సంగారెడ్డిలో డాక్టర్ల కుర్చీలాట

జిల్లాస్థాయి పోస్టులంటే రాజకీయ ప్రమేయం లేకుండా జరగవు. మనవాళ్లు అనేవాళ్లను తీసుకొచ్చి కూర్చీలో కూర్చోబెట్టుకోవడం కామన్‌. సంగారెడ్డి డీఎంహెచ్‌ వో పోస్ట్‌ కూడా ఈ జాబితాలోకే చేరింది. కరోనా పగడ విప్పిన సమయంలో డీఎంహెచ్‌ వో పోస్ట్‌ చాలా కీలకం. అలాంటిది మార్చి నెల నుంచీ ఈ పోస్ట్‌ కోసం కుర్చీలాట ఓ రేంజ్‌లో సాగుతోంది. రాజకీయ ఒత్తిళ్లో.. పనిభారమో తెలియదు కానీ.. ఇంఛార్జ్‌గా వచ్చిన అధికారులు పట్టుమని పదిరోజులు ఉండలేని పరిస్థితి. మాతా శిశు సంరక్షణ కేంద్రం ఖూగా ఉన్న గాయత్రీదేవిని ఇంఛార్జ్‌గా మార్చి 30న వేశారు. ఆ తర్వాత నాలుగు రోజులకే మెదక్‌ టీబీ ఆఫీసర్‌ లక్ష్మణ్‌సింగ్‌కు డీఎంహెచ్‌ వోగా పోస్టింగ్‌ ఇచ్చారు. సమస్య పరిష్కారమైందని సంబరపడుతున్న సమయంలో అసలు కథ మొదలైంది. నాలుగు నెలలుగా కుర్చీలాట రసరత్తరంగా జరుగుతోంది.డీఎంహెచ్‌వోగా వచ్చిన లక్ష్మణ్‌సింగ్‌కు ఛార్జ్‌ ఇవ్వడానికి గాయత్రీదేవి నిరాకరిస్తున్నారట. ఆమె వెనక కలెక్టర్‌తోపాటు ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తానే డీఎంహెచ్‌వోగా ఉండేందుకే గాయత్రీదేవి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారట. లక్ష్మణ్‌సింగ్‌ ఛార్జ్‌ తీసుకోవడానికి నాలుగు నెలలుగా రోజూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. రోజూ ఆఫీస్‌ వస్తున్నారు.. రిజిస్టర్‌లో సంతకాలు పెడుతున్నారు.. సాయంత్రం వెళ్లిపోతున్నారు. డీఎంహెచ్‌ వో కుర్చీలో కూర్చోకుండా.. వేర్వేరు ఛాంబర్లు ఏర్పాటు చేసుకుని పాలన సాగిస్తున్నారు. ఎవరి మాట వినాలో ఆఫీస్‌ సిబ్బందికి అర్థం కాని పరిస్థితి.ప్రభుత్వంలోని పెద్దల ఆశీసులు ఉండటంతో అధికారిక కార్యక్రమాలకు డీఎంహెచ్‌ వో హోదాలో గాయత్రిదేవికే ఆహ్వానాలు పంపుతున్నారట. అయితే లక్ష్మణ్‌సింగ్‌కు వైద్య ఆరోగ్యశాఖలో పెద్దల మద్దతు ఉందట. దీంతో ఆయనా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. గత నెల 15న లక్ష్మణ్‌సింగ్‌ను నారాయణపేట ఇంచార్జ్‌ డీఎంహెచ్‌ వోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్కడికి వెళ్లేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. ప్రస్తుతం ఒకరికొకరు ఎదురుపడటం లేదు. లక్ష్మణ్‌సింగ్‌కు ఎక్కడ ఛార్జ్‌ అప్పగించాలో అని మొదట్లో గాయాత్రీదేవి ఆఫీస్‌కు రాలేదట. ఫైల్స్‌ అన్నీ ఇంటిదగ్గరే చూసేవారట. ఇప్పుడు ఇద్దరూ ఆఫీస్‌కు వస్తున్నా.. వేర్వేరు ఛాంబర్లో ఉంటూ కాలం గడిపేస్తున్నారు. మొత్తానికి రాజకీయ ఒత్తిళ్లు.. ఉన్నతాధికారుల పంతాలు.. సంగారెడ్డి డీఎంహెచ్‌ వో పోస్ట్‌ను కీచులాటగా మార్చేశాయి. ఒక కుర్చీ ఇద్దరు అధికారులు అన్నట్టుగా మారిపోయింది. ఈ విషయం తెలిసినా.. జిల్లాలోని మంత్రులు.. ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటం ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *