ఇద్దరూ… ఇద్దరే…

విజయవాడ, జూన్‌ 27 : చంద్రబాబు నాయుడు, జగన్మోహన్‌ రెడ్డి ఇద్దరికీ పోలిక పెడితే? కొన్ని విషయాల్లో ఇద్దరి మధ్య సారూప్యత కనిపిస్తుంది.ఇద్దరి పొలిటికల్‌ ఎంట్రీ కాంగ్రెస్‌ పార్టీలోనే జరిగింది. బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఇద్దరు నేతలు రాష్ట్రాన్ని పాలించే హక్కు తమకే ఉందని బలంగా నమ్ముతారు. నాలుగున్నర దశాబ్దాలకు మించిన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, అటుఇటుగా అంతే వయసున్న జగన్మోహన్‌ రెడ్డి ఏపీ రాజకీయాల్లో తలపడుతున్నారు.రెండు దఫాలుగా పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఇప్పుడు మరో మారు అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నారు.ఇటు జగన్మోహన్‌ రెడ్డి పంతం కొద్ది ఆ పదవిని పోరాడి దక్కించుకున్నారు. ఇద్దరి రాజకీయ ప్రస్థానం భిన్నమైనది. చంద్రబాబు మార్క్‌ రాజకీయాలకు, జగన్‌ శైలికి ఏ మాత్రం సారూప్యత ఉండదు. కాకపోతే ఇద్దరు తమను తాము రాష్ట్రాన్ని పాలించే అర్హత తమకు మాత్రమే ఉందని ఖచ్చితంగా భావిస్తారు. ఏపీలో సుదీర్ఘకాలంగా అధికార పంపిణీ రెండు కులాల మాత్రమే జరుగుతోంది. మరి కొన్నాళ్ల పాటు ఇదే వైఖరి కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జనం కూడా చెరో వర్గం వైపు చీలిపోవడంతో ఇప్పట్లో మూడో ప్రత్యామ్నయం ఎదగడం కూడా అనుమానమే.నాలుగేళ్లకు పైగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్మోహన్‌ రెడ్డి మరో ముప్పై ఏళ్లు అదే పదవిలో ఉండాలనే లక్ష్యంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రతిపక్షం అనేది లేకుండా 175 నియోజక వర్గాల్లో గెలవాలని తమ పార్టీ నేతలకు చెబుతున్నారు.జగన్మోహన్‌ రెడ్డి నిర్దేశించుకున్న వై నాట్‌ 175 లక్ష్యం ఆచరణలో ఎంతవరకు సాధ్యం అన్నది పక్కన పెడితే చంద్రబాబు, జగన్మోహన్‌ రెడ్డి పాలనలను పోల్చి చూడాల్సిన అవసరం అయితే ఏపీ ప్రజానీకానికి ఏర్పడిరది. ఇద్దరిలో ఎవరు బెటర్‌ అని ఎంచుకోవాల్సిన అవసరం రానున్న ఎన్నికల్లో తప్పనిసరి కానుంది.ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చాలా కాలంగా రెండు కులాలు, రెండు పార్టీలు, రెండు పార్టీల మధ్య చాలా కాలం క్రితమే చిక్కుకుంది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో చాలా కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి ఆధిపత్యం దక్కితే, 82లో ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన తర్వాత అది కమ్మ వర్గం వశమైంది.ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత కూడా ఆ ధోరణి కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అధికారం రెండు కులాలు, కుటుంబాలు, పార్టీల మధ్య పోరాటంగానే చూడాల్సి ఉంటుంది. ఇందులో మిగిలిన పక్షాలను ఆటలో పాత్రధారులుగా మాత్రమే పరిమితం అయ్యారు.2019లో ఏపీలో వైఎస్సార్సీపీకి తిరుగులేని మెజార్టీ దక్కడంతో ముఖ?యమంత్రి కావాలన్న జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యం నెరవేరింది. 2009లో యాథృచ్చికంగానో, ప్రేరేపితంగానో రేగిన ఆలోచన నెరవేరడానికి జగన్‌కు పదేళ్ల సమయం పట్టింది. ఈ క్రమంలో ఏపీ రాజకీయం ఎన్నో మలుపులు తిరిగింది. జగన్మోహన్‌ రెడ్డి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టుకుని పోరాడాల్సి వచ్చింది. 2014ఎన్నికల్లో అవకాశం దక్కకపోయినా 2019లో తన లక్ష్యాన్ని జగన్‌ చేరుకోగలిగాడు.జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తర్వాత ప్రజలు ఎప్పటికీ తనకు రుణపడిపోయేలా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రారంభించారు.ఆర్దిక ఇబ్బందులు, నిధుల సవిూకరణ వంటి విషయాల్లో ఇబ్బందులు ఎదువరతున్నా, రాష్ట్రం దివాళా తీస్తుందనే విమర్శలు వచ్చినా ఖాతరు చేయకుండా వాటిని కొనసాగిస్తున్నారు.నాలుగేళ్లలో దాదాపు రెండులక్షల కోట్ల రుపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమాలకు ద్వారా ప్రజలకు పంపిణీ చేశామని పదేపదే చెబుతున్నారు. పొరపాటున ప్రత్యర్థులకు అవకాశమిస్తే ఇప్పుడు ఉన్న పథకాలన్నీ రద్దైపోతాయని చెబుతున్నారు. దీంతో రాజకీయ ప్రత్యర్థులు కూడా దానిపై వివరణ ఇచ్చుకోవాల్సిన అనివార్యత సృష్టించారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకునే పార్టీ మరింత మెరుగ్గా ప్రజలకు తాయిలాలను ఎర వేయాల్సిన పరిస్థితిని జగన్‌ సృష్టించారు.2004కు ముందు అధికారంలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఓ విమర్శ ఉండేది. తనను తాను రాజకీయ నాయకుడు అనిపించుకోవడాని కంటే పాలనా సామర్థ్యం ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందడానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్టీఆర్‌ నుంచి అధికారాన్నిహస్తగతం చేసుకున్నతర్వాత చంద్రబాబు తనపై పడిన ముద్రను చెరిపేసుకోడానికి చేయని ప్రయత్నం లేదు.ఈ క్రమంలోనే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సీఈఓగా తనను తాను అభివర్ణించుకున్నారు. హైటెక్‌ సిఎంగా, కార్పొరేట్‌ స్టైల్‌లో బాబు పాలన సాగింది. తొలి విడత అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో ఆయన వ్యవహార శైలి కూడా అలాగే సాగింది. విజన్‌ 2020 ప్రచారాలు హోరెత్తేవి. ఈ క్రమంలోనే చంద్రబాబుకు దేశ వ్యాప్త గుర్తింపు కూడా వచ్చింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *