విజయసాయిరెడ్డికి పూర్వవైభవం..?

వైసీపీలో ఎంపీ విజయ సాయిరెడ్డి మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించారు. గత కొద్ది నెలలుగా తాడేపల్లితో పెరిగిన దూరంతో ఢల్లీికి మాత్రమే పరిమితమైన సాయిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడంతో పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.వైసీపీలో అంతర్గత సమస్యల పరిష్కారం, నాయకుల్ని కట్టడి చేయడం, గ్రూపుల గొడవల్ని దారికి తీసుకురావడంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారని ఈ నేపథ్యంలోనే సాయిరెడ్డికి మళ్లీ బాధ్యతలు అప్పగించారు. ఎంపీ విజయసాయి రెడ్డికి పార్టీలో మళ్లీ మునుపటి గుర్తింపు వచ్చేస్తుందని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది.గత ఏడాది కాలంలో పార్టీలో ఒక్క బాధ్యత నుంచి సాయిరెడ్డిని తప్పిస్తూ వచ్చారు. మొదట ఉత్తరాంధ్ర ఇంఛార్జి బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించారు. సాయిరెడ్డి స్థానంలో వైవీ సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాంధ్ర బాధ్యతలు తప్పించిన సమయంలో పార్టీ అనుబంధ విభాగాలు సాయిరెడ్డి ఆధ్వర్యంలోనే నడిచేవి.విశాఖ నుంచి వచ్చేసిన తర్వాత కొద్ది రోజుల పాటు తాడేపల్లిలోనే సాయిరెడ్డి మకాం వేశారు. వైసీపీ అనుబంధ విభాగాలతో వరుసగా సవిూక్షలు, సమావేశాలు నిర్వహించారు. పార్టీని బలోపేతం చేయడంపై వరుసగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అనూహ్యంగా పార్టీ అనుబంధ విభాగాలకు కూడా వేరే బాధ్యుల్ని నియమించారు. దీంతో సాయిరెడ్డి ఢల్లీికి పరిమితం కావాల్సి వచ్చింది. పార్టీలో అనుబంధ విభాగాలకు వేర్వేరుగా బాధ్యుల్ని నియమించడంతో తాడేపల్లిలో సాయిరెడ్డికి పని లేకుండా పోయింది.పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందే సాయిరెడ్డి తాడేపల్లి రావడం తగ్గిపోయింది. గత కొద్ది నెలలుగా సొంత పార్టీ వారి నుంచే సోషల్‌ విూడియాలో ట్రోలింగ్స్‌ జరుగుతున్నా కూడా సాయిరెడ్డి పెద్దగా స్పందించలేదు. పార్టీ వ్యవహారాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి కీలకం అయ్యారు. పార్టీ నాయకులతో సమావేశాలన్నీ సజ్జల కేంద్రంగానే జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో సాయిరెడ్డి అవసరాన్ని పార్టీ పెద్దలు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది.కీలకమైన విషయాల్లో కటువుగా వ్యవహరించడం, పార్టీ నాయకుల్ని అదుపులో ఉంచే విషయంలో చకచకా నిర్ణయాలు తీసుకోవడానికి సాయిరెడ్డిని మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవహారంలో పార్టీ నేతలు సరిగా వ్యవహరించలేకపోయారని ప్రచారం ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేసే విషయంలో నేతలు ఊగిసలాటకు గురయ్యారని ఖచ్చితమైన ధోరణి ప్రదర్శించ లేకపోయారని చెబుతున్నారు.ఎన్నికలు మరో ఏడాదిలో జరుగనున్న నేపథ్యంలో అందరిని సమన్వయంతో నడిపించడానికే సాయిరెడ్డిని మళ్లీ పిలిపిస్తున్నట్లు చెబుతున్నారు. గత వారం ముఖ్యమంత్రి సాయిరెడ్డితో భేటీ అయ్యారని, కొద్దిరోజుల్లోనే పార్టీ వ్యవహారాలపై సాయిరెడ్డి ఎంట్రీపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలందరిని సమన్వయం చేసే బాధ్యతలు ముఖ్యమంత్రి సాయిరెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. గతంలో ఉత్తరాంధ్ర వరకే సాయిరెడ్డి పరిమితం కాగా ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నాయకుల్ని సమన్వయ పరిచే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *