బుజ్జగించే పనిలో గులాబీ నేతలు

హైదరాబాద్‌, ఆగస్టు 24
టికెట్‌ దక్కని నేతలు బీఆర్‌ఎస్‌ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. కొందరు పార్టీ మారేందుకు చూస్తుంటే, మరికొందరు రాజీనామా బాటపట్టారు. దీంతో బీఆర్‌ఎస్‌ అధిష్టానం దూతలను రంగంలోకి దింపి బుజ్జగింపులు మొదలుపెట్టింది.115 మందితో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితాను సీఎం కేసీఆర్‌ ఇటీవల విడుదల చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తూ టికెట్లు కేటాయించారు. అయితే ఈసారి టికెట్లు ఆశించిన కొందరు నేతలకు నిరాశే ఎదురైంది. టికెట్ల దక్కని కొందరు బీఆర్‌ఎస్‌ నేతలు కన్నీటి పర్యంతం అయితే మరికొందరు తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ అధిష్టానం రంగంలోకి దిగింది. అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. టికెట్‌ దక్కని కొందరు నేతలు కాంగ్రెస్‌, బీజేపీ వైపు చూస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అసంతృప్తి నేతలతో ఇతర పార్టీల నేతలు సంప్రదింపులు మొదలుపెట్టారు. కీలక నేతలు చేజారిపోకుండా బీఆర్‌ఎస్‌ అధిష్టానం సీనియర్లతో బుజ్జగింపులు మొదలుపెట్టింది.బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్‌ దక్కకపోవడంతో ఆయన తీవ్రమనస్తాపంతో ఉన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్‌ను కడియం శ్రీహరికి కేటాయించింది బీఆర్‌ఎస్‌. దీంతో రాజయ్య తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మంగళవారం కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడుతూ రాజయ్య బోరున ఏడ్చారు. అంబేడ్కర్‌ విగ్రహం ముందు బోర్లా పడి కన్నీటిపర్యంతం అయ్యారు. కార్యకర్తలను పట్టుకుని ఏడ్చేశారు. అయితే తాటికొండ రాజయ్యను ఓదార్చేందుకు అధిష్టానం పల్లా రాజేశ్వర్‌ రెడ్డి దూతగా పంపింది. బుధవారం రాజయ్యను కలిసేందుకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి హన్మకొండలోని ఎమ్మెల్యే ఇంటికి వచ్చారు. కానీ రాజయ్య మాత్రం పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని కలిసేందుకు అంగీకరించలేదు. ఎమ్మెల్యే ఇంట్లో లేరని చెప్పడంతో పల్లా స్థానిక కార్యకర్తలు, రాజయ్య అనుచరులతో భేటీ అయి వారిని బుజ్జగించారు. రాజయ్యకు బీఆర్‌ఎస్‌ లో సముచిత స్థానం ఉంటుందని సీఎం కేసీఆర్‌ చెప్పారని పల్లా అన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలిసి రాజయ్య గురించి చర్చిస్తానన్నారు.రాజయ్యను ఓదార్చడానికి పల్లా వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ పల్లాను కలిసేందుకు రాజయ్య నిరాకరించడంతో ఆయన వెనుదిరిగారు.మరో సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈసారి నిరాశే ఎదురైంది. ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. పాలేరు నుంచి తుమ్మల టికెట్‌ ఆశించారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులు మంగళవారం సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. తుమ్మలను బుజ్జగించేందుకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎంపీ నామా నాగేశ్వరరావును దూతగా పంపింది. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లోకి వెళ్తారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ కాంగ్రెస్‌ లోకి వెళ్లారు. కరీంనగర్‌ లో బీఆర్‌ఎస్‌ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌ కుమార్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలోకి చేరుతున్నట్లు సమాచారం. పార్టీ నేతలను కాపాడుతునేందుకు బీఆర్‌ఎస్‌ బుజ్జగింపులు ఫలిస్తాయా? లేదా? వేచిచూడాలి.
పార్టీకి గుడ్‌ బై చెబుతున్న నేతలు
నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలందరితో చర్చించి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. వారం, పది రోజుల్లో రాజకీయ నిర్ణయం తీసుకుంటానని వీరేశం అంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు గులాబీ అధినేత కేసీఆర్‌ విడుదల చేసిన తొలి జాబితాలో చోటు దక్కింది. నకిరేకల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించారు. కానీ సీఎం కేసీఆర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు అవకాశం ఇచ్చారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల వీరేశంపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన చిరుమర్తి లింగయ్య ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటినుంచి నకిరేకల్‌ నియోజకవర్గంలో గ్రూప్‌ వార్‌ కొనసాగుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితిలో వర్గ పోరు కొనసాగింది. ఈ సారి తనకే టికెట్‌ ఇవ్వాలంటూ వేముల వీరేశం పార్టీ అధినేతల్ని కలిసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఏది ఏమైనా ఎన్నికల బరిలో ఉంటానని వీరేశం చెబుతున్నారు.నకిరేకల్‌లో ముఖ్య కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీ మార్పుపై కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సమావేశం తర్వాత వేముల వీరేశం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగున్నరేళ్లు బీఆర్‌ఎస్‌ పార్టీలో భాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీని వదిలేస్తున్నాని, కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తానని ఆయన చెప్పారు.వారం, పది రోజుల్లో రాజకీయ నిర్ణయం తీసుకొని భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానని అన్నారు. రాజకీయ పార్టీతోనే నకిరేకల్‌ బరిలో పోటీలో ఉంటానని వీరేశం స్పష్టం చేశారు. తన గెలుపే అన్నింటికీ సమాధానం చెబుతోందని ఆయన అన్నారు. ‘బరాబర్‌ నేను మాజీ నక్సలైట్‌ నే.. పేద ప్రజల కోసమే పోరాడే వ్యక్తిని నేను’ అని చెప్పారు. వారం, పది రోజుల్లో వేముల వీరేశం కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అనుచరులు వేముల వీరేశంతో చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే వేముల వీరేశం రాకను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమ్మతితో కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు వేముల వీరేశం ప్రయత్నాలు చేస్తున్నారట. ఎలాగైనా కాంగ్రెస్‌ పార్టీలో చేరి టికెట్‌ సంపాదించేందుకు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారట. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నకిరేకల్‌ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించాలని పట్టుదలతో వేముల వీరేశం ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *