రామచంద్రాపురంలో ఇంటర్నల్‌ ఫైట్‌

కాకినాడ, అక్టోబరు 3
రామచంద్రపురం టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపొందినా, తెలుగు తమ్ముళ్లు మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. అయితే, సరైన నాయకత్వం లేక టీడీపీ పరిస్థితి దిగాలుగా తయారైంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రమంతా పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నా, ఇక్కడ మాత్రం అనుకున్నంత స్థాయిలో ఉపయోగించుకోలేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. 1994 ఎన్నికల్లో తోట త్రిమూర్తులు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అనంతరం తెలుగు దేశం పార్టీలో చేరారు. అప్పటినుంచి ఆయన పార్టీని అంటిపెట్టుకొని ఉంటూ, పలుమార్లు ఈ పార్టీ తరుపున గెలుపొందారు. ప్రజా రాజ్యం స్థాపించిన తరువాత ఆ పార్టీలో చేరారు. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేశారు. మరలా, 2019 ఎన్నికల్లో త్రిమూర్తులు టీడీపీ సింబల్‌ విూద పోటీ చేసి ఓడిపోయారు. అయితే, వైసీపీ అభ్యర్థి ప్రస్తుత మంత్రి వేణు గోపాల కృష్ణకు బలంగా పోటీ ఇచ్చారు. కేవలం 5 వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీ తీర్దం పుచ్చుకున్నారు. దాంతో ఇక్కడి టీడీపీ కేడర్‌ డీలా పడిపోయింది.సుదీర్ఘ కాలం తరువాత రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని ఇన్‌చార్జిగా టీడీపీ అధిష్టానం నియమించింది. కానీ ఈయన పార్టీ పటిష్టతకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఏవిూ లేవనే విమర్శలు ఉన్నాయి. తాజాగా బీసీ నాయకుడు మేడిశెట్టి శేషారావు పేరు తెరవిూదకు వచ్చింది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గెలుపునకు 2019 ఎన్నికల్లో కృషి చేసిన ఈయన, తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో మంత్రి చెల్లుబోయినతో విభేదించారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు కౌన్సిలర్‌గా కొనసాగుతున్న సతీమణి వెంకటలక్ష్మి కూడా తెలుగు దేశం పార్టీకి దగ్గరయ్యారు. శేషారావు సోదరులు కూడా గతం నుంచి టీడీపీలో మంచి సేవలు అందిస్తున్నారు. మేడిశెట్టి శేషారావు వివాద రహితుడుగా పేరు తెచ్చుకొన్నారు. పార్టీ రహస్యంగా చేసుకొన్న సర్వేలో కూడా ఈయనకు మంచి మార్కులు పడినట్లు తెలుస్తోంది. ఈయన పేరును పార్టీ ముఖ్యనేత అయిన టీడీ జనార్దన్‌ ప్రతిపాదించినట్లు సమాచారం. రేపో మాపో శేషారావును అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ మేరకు పార్టీ అధిష్టానం సమాలోచన చేస్తుందని చెబుతున్నారు. రాబోవు ఎన్నికల్లో ఇక్కడ తెలుగు దేశాన్ని గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు సరైన అభ్యర్థిని త్వరగా నియమించాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *