అంతర్మధనంలో వైసీపీ శ్రేణులు

వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేలపై గుర్రుగా ఉన్నారు. తమను పట్టించుకోవడం లేదన్న బాధలో చాలా మంది ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం ప్రాణాలు తెగించి పోరాడిన కార్యకర్తలను సయితం ప్రస్తుత ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. అధినాయకత్వంతో తమ బాధ చెప్పుకునే పరిస్థితి లేదు. తాడేపల్లి కార్యాలయానికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. కానీ మరో రెండు రోజుల్లో మంచి అవకాశం లభిస్తుంది. నియోజకవర్గం నుంచి యాబై మంది కార్యకర్తలతో వైసీపీ అధినేత జగన్‌ సమావేశం అవుతున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి సమావేశాలు జరగనున్నాయి. వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను వ్యతిరేకించే వారుంటే స్థానిక ఎమ్మెల్యేలకు ఇబ్బంది తప్పదు. అయితే నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల ఎంపిక ఎవరు చేస్తారన్న దానిపైనే ఇప్పుడు ఆసక్తి నెలకొంది. నియోజకవర్గాల్లో ముఖ్యమైన కార్యకర్తలు కొందరు ఎమ్మెల్యేలకు దూరంగా ఉన్నారు. వారిని సమావేశానికి పిలవకుంటే నియోజకవర్గంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు జగన్‌ కు తెలియవు. అలాగని ఎమ్మెల్యేలను కాదని ఎవరు ఎంపిక చేస్తారన్నదే ఇప్పుడు సమస్య. కొన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్య కార్యకర్తలను ఎంపిక చేయడానికి ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తున్న వారు సయితం ఇప్పుడు ప్రయత్నిస్తున్నారని తెలిసింది ప్రధానంగా పార్లమెంటు సభ్యులు కొందరు జోక్యం చేసుకుని తమ వర్గానికి చెందిన ముఖ్య కార్యకర్తలను జగన్‌ తో జరిగే సమావేశానికి ఎంపిక చేయాలని వత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. చాలా చోట్ల పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు మధ్య పొసగడం లేదు. ఎంపీలు లేకుండానే కార్యక్రమాలను కూడా నిర్వహించే వారు కొందరైతే, ఎంపీలు తమ నిధులతో జరిపే కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉండటం చాలా చోట్ల చూస్తున్నాం. అయితే నియోజకవర్గాలలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు జగన్‌ కు తెలుస్తాయా? లేదా? అన్నదే ఇప్పడు పార్టీలో హాట్‌ టాపిక్‌. ఎమ్మెల్యేల కారణంగా నియోజకవర్గంలో తలెత్తుతున్న ఇబ్బందులను వివరిస్తే కొంత వరకైనా దిద్దుబాటు చేసుకోవడానికి అవకాశముందటుంది. అలాకాకుండా వచ్చే ఎన్నికలకు సిద్ధమవ్వాలని, రొమ్ము చించుకుని పనిచేయండి అని జగన్‌ చెప్పి పంపితే మాత్రం ఈ సమావేశాలు నిరుపయోగంగానే నిలిచిపోతాయి. పార్టీ ప్రస్తుతమున్న పరిస్థితిలో ఏమాత్రం మార్పు ఉండదని సీనియర్‌ నేతలు సయితం అభిప్రాయపడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *