కాంగ్రెస్‌ లో జోషం…కమలంలో నైరాశ్యం

తెలంగాణ కమలం వికాసం మాట దేవుడెరుగు వాడిపోకుండా చూసుకోవడానికే నానా తంటాలూ పడుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందు వరకూ తెలంగాణ తటాకంలో కమల వికాసం ఖాయమన్న భావన బీజేపీ రాష్ట్ర నాయకులలోనే కాదు. అధిష్ఠానంలో కూడా చాలా చాల గట్టిగా కనిపించేది. అయితే ఆ భావన కానీ, ఆ విశ్వాసం కానీ కర్నాటక ఎన్నికల ఫలితంతోనే మాయమైపోయినట్లుగా కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి చేరిన అగ్రనేతలు, వచ్చినంత వేగంగా వెనక్కివెళ్లిపోవడానికి రెడీ అయిపోతుండటం, కొత్తవారు వచ్చి చేరే అవకాశాలు మృగ్యమైపోవడంతో తెలంగాణలో బీజేపీ పరిస్థితి మధ్యలో వచ్చిన వాపు మధ్యలోనే మాయమైపోయి.. రాష్ట్రంలో ఎక్కడ మొదలయ్యిందో అక్కడే ఉందన్న చందంగా మారింది. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కృతులైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు.. తమ కంటే ముందే పార్టీ నుంచి బహిష్కృతుడై బీజేపీ గూటికి చేరి ఉపఎన్నికలో ఆ పార్టీ నుంచి అభ్యర్థిగా విజయం సాధించి, బీజేపీలో కీలక స్థానంలో ఉన్న ఈటల రాజేందర్‌ దారిలోనే బీజేపీలో చేరుతారని అంతా భావించారు. పొంగులేటి, జూపల్లి కూడా తొలుత కేసీఆర్‌ ను గద్దె దించాలన్న తమ పంతం నెగ్గించుకోవాలంటే కమలం పార్టీయే సరైన ప్రత్యామ్నాయం అని భావించారు. అయితే పరిస్థితులను గమనించి, విశ్లేషించుకుని మనసు మార్చుకుని కాంగ్రెస్‌ పంచన చేరడమే మేలని నిర్ణయించుకున్నారు. అంతే కాదు.. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ గా ఉన్న ఈటలకు సైతం వారు బీజేపీని వదిలి రావడమ మంచిదని సలహా కూడా ఇచ్చారు. ఆ విషయాన్ని ఈటలే స్వయంగా చెప్పారు.జూపల్లి, పొంగులేటి ల విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. వేరే పార్టీల నుంచి బీజేపీ గూటికి చేరిన నాయకులకు ఆ పార్టీలో ఉక్కపోత తప్పడం లేదు. కరుడుగట్టిన హిందుత్వ పార్టీ ముద్ర ఉన్న బీజేపీలో ఇతర పార్టీల నుంచి రాజకీయ అవసరాల కోసం వచ్చి చేరిన వారికి ఊపిరి ఆడే పరిస్థితి ఉండదని ఈటల వంటి వారు ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు కూడా. సరే ఇక తెలంగాణ బీజేపీ విషయానికి వస్తే.. ఓ నాలుగు ఎంపీ సీట్లు, ఉప ఎన్నికలో విజయాలతో ఆ పార్టీ బీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయం అన్న ధీమాను పెంచుకుంది. దక్షిణాదిలో బలం పెంచుకోవడానికి తెలంగాణను గేట్‌ వేగా భావించింది. అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ను ఇరుకున పెట్టేందుకు కేసీఆర్‌ కుటుంబ అవినీతిని తెరవిూదకు తెచ్చింది.ఊరూవాడా ఏకం అయ్యేలా మద్యం కుంభకోణంలో కవిత ప్రమేయంపై సీబీఐ, ఈడీలను మించి దర్యాప్తు చేసేసిన బీజేపీ నేతలు.. కర్నాటక ఫలితం తరువాత ఒక్క సారిగా చప్పబడిపోయారు. మద్యం కుంభకోణం కేసులో కవిత ప్రమేయంపై దర్యాప్తు మందగించిందో, నిలిచిపోయిందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కు కేంద్ర మంత్రుల అప్పాయింట్‌ మెంట్‌ లు అడిగీ అడగగానే దొరికేస్తున్నాయ్‌. తెలంగాణ కాంగ్రెస్‌ ముక్త లక్ష్యం కోసం బీఆర్‌ఎస్‌ ఉద్దేశ పూర్వకంగా బీజేపీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో ఎదిగేందుకు దోహదపడిరదన్న గత విమర్శలు ఇప్పుడు మళ్లీ తెరవిూదకు వస్తున్నాయి.అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయంతో ఇంత కాలం ఆ పార్టీ రాష్ట్రంలో సోదిలోకి కూడా లేదంటూ విమర్శలు గుప్పించి.. తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీయే అన్న బీఆర్‌ఎస్‌ అధినేత ఇప్పుడు బీజేపీ ఊసే ఎత్తడం లేదు. కాంగ్రెస్‌ పుంజుకుంటే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఖాళీ అన్న భయం, ఆందోళన ఇప్పడు బీఆర్‌ఎస్‌ లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *