మార్కెట్లో కొత్త రకం మామిడండి…

పునారస్‌ మామిడికి ప్రస్తుతం గిరాకీ వచ్చింది. మామిడి వేసవి సీజన్‌ పూర్తయిన తరువాత వచ్చే మామిడికాయల రకం ఈ పునారస్‌.. గతంలో కొద్దిగా వచ్చే ఈ కాయలకు గిరాకీ ఉండడంతో ఈ ప్రాంతంలో గత ఐదేళ్లుగా ఈ చెట్లను అధికంగా నాటారు. దీని కారణంగా ప్రస్తుతం ఈ సీజన్‌లో పునారస్‌ మామిడి కాయలు అధికంగా వచ్చాయి. ఉలవపాడు మార్కెట్‌ నుంచి ఈ కాయలు ప్రస్తుతం భారీగా ఎగుమతులు జరుగుతున్నాయి. ఉలవపాడు కేంద్రంగా వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు ఇక్కడకు వస్తారు.ఇక్కడ ఉన్న దళారులు రైతుల నుంచి కాయలను కొనుగోలు చేసి మార్కెట్‌లో తూకం వేసి బస్తాలు, ట్రేలలో లారీలు, మినీ ట్రక్కులు, ఆటోల ద్వారా వివిధ ప్రాంతాలకు ఎగుమతులు చేస్తారు. ఈ ఏడాది మార్కెట్‌లో దాదాపు 10 కేంద్రాల నుంచి కాయల ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా తమిళనాడు, కేరళకు ఈ మామిడికాయలు తరలివెళ్తాయి. పచ్చళ్లకు అధికంగా ఈ కాయలను వినియోగిస్తారు. ఈ ఏడాది రేటు కూడా కాస్త అధికంగానే ఉంది. ఈ వేసవిలో మామిడి కాయలకు పండు ఈగ సోకి కాయల్లో పురుగులు రావడంతో రైతులు నష్టపోయారు. ఈ సమయంలో పునారస్‌ చెట్లు ఉన్న రైతులు ఈ ఏడాది రేటు అధికంగా ఉండడంతో ఊరట ఇచ్చినట్టయింది. నాలుగేళ్ల క్రితం నుంచి పోలిస్తే ఈ ఏడాది పునారస్‌ మామిడి కాయల ఎగుమతులు భారీగా పెరిగాయి. రైతులు సీజన్‌ కాని సమయంలో వస్తున్న కాయలు కావడంతో ఇటీవల కాలంలో ఎక్కువగా సాగు చేశారు. ఉలవపాడు ప్రాంతంలో దాదాపు 4000 ఎకరాలకు పైగా ఈ తోటలు ఉన్నాయి. ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 వేక ఎకరాల్లో పునారస్‌ తోటలు ఉన్నట్లు సమాచారం. కానీ ప్రతి ఏడాదికి వీటి సాగు శాతం పెరుగుతుంది. ఈ ఏడాది గత నెల నుంచి రోజుకు సుమారు 50 నుంచి 80 టన్నుల కాయలు ఎగుమతులు చేస్తున్నారు. ఈ ఏడాది కేజీ 40 నుంచి రూ.50 వరకు పునారస్‌ మామిడి రేటు పలుకుతుంది. గతంలో 25 నుంచి చిన్నగా పెరుగుతూ చివరి దశలో రూ.50కు చేరుకునేది. ఈ సారిమాత్రం రూ.40 నుంచి రూ.50 మధ్యనే ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ మామిడికాయలు చెన్నై, తిరువనంతపురం, కోయంబేడు, కోయంబత్తూరుకు తరలివెళుతున్నాయి. రోజుకు సుమారు 30 నుంచి 50 లక్షల మధ్య ఉలవపాడు మార్కెట్‌లో వ్యాపారం జరుగుతుంది. కేరళలో ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే వచ్చే నెల 8 వరకు జరిగే ఓనమ్‌ పండుగకు ఉలవపాడు పునారస్‌ కాయలు ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అక్కడ పెట్టే పచ్చడికి దీనిని ఉపయోగిస్తారు. ఈ సమయంలో అంటే సెప్టెంబరులో ఇంకా భారీగా రేట్లు పెరుగుతాయి. ఇక్కడ నుంచి ఓనమ్‌ పండుగకు ప్రత్యేకంగా గ్రేడ్‌ చేసిన కాయలను తరలిస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *