హూజూరాబాద్‌… ఎన్నికలు మహా కాస్ట్లీ

గతేడాది అక్టోబర్‌ మాసంలో జరిగిన హుజురాబాద్‌ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక చరిత్రను సృష్టింది. అలాగే, ఈ సంవత్సరం చివర్లో జరిగే మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికకు రంగం సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో హుజురాబాద్‌ చరిత్రను మునుగోడు తిరగ రాస్తుందా? మరో చరిత్రను సృష్టిస్తుందా? ఇప్పుదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. నో … నో… మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది ఎన్నికల ఫలితాల గురించి కాదు. హుజూరాబాద్‌ ఫలితం మునుగోడులో పునరావృతం అవుతుందా, కాదా అని అసలే కాదు. ఓటర్ల చైతన్యం గురించి అంతకంటే కాదు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రజాసామ్య వ్యవస్థపై మిగిల్చిన చెరగని మరక గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. అవును, హుజురాబాద్‌ ఉప ఎన్నిక చరిత్రలో ఒక మచ్చలా మిగిలిపోయింది. హుజురాబాద్‌ ఉప ఎన్నికకు కొన్ని నెలల ముందు నుంచే, ఎన్నికల సందడి మొదలైంది. నియోజక వర్గం ప్రజలు ఇంచు మించుగా నాలుగు నెలల పాటు, నిత్య విందులలో మునిగి తేలారు. అవును, హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఖర్చు అక్షరాల ఇన్ని కోట్లని చెప్పలేము. తక్కువలో తక్కువ ఒక వెయ్యి కోట్ల పైమాటగానే, చెప్పుకుంటున్నారు. కానీ, శ్రీ సర్కార్‌ వారు ఆ మూడు నాలుగు నెలలో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసమే, ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేశారని, అధికారిక గణాంకాలే సూచిస్తున్నాయని అంటున్నారు. ఇక అధికార పార్టీ ఖర్చుచేసిన కోట్ల విషయం అయితే చెప్పనక్కరలేదు. అవును అధికార పార్టీకి సమతూకంగా కాకపోయినా, అందుకు దీటుగానే బీజేపీ (ఈటల) కూడా కోట్లు ఖర్చు చేశారు. అలా ఓ వంక ప్రభుత్వం, మరో వంక అధికార, ప్రత్యర్ధి పార్టీలు కోట్లలో కుమ్మరించారు, ఓటు రేటు రూ.6000 నుంచి రూ.10,000 వేల వరకూ పలికిందన్న ప్రచారం జరిగింది. కాబట్టే, హుజురాబాద్‌ ఉపఎన్నిక రాష్ట్రంలో కాదు, దేశంలోనే, ‘అత్యంత’ఖరీదైన ఉప ఎన్నికగా చరిత్ర సృష్టించింది. అంతే కాదు, అధికార తెరాస ఇచ్చిన, కానుకల కవర్లు తమ దాకా రాలేదని ఓటర్లు తెరాస నాయకులను బహిరంగంగా నిల దీశారు. ధర్నాలు చేశారు. ఇది కూడా, హుజురాబాద్‌ ఉప ఎన్నిక సృష్టించిన మరో ‘చరిత్ర’. నిజానికి హుజురాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత, రాజీనామాకు ఎమ్మెల్యేల పై ప్రజల వత్తిడి పెరిగింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజీనామా చేసి, ఉప ఎన్నిక వస్తే హుజూరాబాద్‌ ఓటర్లకు దక్కిన భోగ భాగ్యాలు తమకు కూడా దక్కుతాయనే ఆశలు అందరిలో చిగురించాయి. అందుకే ఎమ్మెల్యేల రాజీనామాకు ప్రజలు కోరుకున్నారు. నిజానికి, ఒక హుజూరాబాద్‌ అనే కాదు, హుజూరాబాద్‌ మోతాదు లో కాకున్నా, ఉప ఎన్నికలు జరిగిన అన్ని నియోజక వర్గాల్లోనూ తెరాస ప్రభుత్వం, అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు తీయించింది. తెరాస రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగు నియోజక వర్గాల్లోనూ ప్రభుత్వం, అధికార పార్టీ ఆకాశమే హద్దు అన్న విధంగా నిధులను ఖర్చు చేయడం జరిగింది. అఫ్కోర్స్‌, హుజూరాబాద్‌ ను ముఖ్యమంత్రి ఇజ్జత్‌ కి సవాల్‌ గా తీసుకున్నారు కాబట్టి అక్కడ మోతాదు మరింతగా పెరిగింది. ఫ్యామిలీకి పదిలక్షలు ఇచ్చే దళిత బంధు పథకం అనివార్యంగా బయటకు వచ్చింది. బసరే, అదలా ఉంచి మళ్ళీ మనం, మన మునుగోడు… విషయానికి వస్తే,హుజూరాబాద్‌ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం, అధికార పార్టీ కొంచెం ఆచి తూచి అడుగులు వేస్తున్నాయిఅయితే, కొత్త పథకాల జోలికి వెళ్లకుండా పాత పెండిరగ్‌ లో ఉన్న పెన్షన్లు, మండలాల ఏర్పాటు, ఇప్పటికే నిధులు మంజూరై పెండిరగ్‌ లో ఉన్న అభివృద్ధి పనులను కానిచ్చేయడం, అవసరమనుకున్న చోటే అభివృద్ధి పనులను చేయడం మంచిదనే అభిప్రాయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధానంగా హుజూరాబాద్‌ లో ఎదురైన పరాభవం ఒక కారణం అయితే, మూడేళ్ళుగా అభివృద్ధికి నోచుకోని నియోజక వర్గంలో ఎంతో కొంత అభివృద్ధి సాధించేందుకే రాజీనామా చేస్తున్నానని, సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి చేస్తున్న చేస్తున్న ప్రచారానికి భయపడి, అధికార తెరాస ప్రస్తుతానికి అయితే కొంత ముందు చూపుతో, మెల్ల మెల్లగా అడుగులు వేస్తోందని అంటున్నారు.అయితే, మునుగోడు ఓటర్లు మాత్రం, ఉప ఎన్నికపై చాలా చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనుల విషయం ఎలా ఉన్నా, తెరాస, బీజేపీతో పాటుగా కాంగ్రెస్‌ పార్టీ కూడా సీరియస్‌ గా పోటీలో ఉన్న నేపధ్యంలో ఓటు రేటు భారీగా పెరుగుతున్నదని, ఓటర్లు లెక్కలు వేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలూ ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ రూ.10 వేల దాకా ఇస్తుందన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. అంటే, మూడు పార్టీల నుంచి కలిపి ఓటుకు రూ.30 వేల వరకు అందుతాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.దీంతో ఈ నియోజకవర్గానికి చెందిన, ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న వారందరి దృష్టి ఇప్పుడు మునుగోడుపై పడిరది. ఉప ఎన్నిక నేపథ్యంలో వారంతా మునుగోడు నియోజకవర్గంలో ఓటు నమోదు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారు కూడా తమ ఓటును బదిలీ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరితో పాటు ఇప్పటిదాకా ఓటు హక్కు రానివారు కూడా పెద్ద సంఖ్యలో ఓటు కోసం దరఖాస్తు చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆగస్టు 2 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కలిపి 13 వేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరో వంక నియోజక వర్గం పరిధిలో, మద్యం ఘుమఘుమలు ఇప్పటికే మొదలయ్యాయి నియోజకవర్గానికి సవిూప మండలాల్లోనూ మద్యం విక్రయాలు రెట్టింపయ్యాయి. ఆగస్టు 1 నుంచి 29వ తేదీ వరకు చండూరు, నాంపల్లి, రామన్నపేట ఎక్సైజ్‌ సర్కిళ్ల పరిధిలో 1,11,279 పెట్టెల మద్యం విక్రయాలు జరిగాయి. ప్రభుత్వానికి రూ.43.19 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ఫంక్షన్‌ హాళ్లను తీసుకుని సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రతిరోజూ గ్రామాల్లో పార్టీల ఫిరాయింపు బేరసారాలతో రాత్రివేళ అధిక సంఖ్యలో మద్యం సిట్టింగ్‌లు జరుగుతున్నాయి. దీంతో మద్యం విక్రయాలు మరింత పెరుగుతున్నాయి. అయితే, హుజురాబాద్‌ తో మునుగోడు పోటీ పడుతుందా? హుజూరాబాద్‌ మలిన చరిత్రను మునుగోడు చెరిపేస్తుందా? ఇంకా ఎక్కువ చేస్తుందా, అంటే, పరిశీలకులు చూడాలి మరి ..అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *