తెలంగాణను వదలని వానలు

తెలంగాణను వర్షాలు వెంటాడి వేధిస్తున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలోనే వానలు దంచి కొడుతున్నాయి. కుండపోత వానలతో రాష్ట్రం అతలాకుతలమైపోతోంది. జనం అష్టకష్టాలూ పడుతున్నారు. వాగులు, వంకలు, చెరువులు పూర్తిగా నిండి పొంగి పొరలుతున్నాయి.వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. జలాశయాలన్నీ జలకళతో కలకలలాడుతున్నాయి. పంటలు నీట మునిగాయి. పాత ఇళ్లు కుప్పకూలాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలు ఇప్పటి వరకూ ఉత్తర తెలంగాణను ముంచెత్తిన వానలు ఇప్పుడు దక్షిణ తెలంగాణను వణికిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాత ఇళ్ల గోడలు కూలి నలుగురు మరణించారు. జాతీయ రహదారిపై వరద నీరు నిలవడంతో రాకపోకలకు అవరోధం ఏర్పడిరది. భద్రాచలం వద్ద వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. పంట నష్టం తీవ్రంగా ఉంది.అయినా ఇప్పటి వరకూ అధికారులు పంట నష్టంపై ఎలాంటి అంచనా వేయలేదు. ఆదుకుంటామని రైతులకు భరోసా కల్పించ లేదు. ప్రకృతి వైపరీత్యాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌ జిల్లా పాతూరులో అత్యధికంగా 26 సెంటి విూటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్‌, జగిత్యాల, జనగామలనూ వర్షాలు ముంచెత్తి పంటలు నీట మునిగాయి. చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. రహదారులపై నీరు నిలుస్తోంది. మెదక్‌ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలోకి నీరు చేరింది. హల్దీ, కూడవెళ్లి, నల్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహబూబ్‌ నగర్‌ జిల్లా ర్సింహులపేట మండలం రాంపురం మధ్యలో బొత్తలపాలెం వద్ద పాలేరు వాగులో చిక్కుకున్న 22 మంది కూలీలను రెవెన్యూ, ఎన్‌ డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. దీంతో ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్‌ గిరిజన సంక్షేమ శాఖ మినీ గురుకులంలోకి వరద నీరు చేరడంతో విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతూ తగ్గుతూ వస్తోంది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *