ధోని బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నందిగామలో భారీ కటౌట్లు ఏర్పాటు

మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానుల్లో ఎక్కడా లేని ఉత్సాహం తన్నుకువస్తుంది. ధోని (mahendra singh dhoni) ఆడుతున్నాడంటే చాలు స్టేడియాలన్నీ అతని నామ జపంతో మార్మోగిపోతాయి. ధోని బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వచ్చినా, వికెట్ల వెనకాల నిల్చున్న, బ్యాట్‌తో సిక్సర్లు బాదినా, తన స్టంపింగ్‌తో వికెట్లను గిరాటేసిన స్టేడియంలో అభిమానుల అరుపులకు అలపు ఉండదు. అది ఒక్క స్టేడియం వరకే పరిమితమవుతుందనుకుంటే పొరపాటే. టీవీలకు, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లకు ధోని ఆట చూడడానికి అభిమానులు అతుక్కుపోతారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023లో ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓటీటీలో బద్దలైన లైవ్ వ్యూయర్‌షిప్ రికార్డులే ఇందుకు నిదర్శనం. ధోనికున్న అభిమాన ఘనం గురించి చెప్పుకోవాలంటే ఓ రోజైనా సరిపోదు. ధోని అభిమానులకు ప్రాంతాలతో, కులాలతో, మతాలతో సంబంధం లేదు. ప్రపంచవ్యాప్తంగా ధోని అభిమానులు ఉన్నారు.

ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ మహేంద్రుడిగా భారీగా అభిమానులున్నారు. దీంతో పుట్టిన రోజు సందర్భంగా ధోనికి (dhoni birthday) తెలుగు రాష్ట్రాల అభిమానులు భారీ బహుమతి ఇవ్వబోతున్నారు. అమోఘమైన అభిమాన ఘనం ఉన్న ధోని శుక్రవారం నాడు 42వ ఏట అడుగుపెడుతున్నాడు. దీంతో ధోని పుట్టిన రోజు వేడుకల (dhoni birthday celebrations) కోసం అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ధోని భారీ కటౌట్లను ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో 52 అడుగుల ధోని భారీ కటౌట్‌ను సిద్ధం చేశారు. ఈ కటౌట్‌ను ధోని పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారంనాడు ఆవిష్కరించనున్నారు. అలాగే భారీ కేక్‌ను కట్ చేయనున్నారు. 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో ధోని బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వస్తున్న ఫోజ్‌తో కటౌట్‌ను తయారు చేశారు. ఈ కటౌట్‌పై తెలుగు ఎంఎస్ఆడియన్స్ అనే స్టిక్కర్ కూడా వేశారు. సాధారణంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సినిమా హిరోల కటౌట్లను ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో క్రికెటర్ల కటౌట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పుట్టిన రోజుల సందర్భంగా కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వారి కటౌట్లను ఏర్పాటు చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామలో కూడా ధోని భారీ కటౌట్‌ను ఆవిష్కరించనున్నారు. ఏకంగా 77 అడుగుల భారీ కటౌట్‌ను సిద్ధం చేశారు. ఓ క్రీడాకారుడికి ఏర్పాటు చేసిన అతిపెద్ద కటౌట్‌గా ఇది నిలవనుంది. దీనిని కూడా ధోని పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ధోని భారీ కటౌట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా ధోని కటౌట్లను ఏర్పాటు చేయడం ఇది కొత్తేం కాదు. మొదటిసారి 2018లో కేరళలో 35 అడుగుల ధోని కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చెన్నైలో 30 అడుగుల కటౌట్, విజయవాడలో 41 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. మరోవైపు ధోని పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారంనాడు ఆయన బయోపిక్ సినిమా ధోని అన్ టోల్డ్ స్టోరీని రీరిలీజ్ చేయనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *