50 లక్షల కొత్త కార్డులకు ఎదురుచూపులు..

రాష్ట్రంలో రేషన్‌ కార్డుల రీ సర్వే నామ మాత్రంగానే సాగుతోందా? క్షేత్రస్థాయిలో కార్డుదారుల అడ్రస్‌ లు పూర్తిస్థాయిలో అధికారులకు దొరకడం లేదా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. దీంతో సర్వేపై అధికారులను వివరణ కోరగా.. పౌరసరఫరాల శాఖ అధికారులు ‘ఏం చెప్పలేం’ అంటూ దాటవేస్తున్నారు. దీంతో రీ సర్వే కార్డులలోనూ అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందా? లేదా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. కాగా సుప్రీంకోర్టు 21.94 లక్షల కార్డులు రద్దయినట్టు పేర్కొనగా, సివిల్‌ సప్లై మాత్రం 19 లక్షలుగానే ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. దీంతో తొలగించిన కార్డుల వివరాల్లోనూ అస్పష్టత ఏర్పడిరది.రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం 2016 లో ఏకకాలంలో ఎలాంటి విచారణ లేకుండానే దాదాపు 19 లక్షల మేర రేషన్‌ కార్డులను రద్దు చేసింది. ఈ అంశంపై పులువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు రద్దు చేసిన కార్డులపై రీ సర్వే నిర్వహించి పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. రీ సర్వే మాత్రం ఆశించిన మేర ముందుకు సాగడం లేదు.గతంలో నివాసం ఉన్న ఇంటి నెంబరుపై దరఖాస్తు చేసుకున్న కుటుంబం ఆ అడ్రస్‌ నుంచి వేరే ప్రాంతానికి మారారు. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులకు వారి వివరాలు దొరకడం లేదు. గత దరఖాస్తులో పేర్కొన్న చిరునామాలో వ్యక్తులు లేకపోవడంతో వివరాలు సేకరించాల్సిన అధికారులు.. ఏదో సాకు చూపి కార్డుకు అనర్హులని నమోదు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రీ సర్వేను నామమాత్రంగానే చేస్తున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు. సర్వే ఆలస్యమవడంతో 19 లక్షల కార్డులకు మోక్షమెప్పుడు లభిస్తుందోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.రేషన్‌ కార్డుల రీ వెరిఫికేషన్‌ కు సంబంధించి సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 27న రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆలస్యంగా స్పందించిన సివిల్‌ సప్లై శాఖ జూలై 4న జిల్లా అధికారులకు లేఖలు రాసింది. దీంతో అప్పటికే మూడు నెలల సమయం వృధా అయింది. కోర్టు ఆదేశాలు ఇచ్చిన వెంటనే రాష్ట్ర అధికారులు స్పందించి ఉంటే ఇచ్చిన గడువు జూలై 20 వరకే వెరిఫికేషన్‌ పూర్తయ్యేది కానీ, అధికారుల అలసత్వంతో రీ సర్వే ఆలస్యమైందన్నది స్పష్టమవుతోంది. కాగా రీ సర్వే ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆగష్టు 10 వరకు పూర్తిచేసి నివేదిక ఇస్తామని కౌంటర్‌ దాఖలు చేసిన అధికారులు.. ఇప్పటివరకు అసలు రీ సర్వేనే పూర్తిచేయకపోవడం గమనార్హం. దీంతో రీ సర్వే ఎప్పటికి పూర్తవుతుందోనని లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది.ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రకాల కార్డులు కలుపుకుని 90.50 లక్షల రేషన్‌ కార్డులున్నాయి. 2014 తరువాత నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం కొత్త కార్డుల జారీపై దృష్టి సారించలేదు. 2018 ఎన్నికల హావిూ మేరకు 2021లో 16 లక్షల అప్లికేషన్లు రాగా.. కేవలం 2 లక్షల కొత్త రేషన్‌ కార్డులనే జారీ చేసింది. దీంతో గతంలో అప్లికేషన్‌ చేసుకుని ఆన్‌ లైన్‌ అయి ఉన్నవారు సుమారు 14 లక్షల మంది ఉండగా.. కేవలం దరఖాస్తు చేసుకుని ఆన్‌ లైన్‌ కాని వారు సుమారు 40 లక్షల మంది ఉన్నట్టు సమాచారం. దీంతో 55 నుంచి 60 లక్షల మంది కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో 19లక్షల మందిలో ఎంతమంది అర్హులుగా తేలనున్నారనేది సివిల్‌ సప్లై సమర్పించనున్న నివేదికలో తెలియనుండగా.. అర్హులైన వారికి వెంటనే కార్డులను జారీ చేయాల్సి ఉంది. చూడాలి మరి రీ సర్వే ఎప్పటికీ తేలనుందో.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *