ఆగస్టు 1 నుంచి షూటింగ్‌ లు బంద్‌

తెలుగు నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి సినిమా షూటింగ్‌ లన నిలిపేయాలని నిర్ణయించింది. దీంతో అగ్రహీరోల సినిమాల షూటింగ్‌ లు నిలిచిపోనున్నాయి. రేపు ఫిల్మ్‌ ఛాంబర్‌ లో ప్రత్యేక సమావేశం జరగుతుంది. ఈ ప్రత్యేక సమావేశం జరగక ముందే నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. నిర్మాతల మండలి నిర్ణయంతో అగ్ర ?నిర్మాతలు అసంతృప్తికి గురయ్యారు. అగ్రహీరోల సినిమాలు… ప్రస్తుతం ముప్పయి సినిమాలు షూటింగ్‌ లు జరుపుకుంటున్నాయి. ఇందులో పది పదిహేను సినిమాలు చిన్నవి కాగా, దాదాపు పదిహేను అగ్ర హీరోలు సినిమాలు నిలిచిపోనున్నాయి. ఫిలింఛాంబర్‌ ప్రమేయం లేకుండానే నిర్మాతల మండలి నిర్ణయం తీసుకోవడం వివాదంగా మారనుంది. ఓటీటీ లో సినిమాల విడుదల, థియేటర్లకు ప్రేక్షకుల జనం ఆదరణ లభించకపోవడం, ఖర్చులు భారీగా పెరిగి పోవడం వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని సినిమా షూటింగ్‌ లను బంద్‌ చేయాలని నిర్ణయించింది. ఈ అంశాలపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే షూటింగ్‌ లను ప్రారంభించాలని నిర్మాత మండలి నిర్ణయించింది.
ఎవరికి కష్టం.. ఎవరికి నష్టం
తెలుగు చిత్రపరిశ్రమలో ‘యాక్టివ్‌ తెలుగు ఫిలిమ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌‘ డిసెంబర్‌ 1 నుండి షూటింగ్స్‌ జరపరాదన్న నిర్ణయానికి వచ్చింది. ప్యాండమిక్‌ కారణంగా తెలుగు సినిమా రంగమే కాదు, భారత చిత్రసీమ, యావత్‌ ప్రపంచంలోని సినిమా పరిశ్రమ నష్టాల బాట పట్టింది. దీనిని అధిగమించడానికి ఆ యా దేశాల్లోని సినిమా జనం కృషి చేస్తూనే ఉన్నారు. నిర్మాణ వ్యయంలో బాలీవుడ్‌ నే మించి పోయిన టాలీవుడ్‌ ఖర్చు తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఈ బంద్‌ కు పిలుపు నిచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ పిలుపు యాక్టివ్‌ గా సినిమాలు తీసే నిర్మాతలే ఇవ్వడం ద్వారా ప్రస్తుతం ఆయా సంస్థలు నిర్మిస్తున్న చిత్రాలు, వాటికి అయిన ఖర్చు, పూర్తి కావడానికి వెచ్చించవలసిన మొత్తాలు అన్నీలెక్కలు చూసుకుంటే పిలుపును ఇచ్చిన వారికే ఎక్కువ నష్టం వాటిల్లేలా కనిపిస్తోంది. ఈ గిల్డ్‌ లో ఉన్న శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌, మైత్రీ మూవీమేకర్స్‌, హారికా అండ్‌ హాసిని, సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ , సూర్య మూవీస్‌ వంటి ప్రముఖ సంస్థలు నిర్మిస్తున్న చిత్రాల షూటింగ్స్‌ జరుగుతున్నాయి. వీరు షూటింగ్స్‌ నిర్వహించరాదని నిర్ణయించడంతో ముందుగా భయపడుతున్నది సినీ కార్మికులే! ఎందుకంటే స్టార్స్‌, నటీనటవర్గం,సాంకేతిక వర్గానికి అడ్వాన్స్‌ కొంత ఇచ్చి, తరువాత షూటింగ్‌ పూర్తయిన తరువాత ఒప్పందం ప్రకారం బ్యాలెన్స్‌ సెటిల్‌ చేస్తూ ఉంటారు. ఇదేవిూ కొత్త పద్ధతి కాదు. యాక్టివ్‌ గిల్డ్‌ నిర్మాతలే రెగ్యులర్‌ గా సినిమాలు నిర్మిస్తున్నారు. వారి కారణంగానే తాము మూడు పూటలా భోంచేయగలుగుతున్నామని సినీ కార్మికులు అంటున్నారు. వారు సినిమా షూటింగ్స్‌ ఆపు చేస్తే ముందుగా ప్రభావం తమపైనే పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ మాత్రం అలాంటి రోజువారీ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటామని చెబుతున్నట్టు, అందుకు లోపాయికారిగా కార్మికులు కూడా సమ్మతించినట్టు సమాచారం.వ్యయం తగ్గించాలంటే ముందుగా భారీ మొత్తాలు తీసుకొనే స్టార్‌ యాక్టర్స్‌, స్టార్‌ టెక్నీషియన్స్‌ నే సంప్రదించి, ఓ నిర్ణయం తీసుకొని మధ్యేమార్గంగా ఏదైనా ఉపాయం ఆలోచించాలి. అయితే టాప్‌ స్టార్స్‌ తో సినిమాలు తీస్తోన్న యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ మాత్రం తమ స్టార్స్‌ కు ఏ మాత్రం ఇబ్బంది కలుగకూడదనే భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఎందువల్లనంటే, వారి కారణంగానే అంతో ఇంతో థియేటర్లు నిండే అవకాశం ఉందని, అలాగని వారిపై ఒత్తిడి తెచ్చి, ఇబ్బంది పెట్టేబదులు వారితో మధ్యేమార్గంలో పరిష్కారం చూసుకోవాలని గిల్డ్‌ లోని ప్రొడ్యూసర్స్‌ భావిస్తున్నట్టు సమాచారం. మరి స్టార్స్‌ తోనూ, కార్మికులతోనూ ఇబ్బందులు లేకపోతే షూటింగ్స్‌ ఆపు చేసి ఎవరిని దారిలోకి తెచ్చుకుంటారని గిల్డ్‌ లో లేని కొందరి మాట!తమ సినిమాలకు క్రేజ్‌ తీసుకువచ్చే స్టార్స్‌ కు వారి డిమాండ్‌ ను బట్టి రెమ్యూనరేషన్స్‌ అందించడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారు. కానీ, కాసింత పేరున్న నటీనటులు సైతం స్టార్స్‌ లా ఫీలవుతూ, తమతో పాటు, తమ సిబ్బందికి సైతం నిర్మాతలే పారితోషికాలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడమే గిల్డ్‌ ప్రొడ్యూసర్స్‌ కు కొరకుడు పడడం లేదు. ఈ కేరెక్టర్‌ యాక్టర్స్‌, కమెడియన్స్‌ టాప్‌ స్టార్స్‌ లాగా తమకూ కార్‌ వాన్స్‌ తెప్పించాల్సిందేనని డిమాండ్‌ చేయడమే ఇక్కడ కనిపిస్తున్న అధిక వ్యయం. స్టార్‌ డమ్‌ చూస్తోన్న కేరెక్టర్‌ యాక్టర్స్‌, కమెడియన్స్‌ ఇప్పటిలా తమ స్టాఫ్‌ ను తీసుకురాకుండా ప్రొడక్షన్‌ కంపెనీ స్టాఫ్‌ తోనే పనిచేయించుకొనేలా చూడాలనీ నిర్మాతలు భావిస్తున్నారు. అలాగయితే ఓ నటుడు/ నటి కోరుకున్న విధంగా అసిస్టెంట్స్‌ ను కంపెనీయే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నారు.ఇక సినిమా విడుదల సమయానికి వస్తే, భారీగా చిత్రాలు నిర్మించి, అదే స్థాయిలో అత్యధిక థియేటర్లలో సినిమాలను విడుదల చేసే నిర్మాతలు శాటిలైట్‌ డయాస్‌ లకు (క్యూబ్స్‌)వారే అద్దె చెల్లిస్తున్నారు. దానిని థియేటర్ల వారే భరించేలా చూసే మార్గం అన్వేషిస్తున్నారు. మరి ఎగ్జిబిటర్స్‌ కు వచ్చే లాభమేంటి? అంటే ? థియేటర్ల వారికి ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్స్‌ దెబ్బ కొడుతున్నాయి. దీనిని అరి కట్టాలంటే కనీసం తాము నిర్మించే సినిమా విడుదలయిన తరువాత పదివారాలకు ఓటీటీలో దర్శనమిచ్చేలా చేస్తామని ఈ గిల్డ్‌ ప్రొడ్యూసర్స్‌ భావిస్తున్నారు. మరి అప్పుడు ఈ నిర్మాతలకు ఓటీటీ ద్వారా వచ్చే మొత్తం సగానికి సగం తగ్గిపోతుంది కదా! ఓటీటీలకు చెక్‌ పెట్టినట్టయితే, థియేటర్లకు ప్రేక్షకులు ఇప్పటి కంటే ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, తద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేయవచ్చునని ఈ నిర్మాతల భావన.ఇలాంటి అంశాలను లోతుగా పరిశీలించిన తరువాతే, యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆగస్టు 1 నుండి తమ షూటింగ్స్‌ జరుపరాదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్స్‌ బంద్‌ అన్నది కేవలం ‘యాక్టివ్‌ తెలుగు ఫిలిమ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌‘ తీసుకున్న నిర్ణయమే కానీ, ఇందులో లేని నిర్మాతలు యథాతథంగా తమ షూటింగ్స్‌ జరుపుకొనే వీలుంది. అయితే ఈ గిల్డ్‌ లోనే రెగ్యులర్‌ గా సినిమాలు తీసే ప్రధాన నిర్మాణ సంస్థల వారున్నారు. కాబట్టి వీరు బంద్‌ అని చెప్పకుండానే సినిమా షూటింగ్స్‌ ఆపు చేస్తున్నామని సెలవియ్యడం టాలీవుడ్‌ లో 90 శాతం షూటింగ్స్‌ బంద్‌ అయినట్టేనని పరిశీలకులు అంటున్నారు.ఈ గిల్డ్‌ లోని నిర్మాతల చిత్రాలలోనే టాప్‌ స్టార్స్‌ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్‌ కళ్యాణ్‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ వంటి నటిస్తున్నారు. జూ.యన్టీఆర్‌, వెంకటేశ్‌ వంటివారు నటించబోయే చిత్రాలు కూడా ఈ గిల్డ్‌ ప్రొడ్యూసర్సే నిర్మించనున్నట్టు తెలుస్తోంది. మరి తమకు ఎంతో విలువనిస్తూ, వారిని ఏ మాత్రం ఒత్తిడి చేయకుండా ఇతర వ్యయంపై దృష్టి పెట్టిన నిర్మాతలకు ఈ స్టార్స్‌ ఏ మేరకు తమ పారితోషికాలను తగ్గించి, సహకరిస్తారో చూడాలని పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు. గిల్డ్‌ ప్రొడ్యూసర్స్‌ తలపెట్టిన ఈ షూటింగ్స్‌ బంద్‌ ఏ మేరకు వారు కోరుకున్న ఫలితాలను అందిస్తుందో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *