జిల్లాలు చుట్టేస్తున్న ప్రతిపక్షాలు….

విజయవాడ, ఆగస్టు 18
ఏపీలో ప్రతిపక్ష నేతలు నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఇక్కడా అక్కడా అని లేకుండా వరసపెట్టి యాత్రలు చేపడుతూ దూసుకెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఏపీలో ఉన్న జిల్లాలను అన్నీ ఒకటికి పదిమార్లు కలియతిరిగే పని పెట్టుకొని ఇప్పటికే కొన్ని జిల్లాలను పూర్తి చేశారు. వెళ్ళిన ప్రతీ చోటా జనాల స్పందన కూడా విపక్ష నేతలకు బ్రహ్మరథం పడుతున్నట్లుగానే ఉంది. ఎక్కడిక్కడ ఘన స్వాగతాలు లభిస్తున్నాయి. ఒకవైపు తెలుగుదేశం జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో భాగంగా గత కొన్ని నెలలుగా ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఎన్నికల వరకూ కూడా లోకేష్‌ ప్రజలలోనే ఉంటారు. చంద్రబాబు కూడా రాయలసీమ నుండి గోదావరి జిల్లాల వరకూ ఒక రౌండ్‌ వేసి.. ఈ మధ్యనే విశాఖలో కూడా కదలిక తెచ్చి వెళ్లారు. చంద్రబాబు కూడా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలలోనే మమేకమౌతూ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా విడతల వారీగా వారాహి యాత్రతో జనంలో తిరుగుతున్నారు. పవన్‌ కూడా ఎన్నికల వరకూ ఇలాగే ఏదో ఒక పేరుతో రాష్ట్ర నలుమూలలను టచ్‌ చేయనున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నది. అయితే, జనసేనతో ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ ఆ పొత్తును ఎన్నికల వరకూ కొనసాగిస్తుందా? టీడీపీతో కూడా కలుస్తుందా అన్న సస్పెన్స్‌ ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఈ ఒక్కటీ క్లారిటీ వస్తే ఏపీలో ఎటు చూసినా ప్రతిపక్ష నేతల సందడే కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్నది దండయాత్రగా భావిస్తే.. పొత్తులు క్లారిటీ అనంతరం ఇక యుద్ధమే అని చెప్పక తప్పదు. పొత్తులు ఉన్నా లేక విడివిడిగా పోటీకి దిగినా ప్రచారం మాత్రం ఓ స్థాయిలో హోరెత్తుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.ఎన్నికలకు ఎనిమిది తొమ్మిది నెలలే ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దండయాత్ర మొదలు పెట్టాయి. తలా ఒకవైపు ప్రతిపక్ష నేతలు ఇంతగా విమర్శలకు దిగినా.. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నా, సీఎంగా జగన్‌ చేతగాని తనాన్ని ఎత్తి చూపుతున్నా అధికార పార్టీ నుండి ఉలుకూ పలుకూ ఉండడం లేదు. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా మొదటి నాలుగేళ్ళూ ఎలా ఉన్నా చివరి ఏడాది మాత్రం ఏదో ఒకటి చేసి ప్రజలను ఆకర్షించి ఓట్లు తెచ్చుకోవాలని చూస్తుంది. ఇందుకోసం ఉరుకులు పరుగులు పెడుతుంది. ఎక్కడ లేని దూకుడూ ప్రదర్శిస్తుంది. ఇప్పుడు తెలంగాణ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు.. ఆ కార్యక్రమాల పేరుతో సభలు, సమావేశాలతో నిత్యం ప్రజలతో అక్కడి అధికార పార్టీ నేతలు మమేకమౌతున్నారు. ఎప్పుడో కానీ ఫామ్‌ హౌస్‌ దాటిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా జనంలోనే తిరుగుతున్నారు. కానీ ఏపీలో అధికారంలో ఉన్న జగన్‌ పార్టీలో అటువంటి హడావుడి ఇసుమంతైనా కనిపించడం లేదు. అడపాదడపా సీఎం జగన్‌ బటన్‌ నొక్కుడు కార్యక్రమాలకు వెళ్లి అక్కడే ఎవరో రాసిచ్చిన నాలుగు ముక్కలు మాట్లాడేసి వస్తున్నారు. అయితే, ముందు బటన్‌ నొక్కిన కార్యక్రమాలకే డబ్బులు లేక కొత్త పథకాలు ప్రకటించే అవకాశం లేదు. కనుక సీఎం బయటకి రావడం అంటే ఏదో అమావాస్యకి పౌర్ణమికి మాత్రమే సాధ్యం. ఇక మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అంతే. మొన్నటి వరకూ పార్టీని, సీఎంను ఎవరు ఏమన్నా నోరేసుకొని పడిపోయే నేతలంతా ఇప్పుడు మైకుల ముందుకు రావడం మానేశారు. ప్రతిపక్షం ఒక్కో అంశాన్ని గుచ్చి గుచి ప్రశ్నించినా కనీసం ఆ శాఖల మంత్రి కూడా ముందుకొచ్చి సమాధానం చెప్పడం లేదు.గతంలో కూడా మంత్రులు తమ శాఖల గురించి మాట్లాడిన సందర్భాలు అతి స్వల్పమే. అన్నిటికీ ఒకటే మందు జింతా తిలిస్మాత్‌ అన్నట్లు అన్ని శాఖలకూ ఒకే మంత్రి అన్న చందంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మాట్లడతారు. ఆయన కూడా ఇటీవలి కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి, వివిధ శాఖలలో సాధించిన ప్రగతి గురించి కాకుండా.. విపక్షాలపై విమర్శలు, విసుర్లు, అనధికారికంగా అభ్యర్థుల ప్రకటనలకు మాత్రమే విూడియా ముందుకు వస్తున్నారు. విపక్షాలు నిలదీసిన అంశాలపై మాట్లాడాల్సిన అవసరమే లేదన్నట్లు వైసీపీ నేతలు, మంత్రులు, చివరాఖరికి సీఎం జగన్‌ కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో సహజంగానే వైసీపీ ఎందుకిలా అనే చర్చమొదలైంది. నిజానికి ఎప్పుడో రెండేళ్ల కిందటే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రంలో పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేకతపై సీఎం జగన్‌ వద్ద ప్రస్తావించే సాహసం చేశారు. అయితే ఆయన వినడం మానేసి నాకన్నీ తెలుసు విూరు పనిచేసుకుంటూ వెళ్ళండి ఓట్లు అవే వస్తాయని ఆదేశించారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ప్రజా వ్యతిరేకత గురించి సొంత పార్టీ నేతల మాటలను కూడా పెడచెవిన పెట్టిన ఫలితం ఇప్పుడు పార్టీ అనుభవించాల్సి వస్తోందని వైసీపీ నేతలు అంతర్గత సమావేశాలలో ఒకరికొకరు చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత గొంతు చించుకుంటే ప్రజలలో ఇంకా చులకన అవడం తప్ప ప్రయోజనం లేదని, పార్టీ అధిష్టానం కూడా ఈ విషయాన్ని గ్రహించే ప్రతిపక్షాలను ఎదుర్కోవాలనే ఆదేశాలివ్వడం లేదని పార్టీ నేతల మధ్య సంభాషణ సాగుతోంది. మొత్తంగా
ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో వైసీపీ హ్యాండ్సప్‌ చెప్పినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *