కడపలో పట్టాలెక్కని పరిశ్రమలు

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తుందనే ఆశలు కల్పించింది విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌. ఇందులో ఒప్పందాలు కడప జిల్లాకు అనేక పరిశ్రమలను పరుగులు పెట్టించనున్నాయనే భ్రమలు కల్పించాయి. అయితే ఒప్పందాలు జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కడప జిల్లాకు వచ్చే పరిశ్రమలు ఏమిటి? ఏయే రకాల పరిశ్రమలు వస్తున్నాయి. ఏ పరిశ్రమ ఎంత పెట్టుబడితో రానుంది ? వీటికి ఎంత భూమి కావాలి ? ఇలాంటి ఏ సమాచారం ఇప్పటి వరకు జిల్లా కేంద్రానికే అందకపోవడంతో ఈ ఒప్పందాల సంగతేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మార్చి మూడో తేదీన విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటైన ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లో 21 పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రూ.1500 కోట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ సీఈవో గౌతమి అప్పట్లో వెల్లడిరచారు. ఈ పరిశ్రమల ద్వారా 5400 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. దీంతో జిల్లా వాసులు పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయని, యువత ఉపాధికి ఊతం దొరుకుతుందని సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఇప్పటికే పలు సెల్‌ కంపెనీలు, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలు కొన్ని ఏర్పాటవుతున్నాయి. 6700 ఎకరాల్లో ఏర్పాటైన ఈ మెగా ఇడస్ట్రియల్‌ పార్క్‌ లో రెండు ఎలక్ట్రానిక్‌ మ్యాను ఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ ఉన్నాయి. వీటిలో ఏర్పాటు చేసేందుకు విశాఖ సమ్మిట్‌ లో పారిశ్రామిక వేత్తలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.ఒప్పందం ప్రకారం 21 పరిశ్రమలు ఏర్పాటైతే కొప్పర్తి పారిశ్రామిక వాడకు నిండుదనం రావడంతోపాటు రాష్ట్రంలోనే ఎలక్ట్రానిక్‌ వెలుగులకు కడప జిల్లా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుందని ఆశించారు. అందునా ఈ సమ్మిట్‌ కు దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ దేశాల రాయబారులు, వారి ప్రతినిధులు హాజరయ్యారు. దీంతో అప్పట్లో ఈ సమ్మిట్‌ భారీ సక్సెస్‌ అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవ్వడంతోపాటు ప్రభుత్వం కూడా సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలాంటి వాతావరణంలో కడప జిల్లాకు 21 పరిశ్రమలు వస్తాయని ప్రకటించడం జిల్లా వాసుల్లో ఆనందాన్ని నింపింది. అయితే నెల రోజులు గడిచినా ఇప్పటికీ స్థితి గతులపై స్పష్టత రాలేదు. దీంతో ఈ పరిశ్రమలు ఏర్పాటు నిజమవుతుందా! కలగా మిగులుతుందా? అన్న సందేహాలకు తావునిస్తోందిగత ప్రభుత్వంలో కూడా పరిశ్రమల ఏర్పాటు కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సమ్మిట్‌ నిర్వహించారు. ఈ సమ్మిట్‌ లో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఆయా పరిశ్రమల జాబితా, వాటికి అవసరమైన స్థలాలు, మౌలిక సదుపాయాలపై జిల్లాల్లోని ఏపీఐఐసీ కార్యాలయాలకు సమాచారం పంపారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. పరిశ్రమల స్థాపన ఇప్పటికిప్పుడు చేపట్టలేకపోయినా కనీసం అందుకు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *