గోదావరి జిల్లాల్లో తమ్ముళ్ల పక్కా ప్లాన్‌

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ఉమ్మడి తూర్పుగోదావరి చాలా కీలకం. ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు వచ్చిన వారు అధికారం కైవశం చేసుకుంటారు అనేది ఒక సెంటిమెంట్‌. జిల్లాలో మొత్తం మూడు పార్లమెంటు నియోజకవర్గాలు 19 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ టిడిపి ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. రాజకీయ ఎత్తుగడలతో రెండుచోట్ల పోటీ చేసిన వారు పార్టీ దూరం అయ్యారు. కాకినాడ నుంచి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్‌ వైసీపీ కండువా కప్పేసుకున్నారు. రాజమండ్రి బరిలో నిలిచిన మాగంటి రూప ఆ తర్వాత అడ్రస్‌ లేరన్నది తెలుగు తమ్ముళ్ల మాట. అమలాపురంలో బాలయోగి కుమారుడు హరీష్‌ ఓడిన తర్వాత నియోజకవర్గానికి రావడం లేదట. వచ్చినా అమలాపురం గడప దాటి వెళ్లడం లేదన్నది కేడర్‌ చెప్పేమాట. ఎక్కువగా వైజాగ్‌లోనే ఉంటున్నారట హరీష్‌.రాజమండ్రిలో ఓడిన తర్వాత మాగంటి రూప సైతం ఇటు రాలేదట. ఇటీవల కాలంలో ఆమె మామ మురళీమోహన్‌ చేస్తున్న కామెంట్స్‌తో.. ఆ కుటుంబం క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తుందా లేదో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు. అసలు నాయకులకే లేనప్పుడు మనకెందుకు అని టీడీపీ కేడర్‌ సైతం జెండా పక్కన పడేసింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అభ్యర్థుల బలాబలాలపై చర్చ నడుస్తోంది. అయితే ఈ మూడు లోక్‌సభ అభ్యర్థులపై టీడీపీ సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. చూద్దాం.. చేద్దాం.. అనే మాటలే వినిపిస్తున్నాయట.గత నెలలో జరిగిన టిడిపి రాష్ట్రస్థాయి సమావేశాల్లో జిల్లాకు చెందిన నేతలు అభ్యర్థుల అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. ఇప్పటి నుంచే ఎస్టాబ్లిష్‌ కాకపోతే తర్వాత ఇబ్బందులు వస్తాయని డైరెక్ట్‌గానే చెప్పేశారట. అయితే అభ్యర్థుల ఎంపిక ఆషామాషీ కాదని.. ఆర్ధిక అంగ బలాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బదులిచ్చారట చంద్రబాబు. ఆ సమాధానం రుచించలేదట నాయకులకు. ఎమ్మెల్యేలు.. నియోజకవర్గాల ఇంఛార్జులు.. ఇంకా ఎన్నాళ్లు సాగదీస్తారని ప్రశ్నిస్తున్నారట. అధికార పార్టీ క్లారిటీగా దూసుకుపోతుంటే.. ఇంకా పాత పద్ధతులేంటి అని అసహనం వ్యక్తం చేస్తున్నారట నాయకులు.రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు లోక్‌సభ అభ్యర్థి ప్రభావం కచ్చితంగా తమపై ఉంటుందని నేతలు చెబుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడలో 25 వేలు.. అమలాపురంలో 45 వేలు ఓట్ల తేడాతో టీడీపీ ఓడిపోయింది. అప్పుడు కూడా చివరి వరకు నాన్చడం వల్లే నష్టపోయామన్నది టీడీపీ నేతల చెప్పే మాట. క్లారిటీ లేక క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందనేది వారి అభిప్రాయం. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో పసుపు పార్టీకి ప్రణాళిక లేదనే టాక్‌ నడుస్తుంది. అయ్యవారు వచ్చేలోపు ఉన్నవాళ్లు చేజారే ప్రమాదం ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ ఎపిసోడ్‌ కి టీడీపీ అధిష్ఠానం ఏవిధంగా ఎండ్‌కార్డ్‌ వేస్తుందో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *