జగన్‌ ట్రాప్‌ లో చంద్రబాబు

ఏపీలో నిన్న టీడీపీ మహానాడు సందర్భంగా రాజమండ్రిలో ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోపై చర్చ జరుగుతోంది. గతంలో సంక్షేమం కంటే అభివృద్ధే మిన్నగా భావించిన చంద్రబాబు తన పాలనలో దానికే ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధి అంటే చంద్రబాబు పేరు గుర్తుకురావాలన్నట్లుగా తపించిన చంద్రబాబుకు 2019 ఎన్నికలు బొప్పి కట్టించాయి. దీంతో ఇప్పుడు ఆయన వైఎస్‌ జగన్‌ సంక్షేమ మంత్రానికి మరింత మసాలా జోడిరచి మినీ మ్యానిఫెస్టో ప్రకటించినట్లు అర్ధమవుతోంది. 2018లో కేంద్రంలో బీజేపీతో అధికారం పంచుకుంటున్న చంద్రబాబును ఎన్డీయేతో విడదీసేందుకు రాజకీయంగా వైసీపీ అధినేతగా ఉన్న జగన్‌ ఓ రాయి వేశారు. కేంద్రం విభజన హావిూలు నెరవేర్చకున్నా టీడీపీ ఎందుకు ఇంకా ఎన్డీయేలో కొనసాగుతోందని ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉంటూ, కేంద్రంలో రెండు మంత్రి పదవుల్లో కొనసాగుతున్న టీడీపీపై ఒత్తిడి అమాంతం పెరిగిపోయింది. ఇది కాస్తా అంతకంతకూ పెరిగి చివరకు బీజేపీతో పొత్తుకు, ఎన్డీయేలో భాగస్వామ్యానికి, కేంద్రమంత్రి పదవులకు గుడ్‌ బై చెప్పేసిన టీడీపీ.. ధర్మపోరాటం పేరుతో అభాసుపాలైంది. ఇప్పుడు చంద్రబాబు నిన్న రాజమండ్రిలో ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోను గమనిస్తే వైసీపీ కన్నా ఎక్కువ సంక్షేమం అమలు చేస్తామనే నమ్మకం కల్పించాలనే ప్రయత్నం కనిపించింది. అయితే సంక్షేమం విషయంలో చంద్రబాబుకు ఉన్న పేలవ రికార్డు ఈ మినీ మ్యానిఫెస్టోను జనాల్లోకి ఏ మేరకు తీసుకెళ్తుందన్నది కాలమే చెప్పాలి. అయితే చంద్రబాబు తన సొంత విధానం కంటే సంక్షేమం విషయంలో జగన్‌ ను ఫాలో అవ్వాలని భావిస్తుండటం చూస్తుంటే ఆయన తాజా పరిస్ధితి అర్ధమవుతోంది. గతంలో ప్రత్యేక హోదా పేరుతో జగన్‌ మొదలుపెట్టిన వాదన ట్రాప్‌ లో పడి అధికారం కోల్పోవడమే కాకుండా బీజేపీకి బద్ధశత్రువుగా మారిపోయిన చంద్రబాబు.. ఇప్పుడు సంక్షేమం విషయంలో తామే మెరుగు అని చెప్పుకునేందుకు ప్రకటించిన మినీ మ్యానిఫెస్టో కూడా ఆ విషయంలో జగన్‌ ను అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నట్లే ఉంది. తద్వారా మరోసారి జగన్‌ ట్రాప్‌ లో పడి జనంలో పలుచన అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *