జంపింగ్‌ల తలపోట్లు

ఎమ్మెల్యేలు గ్రాఫ్‌ పెంచుకోవాలి. జనాల్లో ఉండాలి. పనితీరు మెరుగు పర్చుకోకపోతే ఉపేక్షించేది లేదు అని ఆ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలతో సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారు సీఎం జగన్‌. వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా మొత్తం వైసీపీ ఎమ్మెల్యేల జాతకాలన్నీ అధినేత దగ్గర ఉన్నాయి. వాటి ఆధారంగానే హెచ్చరికలు చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. వచ్చే ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇన్నాళ్లూ సంక్షేమ కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెట్టిన సీఎం జగన్‌.. రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారం చేపట్టే దిశగా రాజకీయంగా పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేలు మారాలని చెప్పారు. అది వినని ఎమ్మెల్యేలనే మార్చే పనిలో పడ్డారు వైసీపీ అధినేత. ఇప్పుడున్న ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ప్రజల్లో వారికి లభిస్తున్న ఆదరణ..! ఇలా కొన్ని కొలమానాలను నిర్దేశించుకుని ప్రక్షాళన మొదలుపెట్టారు. దానికి తాడికొండ నుంచి శ్రీకారం చుట్టడంతో అధికారపార్టీలో అలజడి మొదలైంది. నెక్స్ట్‌ ఎవరు.. ఏ నియోజకవర్గం అనే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో పెరుగుతోంది.తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పక్కన పెట్టి.. అక్కడ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను వైసీపీ అదనపు సమన్వయకర్తగా నియమించింది. ఆ నిర్ణయం వెలువడగానే ఎమ్మెల్యే శ్రీదేవితోపాటు ఆమె అనుచరులు భగ్గుమన్నారు. రోడ్డెక్కి చేయాల్సిన రచ్చంతా చేశారు. కానీ.. వైసీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే శ్రీదేవి అండ్‌ కో చేపట్టిన ఆందోళనలను లైట్‌ తీసుకున్నట్టుగా సమాచారం. మూడేళ్లుగా తాడికొండలో జరిగిన పరిణామాలు.. శ్రీదేవి చుట్టూ ముసిరిన వివాదాలు పరిశీలించిన తర్వాత డొక్కాను తెరపైకి తీసుకొచ్చింది. ఇదే విధంగా రాష్ట్రంలోని కొన్ని నియోకజకవర్గాల్లో కఠిన నిర్ణయాలు ఉంటాయని సమాచారం.విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. వైసీపీ పెద్దల దగ్గర ప్రక్షాళన చేపట్టాల్సిన జాబితాలో 40 నియోజకవర్గాలు ఉన్నాయట. వాటిలో తొలి విడతగా 16 చోట్ల చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వ్యవహారాలు.. ప్రజల్లో వారికి ఉన్న ఆదరణ.. వివాదాలు.. నెగ్గుతారా లేదా అనే అంశాల ఆధారంగా సిట్టింగ్‌ శాసనసభ్యులపై నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే నెగ్గలేరు అని భావిస్తే.. అక్కడ సమర్ధులైన మరో వైసీపీ నేతకు పగ్గాలు అప్పగిస్తారని చెబుతున్నారు. తాడికొండలో డొక్కాను తెరపైకి తెచ్చిన విషయాన్ని ఉదహరిస్తున్నాయి పార్టీ వర్గాలు. ఎమ్మెల్యేలను రెండేళ్ల ముందే పక్కన పెట్టేలా చర్యలు ఉండటంతో ప్రాధాన్యం నెలకొంది.కొంత మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగోక పోయినా.. వారికి ఫాలోయింగ్‌.. ఇతర సవిూకరణాలు ముడి పడి ఉంటే ప్లేస్‌ మార్చొచ్చని చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికలకు రెండేళ్లముందే రిపేర్లు చేపట్టడం వెనక పెద్ద వ్యూహమే ఉందట. ఎన్నికల సమయంలో సిట్టింగ్‌లను కాదని వేరొకరికి టికెట్స్‌ ఇస్తే రాజకీయంగా లేని పోని చికాకులు.. గొడవలు వస్తాయి. అదే ముందే క్లారిటీ ఇచ్చేస్తే మంచిదనే లెక్కల్లో ఉన్నారట అధికారపార్టీ నేతలు. చివరి నిమిషంలో జంపింగ్‌ల తలపోట్లు లేకుండా ఉంటాయని భావిస్తున్నారట. ఎమ్మెల్యేలను ఇప్పుడే పక్కన పెట్టేస్తే అక్కడ ప్రజలకు స్పష్టత వస్తుంది.. పార్టీ బలోపేతానికి ప్రత్యేక ఫోకస్‌ పెట్టొచ్చనే చర్చ నడుస్తోందట.ఇంత వరకు బాగానే ఉన్నా.. వైసీపీ అధిష్ఠానం దగ్గరున్న జాబితాలోని 40 మంది ఎవరు అనేదే ఉత్కంఠ రేపుతోంది. అందులోనూ తొలి జాబితాలో 16 అని తెలియడంతో.. తాడికొండ తర్వాత ఎవరు ఏంటీ అనే ఆసక్తి పెరిగిపోతోంది. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చేందుకు అధిష్ఠానం కఠిన వైఖరే తీసుకున్నట్టు అర్థం అవుతోంది. దీంతో ఇన్నాళ్లూ సీఎం మాటలను లైట్‌ తీసుకున్నవాళ్లూ .. గ్రాఫ్‌ బోర్డర్‌లో ఉన్నవాళ్లూ సెట్‌ అవుతారని అనుకుంటున్నారు. మరి.. ఈ వైసీపీ జాబితాలో ఉన్నవాళ్లు ఎవరో కాలమే చెప్పాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *