దాడి చేస్తున్న సీజనల్‌ వ్యాధులు

సీజనల్‌ వ్యాధుల దాడి మళ్లీ మొదలైంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌తో పాటు ఇతర వైరల్‌ జ్వరాలు ఒకేసారి అటాక్‌ చేస్తున్నాయి. మొదట నార్మల్‌ ఫీవర్‌గానే మొదలవుతోంది. సాధారణ జ్వరమే కదా? అనుకునేలోపే విశ్వరూపం చూపిస్తోంది. హైదరాబాద్‌ను విషజ్వరాలు హడలెత్తిస్తున్నాయి. సీజనల్‌ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. రోగులతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండటమే ఆందోళన కలిగించే అంశం!గాంధీ, ఫీవర్‌, నిలోఫర్‌ ఆసుపత్రి ఏదైనా.. పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. సీజనల్‌ వ్యాధులు నగరాన్ని పట్టిపీడిస్తున్నాయి. వాతావరణ మార్పులతో పాటు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వైరల్‌ ఫీవర్స్‌ విజృంభిస్తున్నాయి. గత పది రోజులుగా ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరిగింది. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు.. అందరూ ఆస్పత్రులకు క్యూకడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ, చికెన్‌ గున్యాతో ఆస్పత్రుల బాట పడుతున్నారు రోగులు. సాధారణంగా వచ్చే ఓపీల కంటే ఇప్పుడు రెట్టింపవడం ఆందోళన కలిగిస్తోంది.ఒక్క ఫీవర్‌ ఆసుపత్రిలో ఈ నెల రోజుల్లో 160 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 12 వందలకు పైగా ఓపీలు నమోదవుతున్నాయి. నగరంలో ఉన్న మిగతా.. ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అంటే సీజనల్‌ వ్యాధుల ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా ఆస్పత్రుల్లో ఇన్‌ పేషేంట్లతో జనరల్‌ వార్డ్‌ పూర్తిగా నిండి పోయింది. పేషెంట్లకు బెడ్లు సరిపోవడం లేదు. ఇతర వార్డుల్లోనూ, లేదంటే ఒకే బెడ్‌ విూద ఇద్దరిని ఉంచి ట్రీట్మెంట్‌ చేయాల్సిన పరిస్థితలులు ఏర్పడుతున్నాయి.సీజనల్‌ వ్యాధుల ప్రభావం చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉంది. నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి పేషేంట్లు నిలోఫర్‌ ఆసుపత్రికి వస్తుంటారు. దీంతో అక్కడ బెడ్స్‌ దొరక్క ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కో బెడ్‌ పై ఇద్దరు, ముగ్గురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. కొంత మంది రోగులకు రెండు, మూడు రకాల వైరల్‌ ఫీవర్స్‌ ఉండటంతో.. ట్రీట్మెంట్‌ చేయడం కొంచెం కష్టంగా మారుతోంది.మాములుగా ఇది వైరల్‌ ఫీవర్‌ వచ్చే సీజన్‌. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సెప్టెంబర్‌ లాస్ట్‌ వరకు వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ ఉంటాయని డాక్టర్లు అంటున్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *