కలకలలాడుతున్న రిజర్వాయర్లు

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే జిల్లాలోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా శ్రీశైలం ప్రాజెక్టు జూలై నెలలోనే నిండిరది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.70అడుగులు నీటిమట్టం ఉంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 191.6512టీఎంసీలకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 50,927 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా సగటున 80వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వదలడంతో వివిధ జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. రైతులు ఆలస్యం చేయకుండా ఖరీఫ్‌ పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నంద్యాల జిల్లాలోని గోరుకల్లు, అవుకు, వెలుగోడు రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి లింకు ఛానల్‌ ద్వారా వెలుగోడు రిజర్వాయర్‌కు 14వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. వెలుగోడు రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.418 టీఎంసీలు నీరు రిజర్వాయర్‌లోకి చేరింది. ఎస్సార్బీసీ చరిత్రలోనే ఇప్పటి వరకు జూలై నెలలో కాల్వలకు నీటిని విడుదల చేయలేదు. అయితే గోరుకల్లు రిజర్వాయర్‌ నీటి సామర్థ్యం 10 టీఎంసీలు . ప్రస్తుతం 5 టీఎంసీలు పైగా నీరు నిల్వ ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి నీటి మట్టం వచ్చాక, గేట్లు ఎత్తిన తర్వాతనే ఎస్సార్బీసీ కాల్వలకు నీరు వదిలేవారు. అయితే, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తకముందే రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో జూలై మొదటి వారంలోనే కాల్వలకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో బానకచర్ల నుంచి గోరుకల్లు రిజర్వాయర్‌కు 9వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
అవుకు రిజర్వాయర్‌ నీటి సామర్థ్యం 4.184 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.184టీఎంసీల నీరు నిల్వ ఉంది. అవుకు రిజర్వాయర్‌ కింద అధికారికంగా, అనధికారికంగా 10వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లోకి వరద నీరు భారీగా వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *