ముందస్తు అంత వీజీ కాదు

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. అధికార పార్టీ నుంచి విపక్ష పార్టీల వరకూ తాము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనని చెబుతున్నారు. గుజరాత్‌ ఎన్నికలతో పాటు వెళదామని కేసీఆర్‌ భావిస్తున్నట్లు విపక్షాలు భావిస్తున్నాయి. కానీ కేసీఆర్‌ అంత తేలిగ్గా ముందస్తు ఎన్నికలకు వెళ్లరన్నది ఆయన గురించి తెలిసిన వ్యక్తలు చెప్పే విషయం. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. 2014 ఎన్నికల తర్వాత పరిస్థితులు వేరు. ఇప్పు?డు వేరు.ఎనిమిదేళ్లు పాలన కావడంతో సహజంగానే అధికార పార్టీ పై అసంతృప్తి ఉంటుందన్నది కేసీఆర్‌ కు తెలియంది కాదు. అలాగని తన పాలనపై కంటే ఎమ్మెల్యేలపైనే అసంతృప్తి ఉందన్నది ఆయనకు వివిధ సర్వేల ద్వారా తెలియడంతో ముందు నియోజకవర్గాల్లో బలమైన నేత కోసం అన్వేషిస్తున్నారని చెబుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే తిరుగుబాటు చేయకుండా కొత్త వారికి టిక్కెట్‌ దక్కేలా ఆయన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలి. అందుకు కొంత సమయం పడుతుంది అందుకే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వెళ్లే సాహసం కేసీఆర్‌ చేయకపోవచ్చు. 2018లో అంటే విపక్షాలు రెడీగా లేకుండా చూసి ఏడాది ముందు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించగలిగారు. కానీ ఈసారి విపక్షాలు రెడీగా ఉన్నాయి. అందుకే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఈసారి ఇష్టపడకపోవచ్చు. తనకు ఇంకా సమయం కావాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా తప్పొప్పులను సరిదిద్దుకునేందుకు ఆయన ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. మరోవైపు శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నం చేయవచ్చు. గతంలో అంటే బీజేపీతో కేసీఆర్‌ కు సత్సంబంధాలున్నాయి. కానీ ఈసారి అవి లేవు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నా వివిధ కారణాలతో వాయిదా వేయిస్తే అధికారంలో ఉన్న తాము ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా శాసనసభ రద్దు చేస్తే, అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టి ఎన్నికలను వాయిదా వేసే వెసులుబాటు కేంద్రానికి ఉంది. అందుకే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లడనేది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. నిర్దిష్ట సమయంలోనే ఎన్నికలకు వెళ్లేందుకే కేసీఆర్‌ మొగ్గు చూపుతారన్నది వాస్తవం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *