ఖమ్మంలో జంప్‌ జిలానీలు…

ఖమ్మం, అక్టోబరు 17
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడుతోంది. సీనియర్లు ఇప్పటికే పార్టీ మారిపోగా.. ఎన్నికలకు ముందు ద్వితీయ శ్రేణి నేతలు అదే పని చేస్తున్నారు. వారిని అపడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో చైర్మెన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ అనుచరులందర్నీ కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ, డీసీసీబీ మాజీ చైర్మెన్‌ బాలసాని లక్ష్మీనారాయణ, బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ నగర అధ్యక్షులు, కార్పొరేటర్‌ కమర్తపు మురళి, కార్పొరేటర్లు చావా మాధురి, రావూరి కరుణ, పోట్ల శశికళ భర్తలు చావా నారాయణరావు, రావూరి సైదుబాబు, పోట్ల వీరేందర్‌, మాజీ కార్పొరేటర్‌ చేతుల నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ నేతలు సంక్రాంతి నాగేశ్వరరావు, ఏలూరి శ్రీనివాస్‌.. ఇలా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్‌లో చేరిపోయారు. రేవంత్‌రెడ్డి సమక్షంలో వీరంతా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ మొదటి జాబితా ప్రకటించిన రోజే ఖమ్మం ‘కారు’లో ప్రకంపనలు చోటుచేసుకోవడం కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపగా.. బీఆర్‌ఎస్‌కు మాత్రం ఇది మింగుడు పడని అంశంగా మారింది. నేతలు పార్టీ వీడుతున్నారని తెలిసిన వెంటనే మంత్రి పువ్వాడ అప్రమత్తమయ్యారు. ఆగమేఘాల విూద హైదరాబాద్‌ నుంచి వచ్చి ఆకస్మిక సమావేశం ఏర్పాటు చేశారు. అసంతృప్త నేతలు, కార్పొరేటర్లను బుజ్జగించే ప్రయత్నం చేశారు. తన సన్నిహితులను ఓ కార్పొరేటర్‌ ఇంటికి పంపించి నచ్చజెప్పారు. మరో ముఖ్య నాయకున్ని మమత ఆస్పత్రిలోని మంత్రి ఇంటికి పిలిపించి బుజ్జగించినట్లుగా చెబుతున్నారు. ఇంకా సుమారు ఏడెనిమిది కార్పొరేటర్లు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఇంకా పలువురు ‘హస్తం’ గూటికి చేరతారని, ఆట ఇప్పుడే మొదలైందని పొంగులేటి, తుమ్మల ప్రకటించడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.ఖమ్మంలో పార్టీ నేతలు రాజీనామా చేస్తూండటంతో కేటీఆర్‌ కూడా జోక్యం చేసుకుంటున్నారు. సీనియర్‌ నేతలు వెళ్లిపోయినా వారి అనుచరులకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇస్తున్నారు. తుమ్మల కీలక అనుచరునిగా ఉన్న బాలసాని లక్ష్మీనారాయణకు ఎమ్మెల్సీగా చాన్సిచ్చారు. పువ్వాడ అజరుకుమార్‌ మంత్రయ్యాక జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాలసానికి కాకుండా తాతా మధుసూదన్‌కు బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఇచ్చింది. అప్పటి నుంచి పార్టీలో కాస్తంత అసౌకర్యంగానే బాలసాని ఉంటున్నారు. ఈ క్రమంలో బాలసానిని భద్రాచలం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా పార్టీ నియమించింది. ఆ తర్వాత పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరిన తెల్లం వెంకట్రావును తిరిగి బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న తనకు తెలియకుండా వెంకట్రావును తిరిగి పార్టీలో చేర్చుకోవడమే కాకుండా భద్రాచలం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగానూ ప్రకటించారు. ఇటీవల ప్రకటించిన నియోజకవర్గ ఇన్‌చార్జుల జాబితాలో భద్రాచలం బాధ్యతల నుంచి బాలసానిని తప్పించి ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌కు అప్పగించారు. ఈ పరిణామాలన్నీ బాలసానిని కలిచివేశాయి. దీనికితోడు తన రాజకీయ గురువు తుమ్మల సైతం కాంగ్రెస్‌లో చేరడంతో తాను కూడా ఆయన చెంతకు చేరాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా మంత్రి పువ్వాడ రెండు పర్యాయాలు, మంత్రితో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శనివారం ఖమ్మంలోని బాలసాని ఇంటికి వెళ్లి నచ్చజెప్పారు. కేటీఆర్‌ ఫోన్‌ చేసి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారని చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *