చీతా ప్రాజెక్టుకు అడ్డంకులు…

ప్రాజెక్టు చీతా అంశంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. భారత్‌ లో చీతాలను తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నించేందుకు ఎలాంటి కారణం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టు సమర్ధించింది. కునో నేషనల్‌ పార్క్‌లో చీతాల మనుగడ సాధ్యమేనా?.. ప్రాజెక్ట్‌ చీతాను కేంద్రం ప్రారంభించినప్పుడు చాలామంది మేధావులు వ్యక్తం వేసిన ప్రశ్న ఇది. అయితే.. కేంద్రం ఈ ప్రాజెక్టును సవాల్‌గా తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా దాదాపు వంద కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. సౌతాఫ్రికా, నవిూబియా నుంచి భారత్‌కు రప్పించిన 20 చీతాలను నెలల పాటు పర్యవేక్షించి.. కునోలోకి వదిలింది. కానీ, అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న సమయంలో.. నెల వ్యవధిలోనే రెండు చీతాలు కన్నుమూశాయి. ఆ రెండూ ఇన్‌ఫెక్షన్‌లతోనే కన్నుమూశాయన్న అటవీ అధికారులు ప్రకటించారు. అయితే ఈ పరిస్థితిపై సౌతాఫ్రికా అటవీ శాఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపైనే కునో అధికారులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.నవిూబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి తీసుకొచ్చిన 20 చీతా లాల్లో ఆరు చీతాలతో పాటు మూడు కూనలు మృతి చెందాయి. దీనిపై దాఖలైన పిటిషన్‌ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ దాఖలైన పిటిషన్‌ కొట్టివేసింది.1952 తర్వాత భారత్‌ లో చీతాలు అంతరించిపోయినట్లు ప్రకటించిన తర్వాత సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు చీతా ను ప్రారంభించింది. ఇందులో భాగంగా రెండు విడతల్లో నవిూబియా, దక్షిణాఫ్రికా దేశాల నుండి 20 చీతా లను భారత్‌ కు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే నవిూబియా నుంచి తీసుకొచ్చిన సాశా అనే ఆడ చీతా మార్చి 27న దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్‌ అనే మగ చీతా ఏప్రిల్‌ 23న మృతి చెందాయి. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతా ల్లో ఒకటైన ఆడ చీతా దక్ష మే 9న మృతి చెందింది. అదే నెలలో జ్వాలా అనే చీతా కు పుట్టిన నాలుగు కోణాల్లో మూడు చనిపోయాయి. ఈ నెలలో మూడు మరణాలతో కలిపి మొత్తం వీటి మరణాల సంఖ్య 9 కి చేరింది.మరోవైపు చీతా ల కదలికలను గుర్తించేందుకు వాటి మెడలో వేసిన రేడియో కాలర్ల వల్లే అవి మృతి చెందుతున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల వాటిని కూడా తొలగించారు. అయినా ఇటీవల మరో చీతా ప్రాణాలు కోల్పోవడంతో సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో వీటి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందంటూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయస్థానం చీతా లను భారత్‌ లో తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను న్యాయస్థానం సమర్ధించింది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచనలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.ప్రాజెక్టు చీతా కు సంబంధించి తీవ్ర కసరత్తు చేశామని, ప్రతి ఏటా 12`14 చీతా లను దేశానికి తీసుకొచ్చేందుకు ప్రాణాలికలు రచించామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు ఆయా దేశాలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వివరించింది. కొన్ని సమస్యలు వస్తున్న మాట వాస్తవమేనని, అయితే వాటన్నింటినీ అదిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. వాటితో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రస్తుతం చీతా లు మృతి చెందుతున్న పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.సౌతాఫ్రికా ఫారెస్ట్‌, ఫిషరీస్‌, ఎన్విరాన్‌మెంట్‌ విభాగం మధ్యప్రదేశ్‌ కునో నేషనల్‌ పార్క్‌లో సంభవించిన చీతాల మరణంపై స్పందించారు. ఈ ప్రాజెక్టును చేపట్టినప్పుడే.. మరణాలను తాము ఊహించామని వారంటున్నారు. అందుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణంగా భావించవచ్చని చెబుతున్నారు. ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా.. నవిూబియా, సౌతాఫ్రికా నుంచి భారత్‌ చీతాలను తెప్పించుకుంది. ఆ రీలొకేటింగ్‌ టైంలోనే మేం ఈ పరిస్థితిని అంచనా వేశాం. సాధారణంగా వాతావరణ మార్పులను ఒక్కోసారి అవి తట్టుకోలేవు. విపరీతమైన మార్పుల కారణంగానే అవి చనిపోవచ్చు. అలా కునోలో చీతాల మరణాలు మేం ఊహించినవే అని తెలిపారు. అయితే ఏదైనా జబ్బు పడి అవి చనిపోతున్నాయా?, సాధారణ ఇన్‌ఫెక్షన్‌లతోనే చనిపోతున్నాయా? అనేద ఇంకా తేలాల్సి ఉంది. భారత్‌ చేపట్టిన ప్రాజెక్ట్‌ చీతా.. ఒక రిస్కీ ఆపరేషన్‌. పైగా ప్రస్తుతం అది ఇంకా క్రిటికల్‌ ఫేజ్‌కు చేరుకుంది. ఎందుకంటే చీతాలు ఇప్పుడు పరిమిత ప్రాంతంలో లేవు. అవి సంచరించే సరిహద్దులు పెరిగిపోయాయి. కాబట్టి, ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్యం గురించి పర్యవేక్షించడం వాటి సంరక్షకులకు కష్టతరంగా మారొచ్చు. అదే విధంగా వాటికి అయ్యే గాయాల్ని కూడా పర్యవేక్షించడం కష్టమే అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సౌతాఫ్రికాలో చీతాలను భారీ ఎన్‌క్లోజర్‌లో ఉంచుతారు. రోజుకు రెండుసార్లు వాటిని పరిశీలిస్తారు. ఒకవేళ అడవిలో ఉంటే.. బృందాలు వాటిని అనుసరిస్తూ ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తుంటాయి. కానీ, కునో ప్రాంతం ఫెన్సింగ్‌ రక్షిత ప్రాంతం కాదు. అంతేకాదు.. చీతాలకు పోటీగా చిరుతలు, తోడేళ్లు, ఎలుగు బంట్లు, హైనాలు సంచరిస్తుంటాయి. వాటి నుంచి కూడా ముప్పు పొంచి ఉండొచ్చు. వివిధ రకాల వాతావరణాల్లో వివిధ రకాల జంతువులను పరిరక్షించడం అతి పెద్ద సవాల్‌. చీతాల సంరక్షణ మరింత సంక్లిష్టంతో కూడుకున్నది. ఆవాసానికి అలవాటుపడితేనే అవి మనుగడ సాగించగలవని, అప్పటి వరకు వాటిని దగ్గరగా పర్యవేక్షించడమే మంచిదని కునో అధికారులకు సౌతాఫ్రికా అటవీ అధికారులు సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *