హైదరాబాద్‌ లో రియల్‌ బూమ్‌

హైదరాబాద్‌, జూలై 6
రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ధరలు తగ్గుతుంటే భాగ్యనగరంలో ఇళ్ల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ముంబయి, దిల్లీ వంటి నగరాల్లో అమ్మకాలు పడిపోగా ఇక్కడ మాత్రం పెరుగుతున్నాయి. మొత్తంగా హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా`2023 అర్ధవార్షిక రిపోర్టులో పేర్కొంది.హైదరాబాద్‌ నగరంలో నివాస యోగ్యమైన ఇళ్ల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన ఐదు శాతం పెరిగాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదిక తెలిపింది. మరోవైపు ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో విక్రయాలు వరుసగా 8, 2 శాతం తగ్గాయి. ఇక భాగ్యనగరంలో ఇళ్ల ధరలు సైతం ఏడాది ప్రాతిపదికన 10 శాతం పెరిగాయి. మిగిలిన మార్కెట్లు అన్నింటితో పోలిస్తే ఇక్కడే ఎక్కువ కావడం విశేషం. గత 12 నెలలతో పోల్చితే అత్యధికంగా హైదరాబాద్‌ లో ఇళ్ల ధరలు 10 శాతం పెరిగాయి. ముంబైలో 6 శాతం, ఢల్లీి ఎన్‌సీఆర్‌ పరిధిలో, బెంగళూరులో 5 శాతం చొప్పున, అహ్మదాబాద్‌ లో 4 శాతం, పుణే, చెన్నైలలో 3 శాతం, కోల్‌ కతా నగరంలో 2 శాతం మేర మాత్రమే ఇళ్ల ధరలు పెరిగాయి.కొన్నేళ్లుగా భూముల ధరలు క్రమంగా పెరగడం ఇళ్ల ధరలపై ప్రభావం చూపిస్తోంది. ధరలు ఎంత పెరుగుతున్నా ఇన్వెస్టర్లు, వినియోగదారులు తాము కోరుకున్న ప్రాంతంలో కొనుగోలు చేస్తూనే ఉన్నారని నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది. 2023 తొలి అర్ధభాగంలో వార్షిక ప్రాతిపదికన ఇళ్లు విక్రయాలు ఐదు శాతం పెరిగి 15,355కు చేరుకున్నాయి. దేశంలోని ఎనిమిది ప్రముఖ నగరాల్లో హైదరాబాద్‌లోనే అత్యధిక విక్రయాలు నమోదవ్వడం గమనార్హం. కొవిడ్‌ నుంచి రియల్‌ ఎస్టేట్‌పై సానుకూల ప్రభావం కనిపిస్తోంది.ఇక దేశవ్యాప్తంగా తొలి ఆరు నెలల్లో 1,56,640 యూనిట్లు అమ్ముడయ్యాయని నైట్‌ఫ్రాంక్‌ రిపోర్టు నివేదించింది. ఇంటి అమ్మకాల్లో హైదరాబాద్‌ పశ్చిమ భాగం దుమ్మురేపుతోంది. నగరంలోని మొత్తం అమ్మకాల్లో 60 శాతం పశ్చిమ భాగంలో జరుగుతున్నాయి. హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, మాదాపుర్‌, గచ్చిబౌలి, నానాక్‌రామ్‌, కొండాపుర్‌ వంటి ప్రాంతాల్లో ఇళ్ల డిమాండ్‌ విపరీతంగా కనిపిస్తోంది. రహదారులు, మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటం, ఆస్తి విలువ పెరుగుతుండటమే ఇందుకు కారణాలు.ఈ ఏడాది తొలి అర్ధభాగంలో డెవలపర్లు 22,851 యూనిట్లను ఆవిష్కరించారు. అందులో 42 శాతం ఇళ్ల ధరలు కోటి రూపాయల వరకు ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టుల్లో 58 శాతం హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలోనే మొదలయ్యాయి. ప్రాంతాల వారీగా చూసుకుంటే కోకాపేట, మణికొండకు తిరుగులేదు. 2022లో తొలి 6 నెలల్లో కోటి రూపాయల ఇండ్లు 32 శాతం విక్రయాలు జరగగా, ఈ ఏడాది అదే సమయంలో 45 శాతానికి చేరింది. అంటే కోటి రూపాయల పైగా ధర పలుకుతున్నా ఆ ఇళ్లనే అధికంగా కొంటున్నారు. మరోవైపు 50 లక్షల నుంచి రూ.1 కోటి ధర లోపు ఉంటే ఇళ్ల విక్రయాల వాటా సైతం 42 శాతంగా ఉంది. అంటే 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ధర పలుకుతున్న ఇళ్లను భాగ్యనగర వాసులు అధికంటా కొంటున్నారు. మొత్తం విక్రయాలలో వీటి వాటా 87 శాతం ఉన్నాయి. రూ.50 లక్షల లోపు ధర ఉన్న ఇళ్లు 13 శాతం మేర విక్రయాలు జరిగాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా`2023 అర్ధవార్షిక రిపోర్టులో పేర్కొందిగతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే మణికొండలో 39 శాతం, కోకా పేటలో 28 శాతం ధరలు పెరిగాయి. ఇక్కడ స్క్వేర్‌ ఫీట్‌ సగటు ధర రూ.8000 వరకు పలుకుతోంది. బంజారాహిల్స్‌ 12 శాతం, ఎల్బీనగర్‌లో 22 శాతం, నాచారంలో 16 శాతం, సైనిక్‌పురిలో 38 శాతం, బండ్లగూడలో 33 శాతం పెరిగాయి. రాజేంద్రనగర్లో 12 శాతం తగ్గాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *