తుంగతుర్తి ఛైర్మన్‌ పదవి కోసం పోటీ

నియోజకవర్గంలోని తుంగతుర్తి, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి కోసం ఆశావాదుల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఆ పదవి దక్కించుకోవాలంటే స్థానిక శాసన సభ్యులు డాక్టర్‌ గాదరి కిషోర్‌ కుమార్‌ ఆశీస్సులు ఉండాలి. అయితే ఇప్పటికే చైర్మన్‌ పదవిని ఆశిస్తున్న వారిలో కొంతమంది ఎవరికివారే ప్రత్యేకంగా ఎమ్మెల్యేను కలుస్తూ ఆశీస్సులు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఆయా మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యేను కలుస్తూ వారి ద్వారా చెప్పిస్తున్నారు. ఇప్పటికే తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పదవి కాలం పూర్తికాగా తుంగతుర్తి మాత్రం వచ్చే నెలతో (సెప్టెంబర్‌) ముగియనుంది. అయితే రిజర్వేషన్లలో భాగంగా ఈసారి తుంగతుర్తి, ఎస్టీకి, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ జనరల్‌ మహిళకు కేటాయించబడ్డాయి.నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్‌ జులై 25,1993లో ఏర్పాటయింది. ఆనాడు దీని పరిధిలో ఉమ్మడి నూతనకల్‌, తుంగతుర్తి, అర్వపల్లి, తిరుమలగిరి మండలాలు ఉండేవి. అనంతరం 2018 అక్టోబర్‌ మాసంలో తుంగతుర్తి నుండి తిరుమలగిరి ప్రత్యేకంగా విడిపోయి గ్రేడ్‌`3 క్యాడర్‌ తో వ్యవసాయ మార్కెట్‌ గా ఏర్పడిరది. నో ట్రేడిరగ్‌, నో పర్చేస్‌ పరిధిలో తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్‌ కొత్త మండలాలైన నూతనకల్‌, మద్దిరాల, తుంగతుర్తితో ఏర్పడిరది. ఇక తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి మండలాలు చేరాయి.ఇదిలా ఉంటే సెప్టెంబర్‌ 6, 2020లో తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నామినేటెడ్‌ పద్ధతిలో ఏర్పాటయింది. ఈ మేరకు తొలి చైర్మన్‌ గా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామం బీసీ వర్గానికి (గౌడ) చెందిన పులుసు యాదగిరి స్థానిక శాసనసభ్యులు డాక్టర్‌ గాదరి కిషోర్‌ కుమార్‌ సహకారంతో ఏడాది కాల వ్యవధి లెక్కన నియమితులయ్యారు. అనంతరం గడువు పూర్తయ్యాక మార్చి, 2021లో మరో ఆరు మాసాలు, అనంతరం సెప్టెంబర్‌ లో మరో ఆరు మాసాలు రెండు దఫాలుగా ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. చివరికి వచ్చే నెల (సెప్టెంబర్‌) 6వ తేదీతో ఆయన పదవీ కాలం పూర్తి కానుంది. ముఖ్యంగా గతంలో 12 మంది డైరెక్టర్లతో కమిటీ ఏర్పడగా కొత్తగా విడుదలైన జీఓ ప్రకారం కొత్తగా ఏర్పడే కమిటీలో వీరి సంఖ్య 18కి చేరింది.ఇదిలా ఉంటే రిజర్వేషన్‌ లలో భాగంగా ఎస్టీ కోటాలోకి వెళ్లిన తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని పొందడానికి నూతనకల్‌, మద్దిరాల, తుంగతుర్తి మండలాలకు చెందిన గిరిజనులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీలోని కొందరు గిరిజన నేతలు స్థానిక శాసనసభ్యులు డాక్టర్‌ గాదరి కిషోర్‌ కుమార్‌ ఆశీస్సులు పొందడానికి ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలతోపాటు వారి జనాభా సంఖ్య మూడు మండలాలతో పోలిస్తే తుంగతుర్తి పరిధిలోనే ఎక్కువగా ఉంది.తుంగతుర్తి మండలంలో మొత్తంగా 37 గిరిజన తండాలు ఉండగా ఇందులో ప్రత్యేకంగా 11 గ్రామ పంచాయతీలు గిరిజనులవే కావడం విశేషం. ఇక మద్దిరాల మండలంలో కేవలం మూడు తండాలు ఉండగా ఇందులో రెండు గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. అలాగే నూతనకల్‌ మండలంలో మొత్తంగా 9 గిరిజన తండాలు ఉండగా ఇందులో 4 గ్రామ పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. ఇక పోటీదారుల విషయానికి వస్తే నూతనకల్‌ మండలం నుండి సురేందర్‌ నాయక్‌, నర్సింగ్‌ నాయక్‌ లు పోటాపోటీగా ఉన్నారు. తుంగతుర్తి నుండి దీప్లా నాయక్‌ తోపాటు మరికొందరు రేసులో ఉండి ఎమ్మెల్యే కిషోర్‌ కుమార్‌ ఆశీస్సులు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పటికే మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి తుంగతుర్తికి కేటాయించగా కొత్తగా ఏర్పడే కమిటీకి నూతనకల్‌ కు స్థానం ఇవ్వాలనే ఆలోచనతో ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ తుంగతుర్తికి చెందిన దీప్లా నాయక్‌ తోపాటు ఒకరిద్దరు తుంగతుర్తికే కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. అన్ని రకాలుగా లెక్కలు వేస్తే తండాలు, గ్రామ పంచాయతీలతోపాటు గిరిజనుల సంఖ్య తుంగతుర్తి మండలంలోని ఎక్కువగా ఉందనే లెక్కలు కూడా వివరిస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే తీసుకునే నిర్ణయమే ఫైనల్‌ కానుంది. ఇక జనరల్‌ మహిళ కోటాలోకి వెళ్ళిన తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విషయానికి వస్తే దీని పరిధిలో ఉన్న అర్వపల్లి, నాగారం మండలాలకు చెందిన ఒకరిద్దరు నేతలు దాన్ని దక్కించుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. తిరుమలగిరి మండల కేంద్రానికే చైర్మన్‌ పదవి ఇవ్వాలని కొందరు నేతలు ప్రత్యేకంగా ఎమ్మెల్యే కిషోర్‌ ను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *