ప్లాట్ల పేరిట అక్రమ లేఔట్లు

మహబూబ్‌ నగర్‌, జూన్‌ 30
గజాల్లో వసూళ్లు.. గుంటల్లో రిజిస్ట్రేషన్లు. ఫామ్‌ ప్లాట్ల పేరిట వందల ఎకరాల్లో లే అవుట్లు చేసి అమ్మేస్తున్నారు. ఒక్క సారి పెట్టుబడి పెడితే ప్రతి ఏటా ఆదాయం సమకూరుతుందంటూ దగా చేస్తున్నారు. 12 ఏండ్ల తామే చెట్లు పెంచి ఆదాయం మాత్రం విూకిచ్చేస్తామంటూ ఒప్పందాలు రాసుకుంటున్నారు. ఐతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు పెరిగాయి. ఈ క్రమంలో వందల ఎకరాలు ఈ కంపెనీలకు ఎలా వస్తున్నాయో అర్ధం కావడం లేదు. పట్టా భూమిగా ఉన్న సర్వే నంబర్లతో అమ్మేస్తున్నారు. పొషిషన్‌ మాత్రం అసైన్డ్‌/ప్రభుత్వ భూముల్లో చూపిస్తున్నారు. వందల ఎకరాల్లో ప్రాజెక్టులంటూ జనాన్ని మభ్యపెడుతున్నారు. ఒకే చోట అంతేసి ల్యాండ్‌ దొరకడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఒక ఊరిలో ఒకే చోట వందల ఎకరాల భూమిని రైతులు అమ్ముకోవడం అసాధ్యం. పైగా ఆ భూములన్నీ ఒకే క్లాసిఫికేషన్‌ పట్టాగా ఉండడం కూడా సందేహమేఇదే క్రమంలో ఓ రియల్‌ ఎస్టేట్‌ బడా కంపెనీ 270 ఎకరాల భారీ లే అవుట్‌ అంటూ ప్రచారం చేస్తున్నది. లే అవుట్‌ వేసింది. రోడ్లు చూపించింది. సకల సౌకర్యాలు కల్పిస్తామని బ్రోచర్లలో పేర్కొన్నది. రెవెన్యూ రికార్డులు, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ డేటాను వెరిఫై చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పట్టా భూములను రిజిస్ట్రేషన్‌ లో చూపించి వివాదాస్పద భూముల్లో పొషిషన్‌ చూపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ లో విల్డ్‌ ఉడ్స్‌ విత్‌ ఇన్ఫినిటీ పాజిబిలిటీస్‌ పేరిట గోల్డ్‌ స్క్వేర్‌ ఎవెన్యూస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే కంపెనీ ఏకంగా 270 ఎకరాల లే అవుట్‌ వేశారు. అందులో మహాగని, అంజీర్‌, మునగ వంటి ప్లాంటేషన్‌ చేసి ఇస్తామంటూ మార్కెటింగ్‌ చేస్తున్నారు. అర్బన్‌ ఫామ్‌ ల్యాండ్‌, అగ్రో ఫారెస్ట్రీ అంటూ కొత్త పేరును తెర విూదికి తీసుకొచ్చారు. ఈ లే అవుట్‌ లో ప్రభుత్వ భూమి, కోర్టు కేసుల్లో ఉన్న భూమి ఉన్నట్లు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.గోల్డ్‌ స్క్వేర్‌ ఎవెన్యూస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే కంపెనీకి సంబంధించిన మాత్రం గోల్డ్‌ స్క్వేర్‌ ఎల్లప్పుడూ కస్టమర్ల అవసరాలను తీరుస్తుందని, ఎప్పుడూ బెస్ట్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. అలాగే క్లియర్‌ టైటిల్‌, అప్రూవ్డ్‌ వెంచర్స్‌ మాత్రమే ఉంటాయన్నారు. డీటీసీపీ, హెచ్‌ఎండీఏ, టీఎస్‌ రెరా అప్రూవ్‌ చేసి లే అవుట్లలోనే ప్లాట్లను అమ్ముతామంటూ పేరిట పేర్కొన్నారు. అలాగే గంధపు చెట్లు, ఆర్గానిక్‌ వెజిటెబుల్‌ ఫామింగ్‌ తో ఫామ్‌ ల్యాండ్స్‌ అమ్ముతామన్నారు. విూ పెట్టుబడి మా బాధ్యత అంటూ నినాదం అందుకున్నారు. కానీ 270 ఎకరాల్లో వేసిన లే అవుట్‌ భూములపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 605 గజాలకు రూ.5 లక్షలు అంటూ రేట్లు పెట్టి మార్కెటింగ్‌ చేస్తున్నారు. కానీ అక్కడ అంత ధర పెట్టడంపై అనుమానాలు కలుగుతున్నాయి.గోల్డ్‌ స్క్వేర్‌ ఎవెన్యూస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే కంపెనీ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగూర్‌ లో సర్వే నం.48, 49, 52, 53, 54, భీమ్రాలో సర్వే నం.107, 108 లో ఈ లే అవుట్‌ వేశారు. లే అవుట్‌ రెండు గ్రామాల పరిధిలో విస్తరించింది. కాగితాల విూద పెద్ద పెద్ద రోడ్లు చూపించారు. ఐతే నాగూర్‌(కె) సర్వే నం.54 ప్రభుత్వ భూమిగా రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ రికార్డుల్లో నమోదైంది. 54లోని 33.02 ఎకరాలు ప్రభుత్వ భూమిగా లేఖ నం.బి/752/2006 ప్రకారం పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్‌/లావునీ పట్టాలుగా ఉన్నాయి. అలాగే భీమ్రాలో సర్వే నం.107లోని 11.43 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉన్నది. లేఖ నం.బి/24/ఎమ్మార్వో/సీసీ ప్రకారంగా నమోదు చేశారు. అలాగే సర్వే నం.108లోని 10.18 ఎకరాలపై కోర్టు స్టే ఉన్నది. ఓఎస్‌ నం.04/2020 ప్రకారమని ఐజీఆర్‌ఎస్‌ వెబ్‌ సైట్‌ లో ఉన్నది. ఇదిలా ఉండగా ఈ భూముల్లో లే అవుట్‌ చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. కంపెనీకి సహకరిస్తూ రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ భూములను పట్టా భూములుగా చిత్రీకరించి సేల్‌ డీడ్స్‌ చేస్తుండడాన్ని గుర్తించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గతంలో తహశీల్దార్‌ ఇచ్చిన సర్క్యూలర్‌ ప్రకారమే స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ వెబ్‌ సైట్‌ లో నిషేదిత ఆస్తుల జాబితాలో నమోదు చేశారు. అలాగే కొన్ని భూములపై కోర్టు కేసులు ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నది. ఐతేనేం? కంపెనీ లే అవుట్‌ చేసేసింది.. తాము రిజిస్ట్రేషన్లు చేస్తున్నామన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు.సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా సర్వే నం.108/ఆ లోని 5 గుంటల భూమిని జూన్‌ 14న జగద్గిరిగుట్ట ఆల్విన్‌ కాలనీకి చెందిన ఒకామెకు గోల్డ్‌ స్క్వేర్‌ ఎవెన్యూస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అమ్మింది. దాని ప్రకారం 5 గుంటలకు గాను రూ.50 వేల విలువ మాత్రమే కట్టారు. దానికే స్టాంప్‌ డ్యూటీ చెల్లించారు. మార్కెటింగ్‌ మాత్రం రూ.5 లక్షలుగా ప్రచారం చేస్తున్నారు. కస్టమర్ల దగ్గర కూడా అంతే వసూలు చేస్తున్నారు. కానీ రిజిస్ట్రేషన్‌ విలువకొచ్చే సరికి 10 శాతానికి పరిమితం చేస్తున్నారు. మిగతా 90 శాతం లెక్కల్లోకి రావడం లేదు. ఎస్‌ ఆర్‌ నగర్‌ కి చెందిన మరొకరికి రెండున్నర గుంటలు అమ్మారు. అందులోనూ రిజిస్ట్రేషన్‌ విలువ రూ.25 వేలకు పరిమితం చేశారు. కంపెనీ తరపున యు.ఉదయ్‌ సాయి కృష్ణ వ్యవహరిస్తున్నట్లు సేల్‌ డీడ్స్‌ ని బట్టి తెలుస్తున్నది. గోల్డ్‌ స్క్వేర్‌ ఎవెన్యూస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే కంపెనీ తో రూపొందించిన ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీ గండిపడుతుంది. కస్టమర్లకు చెప్పిన రేట్లకు రిజిస్ట్రేషన్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది.12 సంవత్సరాల పాటు ఉచితంగా నిర్వహిస్తామని, మూడో ఏడాది నుంచి ఆదాయం సమకూరుతుందంటూ అందమైన బ్రోచర్లు కొట్టి ప్రచారం సాగిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ ఉచితం అంటూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. హార్స్‌ రైడిరగ్‌, ట్రెక్కింగ్‌, జీప్‌ రైడ్‌, గోశాల, మడ్‌ బాత్‌, గేమ్స్‌ వంటి అనేక సదుపాయాలు కల్పిస్తామంటున్నారు. మహాగని, అంజీర్‌, అన్నట్టో సీడ్స్‌, మునగ వంటివి నాటడం ద్వారా ప్రతి ఏటా రూ.35 వేలకు పైగా ఆదాయం లభిస్తుందని ప్రచారం చేస్తున్నారు. మహాగని ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, హైపర్‌ టెన్షన్‌ ని తగ్గిస్తుంది. అన్నట్టో సీడ్స్‌ వల్ల యాంటీ ఆక్సిడెంట్‌ ప్రాపర్టీస్‌ ఉంటాయని, కళ్ల చూపును మెరుగుపరుస్తాయి. మునగ వల్ల న్యూట్రిషన్స్‌, విటమిన్స్‌, మినరల్స్‌ పొందొచ్చు. అంజీర్‌ వల్ల న్యూట్రియెంట్స్‌, మెగ్రీషియం, విటమిన్‌ సి, ఇ వంటివి లభిస్తాయంటూ అందమైన బ్రోచర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీ చూపించే సర్వే నంబర్లు, క్షేత్ర స్థాయిలో భూమి, రెవెన్యూ రికార్డులు, పీవోబీ జాబితా, కోర్టు కేసులన్నీ పరిశీలించిన తర్వాతే ప్లాట్లు కొనుగోలు చేయాలని రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *