చక్రం తిప్పిన సునీల్‌ కనుగోలు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 4
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ విజయం వెనుక స్ట్రాటజిస్ట్‌ సునీల్‌ కనుగోలు పాత్ర చాలా ఎక్కువ. స్ట్రాటజిస్టుగా సునీల్‌ కనుగోలు..బాధ్యతలు తీసుకున్న తర్వాత కర్ణాటకలో గెలిపించారు. ఆ తర్వాత తెలంగాణ బాధ్యతలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రజా నాడి పడుతూ.. గెలుపు గుర్రాలైన అభ్యర్థులను ఎంపిక చేయడం దగ్గర నుంచి ప్రచార వ్యూహాలను క్రియేటివ్‌ గా చేయడం వరకూ మొత్తం సునీల్‌ కనుగోలు చూసుకున్నారు. సోషల్‌ విూడియాలో వచ్చిన ప్రకటనలు.. దినపత్రికల్లో వచ్చిన ప్రకటనలు ఎంతో క్రియేటివ్‌ గా ఉన్నాయని చూసిన వారంతా మెచ్చుకున్నారు. అవన్నీ నిజాలేనని ఒక్కటీ అబద్దం లేదని కాంగ్రెస్‌ గట్టిగా ప్రచారం చేయగలిగింది. తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం వెనుక రేవంత్‌ సహా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కష్టపడి పనిచేయడంతో పాటు సునీల్‌ వ్యూహాలూ కలిసొచ్చాయని ప్రత్యేకంగా చెప్పాల్సినపని లేదు. సునీల్‌ కనుగోలు ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఎలక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఈయన బళ్ళారిలో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. చెన్నైలో చదువుకున్నారు. అమెరికాలో ఏంబీఏ చేశారు. అక్కడే ఓ కన్సల్టెన్సీ సంస్థలో పనిచేశారు. అసోసియేషన్‌ ఆఫ్‌ బ్రిలియంట్‌ మైండ్స్‌ (ఏబీఎం) కు సహవ్యవస్థాపకుడిగా సునీల్‌ కనుగోలు రాజకీయ వ్యూహకర్త ప్రయాణం మొదలుపెట్టారు.ఈ సంస్థ భారతీయ జనతా పార్టీ కోసం ఎన్నికల వ్యూహాలు రూపొందించింది. 2014లో నరేంద్రమోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడానికి ప్రశాంత్‌ కిషోర్‌ తీసుకువచ్చిన సిటిజెన్స్‌ ఫర్‌ అకౌంటబుల్‌ గవర్ననెన్స్‌ లో సునీల్‌ భాగస్వామిగా ఉన్నారు. తర్వాత ప్రశాంత్‌ కిషోర్‌ తో విడిపోయి సొంత కన్సల్టెన్సీని పెట్టుకున్నారు. 2022లో కాంగ్రెస్‌ పార్టీ కీలక ఎన్నికల వ్యూహకర్తగా నియమితులయ్యాక సోనియాగాంధీ ఈయనను 2024 లోక్‌సభ పోల్స్‌ టాస్క్‌ ఫోర్స్‌ సభ్యునిగా నియమించారు.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు వెనుక సునీల్‌ కనుగోలు విభిన్నమైన ఆలోచనలు, చక్కని ఇన్‌ పుట్స్‌ ఉన్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బొమ్మైపై 40 శాతం కవిూషన్‌ తీసుకుంటున్నారంటూ కర్ణాటక కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ చేసిన ఆరోపణలను కాంగ్రెస్‌ ప్రచారాస్త్రంగా మార్చడంలో సునీల్‌ సక్సెస్‌ అయ్యారు. ‘పేసీఎం’ పేరుతో సామాన్యుల వరకు ఈ ప్రచారాన్ని తీసుకువెళ్ళారు. అలాగే అమూల్‌ వర్సెస్‌ నందినీ డెయిరీ వ్యవహారాన్ని కన్నడిగుల ఆత్మగౌరవంతో ముడిపెట్టడంతో సునీల్‌ వ్యూహాలు బలంగా పనిచేశాయి. ఐదు గ్యారంటీలతో చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ గెలవగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సునీల్‌ కనుగోలును తన సలహాదారుగా నియమించుకుని కేబినెట్‌ ర్యాంక్‌ ఇచ్చారు. కానీ ఆ పదవిలో సునీల్‌ కనుగోలు చేరలేదు. తెలంగాణలో రూ.500లకే గ్యాస్‌ సిలెండర్‌, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 , ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతుభరోసా కింద ఇస్తున్న మొత్తాన్ని రూ.15వేలకు పెంచడం, కౌలు రైతులకూ ఈ పథకం వర్తింపజేయడం, వ్యవసాయ కార్మికులకు రూ.12వేలు, వరిపంటకు ఏడాదికి రూ. 500 బోనస్‌, గృహజ్యోతి కింద ప్రతి ఇంటికి రూ. 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వడం, ఇందిరమ్మ ఇళ్ళు, యువ వికాసం, చేయూత పథకాలతో కాంగ్రెస్‌ పార్టీ సామాన్యల మనసు గెలుచుకునేలా మేనిఫెస్టో రూపొందించడంలో సునీల్‌ కనుగోలు కీలక పాత్ర పోషించారు. కర్ణాటకతో పాటు తెలంగాణ కోసం వ్యూహాలు సిద్ధం చేస్తూ వస్తున్న సునీల్‌ కనుగోలు టీం హైదరాబాద్‌ లో ఓ వార్‌ రూంను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ వార్‌ రూపంపై 2022 డిసెంబరులో తెలంగాణ పోలీసులు దాడి చేశారు. మైండ్‌ షేర్‌ ఎనలిటిక్స్‌ పేరుతో నడుస్తున్న కార్యాలయం నుంచి కంప్యూటర్లు తీసుకెళ్లారు. ఆయనపై కేసులు పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గౌరవానికి భంగం కలిగించే రీతిలో సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్నారంటూ కేసు నమోదు చేశారు. ఆయన విచారణకు కూడా హాజరయ్యారు. ఓ సందర్భంలో అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. తెలంగాణలో పారిన సునల్‌ కనుగోలు వ్యూహాలు ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ ఘడ్‌, రాజస్థాన్‌ లలో ఎందుకు పారలేదన్నది చాలా మందికి వచ్చే డౌట్‌. అయితే అక్కడ ఉన్న కాంగ్రెస్‌ పెద్ద నాయకులు అశోక్‌ గెహ్లాద్‌, కమల్‌ నాథ్‌ వంటి వారు సునీల్‌ కనుగోలుకు హిందీబెల్ట్‌ రాజకీయాల గురించి తెలియదని.. ఆయన సలహాలు సూచనలు పాటించలేదని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన ఎక్కువగా తెలంగాణపై దృష్టి సారించారని అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *