అందుకే 75% హాజరు తప్పనిసరి చేశాం: సీఎం జగన్

శ్రీకాకుళం: సమాజం, దేశం, మనిషి తలరాత మార్చే శక్తి చదువుకే ఉందని సీఎం జగన్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ‘జగనన్న అమ్మఒడి’ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. చదువే నిజమైన ఆస్తి అని గ్రహించాలన్నారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి బతికే శక్తి చదువుకే ఉందని జగన్ తెలిపారు.

‘‘ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు చదువు అందాలన్నదే నా తపన. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. మంచి చదువు హక్కుగా అందించాలన్నదే లక్ష్యం. ‘జగనన్న అమ్మఒడి’ అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. పిల్లలను బడికి పంపిస్తున్న ప్రతి పేద తల్లి ఖాతాలో జమ చేస్తున్నాం. దాదాపు 80 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తున్నాం. 40లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు జమ చేస్తున్నాం.

కేవలం జగనన్న అమ్మఒడి కింద ఇప్పటి వరకు రూ.19,618 కోట్లు జమ చేశాం. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువు మధ్యలో ఆపకూడదు. బాగా చదవాలనే కనీసం 75శాతం హాజరు తప్పనిసరి చేశాం. పాఠశాలలు, టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ కింద కాసింత సొమ్ము వసూలు చేస్తున్నాం. రూ.2 వేలు వసూలు చేస్తుంటే కొంతమంది విమర్శిస్తున్నారు’’ అని జగన్‌ అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *