3,4,8,9 తేదీలు… శుభముహూర్తాలు

హైదరాబాద్‌, అక్టోబరు 12, (న్యూస్‌ పల్స్‌)
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. నామినేషన్లకు కూడా త్వరలో తెరలేవనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నవంబర్‌ 3న నామినేషన్లకు నోటిఫికేషన్‌ వస్తుంది. నవంబర్‌ పదో తేదీ దాకా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. అయితే, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందు.. ఒక్క అధికారపార్టీ బీఆర్‌ఎస్‌ మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది.. బీఆర్‌ఎస్‌ అధినేత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు త్వరలోనే అభ్యర్థులకు బీ ఫాంలను అందించనున్నారు. మంగళవారం మంగళకరమైన రోజుగా భావించి ఆ రోజే పనులు చేపట్టేందుకు మొగ్గుచూపేవారూ ఉన్నారు. ఆ కోవలో కొందరు రాజకీయ నేతలు మంగళవారం రోజే నామినేషన్లు వేస్తారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులు, వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ నేత, ధనిక వర్గాలు ఎక్కువగా ఉండే ఓ నియోజకవర్గానికి చెందిన నేత, బీజేపీ కీలక నేత ఒకరు, బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన ఓ సీనియర్‌ నేత ఇలా కొందరు ఈరోజుకు ప్రాధాన్యం ఇస్తారు.రాజకీయ భవిష్యత్‌ను ఓటర్లు ఎలా నిర్ణయించే అవకాశం ఉందో చెప్పమని నేతలు పండితుల వద్ద క్యూ కడుతున్నారు. పుట్టిన తేదీ, వారి నక్షత్రం.. ఇలా గోచార బలాన్ని తెలుసుకుంటున్నారు. సిటీకి చెందిన ఓ మంత్రికి ఈసారి అనుకూల యోగం లేదన్న సమాచారంతో వారి కుటుంబం పరిహార పూజలు ప్రారంభించిందట. ఇక బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన ఓనేత తరపున ఆయన భార్య పూజల్లో నిమగ్నమయ్యారట. విపక్ష పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ త్వరలోనే టికెట్లను ప్రకటించనుంది.నామినేషన్ల దాఖలుకు దాదాపు నెల సమయం ఉంది. అయితే, ఇప్పటికే టికేట్‌ డిసైడ్‌ అయిన అభ్యర్థులు.. టికెట్‌ వస్తుందని ఊహగానాల్లో ఉన్న పలు పార్టీల ఆశావహులు.. ఏ రోజున నామినేషన్‌ వేయాలి, ఏ రోజు ముహూర్తం బాగుంది..? అనే విషయాలు తెలుసుకోవడానికి పండితుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం..అయితే, నామినేషన్లు వేయడానికి ఆ నాలుగు రోజులను మించి ముహుర్తం లేదట. దీంతో నేతలు ఆ నాలుగు రోజుల్లోనే నామినేషన్‌ వేయడానికి రెడీ అవుతున్నారుట. నామినేషన్లకు నవంబర్‌ 3, 4, 8, 9 తేదీలు బాగున్నాయని పండితులు చెబుతున్నారు. ఆ 4 రోజుల్లో తిథి, నక్షత్ర బలం బాగుందని చెబుతున్నారు. దీంతో ఆయా రోజుల్లో ఏ టైమ్‌కి నామినేషన్‌ వేయాలి అనే విషయంపై పండితులను సంప్రదిస్తున్నారు నేతలు. ఆ 4 రోజుల్లోనే మ్యాగ్జిమమ్‌ నామినేషన్లు దాఖలవుతాయని భావిస్తున్నారు.నవంబర్‌ 3.. ఉత్తర నక్షత్రంతో కూడిన శుక్రవారం ముహూర్త బలం బాగా ఉందిట. దీనికితోడు అది శుక్రవారం కావడంతో ముస్లిం అభ్యర్థులు కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది. వారు పవిత్రంగా భావించే శుక్రవారం కావటమే దీనికి కారణం.
నవంబర్‌ 4న.. పుబ్బ నక్షత్రం ఉంటుంది. అది ధన బలం కూడా మెండుగా ఉండే రోజుగా పండితులు పేర్కొంటున్నారు. ఆ రోజు నామినేషన్‌ వేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారని చెబుతున్నారు.
నవంబర్‌ 8న శ్రీరామచంద్రుల వారి నక్షత్రం అయిన పునర్వసు ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ముహూర్తం బానే ఉందంటున్నారు.
నవంబర్‌ 9న విష్ణు తిథిగా పేర్కొనే ఏకాదశి వస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఆ రోజే నామినేషన్‌ దాఖలు చేయనున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇది నామినేషన్ల ఘట్టం ముగియటానికి సరిగ్గా ముందు రోజు కావటం విశేషం.
అయితే, ముహూర్త బలం అభ్యర్థుల విజయావకాశాలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నేతలందరూ వారి చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *