అఖిలమ్మకు ఇంటి పోరు

ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మళ్లీ వార్తల్లో నిలిచారు. భూమా అఖిల ప్రియ, ఆమె సోదరి భూమా మోనికపై వీరి సోదరుడు భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే అందుకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. గతంలో జిల్లా కోర్టులో తన అక్కలపై వేసిన కేసు నిలబడకపోవడంతో సోదరుడు జగన్‌ విఖ్యాత్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం మంచిరేవుల్లో సర్వే నెంబర్‌ 190, 192/ఏ, 192/బీలలో భూమా నాగిరెడ్డి భార్య భూమా శోభానాగిరెడ్డి పేరు విూద వెయ్యి గజాల స్థలం ఉంది. ఆమె 2014లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత ఆమె భర్త భూమా నాగిరెడ్డి రెండు కోట్ల రూపాయిలకు ఆ స్థలం విక్రయించినట్లు తెలుస్తోంది. స్థలం విక్రయించే క్రమంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో భూమా నాగిరెడ్డి, ఆయన ఇద్దరు కుమార్తెలు అఖిల ప్రియ, మౌనిక సంతకాలు చేయగా, భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి వేలు ముద్ర వేసినట్లు సమాచారం. అయితే స్థలం విక్రయించిన సమయంలో తన వయస్సు 17 సంవత్సరాలని.. అప్పుడు తాను మైనర్‌ అని.. ఇది చెల్లదని.. తనకు ఆ స్థలంలో వాటా వస్తుందంటూ జగత్‌ విఖ్యాత రెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు. ఆ క్రమంలో స్థలాన్ని కోనుగోలు చేసిన అయిదుగు వ్యక్తులతోపాటు తన ఇద్దరు అక్కలపై కోర్టులో కేసు వేశాడు. ఆ కోర్టు వీరి వాదనలు విని ఈ కేసును కోట్టేసింది. దీంతో జగన్‌ విఖ్యాత్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు.మరోవైపు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలదీ సుధీర్ఘ రాజకీయం జీవితం.. తల్లి ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన భూమా అఖిల ప్రియ ఆ తర్వాత ఆళ్లగడ్డ నుంచి వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం తండ్రి నాగిరెడ్డితో కలిసి.. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతలో ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో, అఖిల ప్రియకు చంద్రబాబు కేబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా చోటు కల్పించారు.అలా మంత్రి అయిన అఖిల ప్రియ.. ఆ తర్వాత.. అంటే 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అఖిల ప్రియ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. తన తండ్రి నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయించడానికి సుపారీ ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే హైదరాబాద్‌ నగరంలో ఓ స్థల వివాదంలో సీఎం కేసీఆర్‌ సవిూప బంధువు కిడ్నాప్‌ చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో ఆమె జైలుకు వెళ్లి, ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆమె తాత ఎస్వీ సుబ్బారెడ్డి, మేనమామ ఎస్వీ మోహన్‌ రెడ్డి గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రస్తుతం ఎస్వీ మోహన్‌ రెడ్డి కర్నూలు జిల్లాలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంత మంది ఉన్నా.. భూమా అఖిల ప్రియ ఫ్యామిలీలో.. ఇలాంటి వివాదాలు చుట్టుముట్టడం పట్ల భూమా వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు భూమా నాగిరెడ్డి, భూమా శోభ నాగిరెడ్డిల దంపతులు ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ ఎలా ఉంది… నేడు ఎలా ఉందని ఓ చర్చ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జోరుగా నడుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *