిస్థితి ఏర్పడిరది. అయినా సరే అతను నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదు. ఆరేళ్ళు సర్వీసు ఉన్నా స్వచ్ఛంద పదవీవిరమణ చేసి పూర్తి స్థాయి ఉద్యమంలో కొనసాగాడు.మధ్యతరగతి కుంటుంబాలకు ఉద్యమాలు సరిపోవని అనుకున్నాడు. ఉద్యోగం వదులుకున్నప్పుడు ఎంతో మానసిక క్షోభ అనుభవించాడు. ఇంట్లో నలుగురు పిల్లలు, భార్య. వారికి కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేనప్పుడు ఈ ఉద్యమాలెందుకన్న ఆలోచనలో మధనపడేవాడు. మళ్లీ కొన్నాళ్లు స్వంత గ్రామంలో వ్యవసాయం చేశాడు కానీ కలిసిరాలేదు. ఆకలి బాధ కోసం ఆత్మాభిమానం చంపుకోకూడద నిపించి మళ్లీ ఉద్యమం బాటే పట్టాడు.దర్శకులు టి.కృష్ణ, ఆర్‌. నారాయణమూర్తిలతో పాటు మరికొందరు వారి సినిమాలకు పాటలు రాయమని అతనిని కోరారు. అలా 30 సినిమాల వరకు రాశాడు. అలాగే ఆరేడు సినిమాల్లోనూ నటించాడు. కొన్ని సినిమాలకు పాటలు రాసే అవకాశాలొచ్చినా జననాట్యమండలి నిబంధనలకు కట్టుబడి రాయలేదు. సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే అతని జీవితం మరోలా ఉండేది.2017లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం అందుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలో 2020 ఆగస్టు 4న తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశాడు.తన జీవితమంతా ప్రజా ఉద్యమాలు, జానపద కళలకే వెచ్చించిన వంగపండు తుదిశ్వాస వరకు అత్యంత సాధారణ జీవితం గడిపారు. వంగపండు చనిపోయినప్పడు ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్‌, కేసీఆర్‌లు సంతాపం ప్రకటించారు. ఏపీ సర్కార్‌ వంగపండు జానపద పురస్కారం ఏర్పాటు చేసింది. ఎంపికైన వారికి రూ.2 లక్షల నగదు బహుమానం, ప్రశంసాపత్రం ఇవ్వనున్నారు. ఏటా వంగపండు వర్థంతి అయిన ఆగస్టు 4న పురస్కారం ఇవ్వనున్నట్లు సాంస్కృతిక శాఖ తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *